గంగవ్వకు ఇచ్చిన మాట నాగార్జున నిలబెట్టుకుంటారా?
on Nov 21, 2020
'మై విలేజ్ షో' ద్వారా యూట్యూబ్ వీక్షకులకు మాత్రమే తెలిసిన గంగవ్వ పేరు ఇవాళ చాలామందికి తెలిసిందంటే అందుకు కారణం బిగ్ బాస్ షో. 65 సంవత్సరాల ఒక వృద్ధురాలు ఈ షోలో పాల్గొనడం ఇదే తొలిసారి. అనారోగ్యం కారణంగా తనంతట తానుగా ఆ షో నుంచి గంగవ్వ వైదొలగకపోయినట్లయితే ఇప్పటికీ ఆ షోలో ఆమె కొనసాగుతూ ఉండేదని చాలా మంది నమ్ముతున్నారు. మిగతావారిలా గేమ్స్ ఆడలేకపోయినా, తన స్వచ్ఛమైన మనసు, అమాయకత్వంతో ఆమె వీక్షకుల హృదయాలనే కాదు, హౌస్మేట్స్ ఆదరాన్నీ పొందారు.
ఈ షోలో పాల్గొన్నందుకు తనకు వారానికి రెండు లక్షల రూపాయలు ఇచ్చారని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బహిర్గతం చేసేశారు గంగవ్వ. అంటే ఐదు వారాల పాటు హౌస్లో కొనసాగినందున ఆమెకు పది లక్షలు అందాయన్న మాట. ఇది మంచి రెమ్యూనరేషన్గానే చెప్పుకోవచ్చు. కాగా హౌస్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఆమెకు ఇల్లు కట్టిస్తానని హోస్ట్ నాగార్జున మాటిచ్చారు.
నిజంగానే నాగార్జున ఆమెకు ఇల్లు కట్టిస్తారా? అనే విషయం ఆన్లైన్లో చర్చకు వస్తోంది. నాగార్జున ఆ హామీని వ్యక్తిగతంగా ఇచ్చారా? లేక బిగ్ బాస్ షో నిర్వాహకుల తరపున ఇచ్చారా? అనే విషయం స్పష్టం కాలేదు. చాలా మందైతే వ్యక్తిగతంగానే నాగార్జున ఆమెకు ఆ హామీ ఇచ్చారని అభిప్రాయపడుతున్నారు. అయితే ఆయన ఎప్పుడు తన మాటను నిలబెట్టుకుంటారు? అసలు నిలబెట్టుకుంటారా? అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. గంగవ్వ అయితే నాగార్జున ఇచ్చిన హామీని గట్టిగా విశ్వసిస్తున్నారు. ఆమె ఆశల్ని నాగార్జున నెరవేరుస్తారా? బిలియనీర్ అయిన ఆయనకు ఇది పెద్ద విషయం కాదు కదా! చూడాలి.. నాగ్ తన మాటను ఎప్పుడు నిలబెట్టుకుంటారో...
- YM
Also Read