అనాలిసిస్: బీబీ3తో బాలయ్యకు గత వైభవం సాధ్యమేనా?
on Nov 22, 2020
'లక్ష్మీ నరసింహా' చిత్రం తర్వాత మళ్లీ హిట్ రావడానికి బాలకృష్ణకు ఆరేళ్ల పట్టింది. 'సింహా' (2010)తో ఆ హిట్‌ను సాధించి, రేసులో నిలిచిన ఆయనకు మళ్లీ వరుసగా ఐదు సినిమాలు వాణిజ్యపరంగా నిరాశను కలిగించాయి. 'శ్రీరామరాజ్యం'లో శ్రీరామునిగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నప్పటికీ, నిర్మాతలకు ఆ సినిమా నష్టాలనే మిగిల్చింది. ఈ నేపథ్యంలో ఆయనకు మరో హిట్ రావడానికి మరో నాలుగేళ్లు పట్టింది. ఈసారి 'లెజెండ్' (2014)తో ఆయన జూలు విదిల్చారు. రూ. 40 కోట్ల క్లబ్బులో మొదటిసారిగా అడుగుపెట్టారు. అప్పుడు 'సింహా', తర్వాత 'లెజెండ్'తో ఆయనకు హిట్లిచ్చిన ఘనతను సొంతం చేసుకున్నాడు దర్శకుడు బోయపాటి శ్రీను. 'సింహా' తరహాలోనే 'లెజెండ్'లోనూ బాలయ్య ద్విపాత్రల్లో చెలరేగిపోయారు.
ఆ సినిమా తర్వాత రెండు సినిమాలు నిరాశపరిచినా 100వ సినిమా ఆయనకు సంతోషాన్నిచ్చింది. అది.. క్రిష్ డైరెక్షన్లో చేసిన 'గౌతమిపుత్ర శాతకర్ణి' (2017). తెలుగు సంవత్సరాది ఉగాదిని జరుపుకోవడానికి కారకుడినైన చారిత్రక పురుషుడు శాతకర్ణి పాత్రలో బాలయ్య అలరించారు. షరా మామూలే అన్నట్లు ఆ సినిమా తర్వాత ఆయనకు మళ్లీ ఆ తరహా విజయం దక్కలేదు. ఈలోపు ఐదు సినిమాలు వచ్చినా ఏదీ ఆయన ఫ్యాన్స్‌ను మెప్పించలేకపోయింది. ముఖ్యంగా తండ్రి విశ్వవిఖ్యాత నందమూరి తారకరామారావు బయోపిక్ ఆయనకు షాక్‌నిచ్చింది. రెండు భాగాలుగా 'యన్టీఆర్: కథానాయకుడు', 'యన్టీఆర్: మహానాయకుడు' పేర్లతో వచ్చిన ఆ సినిమాతో బయ్యర్లు నిండా మునిగిపోయారు. తండ్రి పాత్రలో బాలయ్యను ప్రేక్షకులు ఆమోదించలేదు.
వాటి తర్వాత వచ్చిన 'రూలర్' కూడా డిజాస్టరై ఆయన కెరీర్‌ను మరోసారి ప్రశ్నార్థకం చేసింది. ఈ నేపథ్యంలో ఆయన గతంలో తనను రెండు సార్లు గట్టెక్కించిన బోయపాటి శ్రీనుని మరోసారి నమ్ముకున్నారు. ఇంకా టైటిల్ నిర్ణయించని ఈ సినిమాను బీబీ3గా ప్రస్తుతానికి పిలుస్తున్నారు. ఇందులో నాయికల ఎంపిక ఓ తలనొప్పిగా మారింది బోయపాటికి. ఇద్దరు నాయికలుండే ఈ మూవీలో అనేక పేర్లు వినిపించాయి. ఎట్టకేలకు 'అఖిల్' ఫేమ్ సాయేషాను ఓ నాయికగా ఎంపిక చేశారు. పూర్ణ మరో నాయిక అంటున్నారు.
మునుపటి రెండు సినిమాలు.. 'సింహా', 'లెజెండ్' తరహాలోనే బోయపాటి కాంబినేషన్లోని ఈ మూడో సినిమాలోనూ బాలయ్య ద్విపాత్రలు చేస్తున్నారు. ఆ సెంటిమెంట్, బోయపాటి సెంటిమెంట్.. రెండూ వర్కవుట్ అయ్యి, బాలయ్య మళ్లీ సింహంలా జూలు విదిలిస్తారని ఆయన వీరాభిమానులు కళ్లు పత్తికాయలు చేసుకొని మరీ ఎదురు చూస్తున్నారు. గత వైభవాన్ని బాలయ్య మళ్లీ సాధిస్తారా?
- YM