English | Telugu

వైఫ్ ఆఫ్ రామ్‌ రివ్యూ

on Jul 20, 2018

 

ఒక నేరాన్నినిరూపించాలంటే సాక్ష్యాల్ని ప‌క్కాగా సేక‌రించాలి. అదే విధంగా త‌ప్పుడు సాక్ష్యాల‌తో కేసును తారుమారు చేయొచ్చు. ఈ రెండింటికి భిన్నంగా నిందితుల్ని పట్టించ‌డానికి కొత్త సాక్ష్యాల్ని సృష్టిస్తే ఎలా ఉంటుంది? ...ఈ పాయింట్ మ‌ర్డ‌ర్‌మిస్ట‌రీ చిత్రాల్లో కొత్త‌దేమి కాన‌ప్ప‌టికీ...క‌థ‌కు ఎంచుకునే నేప‌థ్యం,  స్క్రీన్‌ప్లేను న‌డిపించే విధానంలో న‌వ్య‌త ఉంటే ఈ జోన‌ర్ సినిమాలు ప్రేక్ష‌కుల్లో ఎప్పుడూ ఆస‌క్తిని రేకెత్తిస్తుంటాయి.  మంచుల‌క్ష్మీ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన తాజా చిత్రం వైఫ్ ఆఫ్ రామ్ ఆ కోవ‌కు చెందిన‌దే.  ఆరంభం నుంచి క‌థాంశాల‌ప‌రంగా కొత్త‌ద‌నానికే ప్రాధాన్య‌త‌నిస్తున్న మంచు ల‌క్ష్మి తాజాగా వైఫ్  ఆఫ్ రామ్ అంటూ ఓ మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ చిత్రంతో ప్రేక్ష‌కుల‌ముందుకొచ్చింది. ఈ చిత్రం ద్వారా విజ‌య్ యెల‌కంటి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌య్యాడు. ఇంత‌కి వైఫ్ ఆఫ్ రామ్ జీవితంలో ఏం జ‌రిగిందో తెలుసుకోవాలంటే క‌థ‌లోకి వెళ్లాల్సిందే...

క‌థ‌..

ఓ రిసార్ట్ నుంచి తిరిగి వ‌స్తుంటారు రామ్ (సామ్రాట్‌), దీక్ష (మంచు ల‌క్ష్మి) దంప‌తులు. ఈ క్ర‌మంలో రామ్ అనూహ్యంగా హ‌త్య‌కు గురువుతాడు. దీక్ష‌గాయాల‌తో ప్రాణాపాయం నుంచి బ‌య‌ట‌ప‌డుతుంది. త‌న భ‌ర్తను చంపిన‌వారిని ప‌ట్టుకొని శిక్షించాల‌ని పోలీసుల‌ను ఆశ్ర‌యిస్తుంది. అయితే పోలీసుల నుంచి స‌రైన స‌హ‌కారం ల‌భించ‌క‌పోవ‌డంతో తానే భ‌ర్త హ‌త్యా ర‌హ‌స్యాన్ని ఛేదించాల‌ని నిర్ణ‌యించుకుంటుంది. భ‌ర్త‌కు  సంబంధించిన ఫోన్ కాంటాక్ట్స్‌, సోష‌ల్‌మీడియా ఖాతాల‌తో హ‌త్య‌కుగ‌ల కార‌ణాల్ని అన్వేషించే ప‌నిలో ప‌డుతుంది. ఈ క్ర‌మంలో ఆమెకు కొన్ని భ‌యంక‌ర నిజాలు తెలుస్తాయి. ఇంత‌కి రామ్ హ‌త్య‌కు దారితీసిన ప‌రిస్థితులేమిటి? మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ శోధ‌న‌లో దీక్ష‌ను విస్మ‌య‌ప‌ర‌చిన విష‌యాలేమిటి?  చివ‌ర‌కు దీక్ష నిందితుల‌కు  ఎలాంటి శిక్ష‌ను విధించింది? అన్న‌దే వైఫ్ ఆఫ్ రామ్ ఇతివృత్తం..

విశ్లేష‌ణ‌

ఈ సినిమా క‌థా నేప‌థ్యం కొత్త‌దేమి కాదు. ఈ త‌ర‌హా పాయింట్‌తో బాలీవుడ్‌, దక్షిణాదిన చాలా చిత్రాలొచ్చాయి. అయితే భ‌ర్త హ‌త్య‌ర‌హ‌స్య శోధ‌న కోసం ఓ యువ‌తి తానే విచార‌ణ‌కు పూనుకోవ‌డం కొత్త‌గా అనిపిస్తుంది. మ‌ర్ట‌ర్ మిస్ట‌రీని ఛేదించ‌డానికి దీక్ష ప్ర‌య‌త్నాల‌తో ప్ర‌థ‌మార్థం సాగుతుంది. అందుకు ఆమె ఎంచుకునే మార్గాలు ఆస‌క్తిక‌రంగా అనిపిస్తాయి.  అయితే ఫ‌స్ట్‌హాఫ్ అంతా ఎలాంటి మ‌లుపులు లేకుండా స్ట్రెయిట్ స్క్రీన్‌ప్లేతో సాగ‌డంతో క‌థాగ‌మ‌నంలో ఉత్సుక‌త కొర‌వ‌డిన‌ట్లు క‌నిపిస్తుంది. ద్వితీయార్థం ఆసాంతం మ‌లుపులతో సాగింది.  సాక్ష్యాల‌ను సృష్టించే క్ర‌మంలో దీక్ష వేసే ఎత్తుగ‌డ‌లు ఆస‌క్తిక‌రంగా అనిపిస్తాయి. అయితే పోలీసులు వేలిముద్ర‌లు ఎలా సేక‌రిస్తారో తెలుసుకోవ‌డానికి దీక్ష త‌న ఇంటిలోని వ‌స్తువుల్ని తానే ధ్వంసం చేసుకోవ‌డం వంటి స‌న్నివేశాలు అసంబ‌ద్దంగా అనిపిస్తాయి. ప్రీక్లైమాక్స్ స‌న్నివేశాలు ఉత్కంఠ‌ను పంచుతాయి. ప‌తాక‌ఘ‌ట్టాల్లోని ట్విస్్టులు ఆస‌క్తిక‌రంగా అనిపిస్తాయి. హిందీ క‌హానీ, తెలుగులో వ‌చ్చిన క్ష‌ణం చిత్రాల ఛాయ‌లు ఇందులో క‌నిపిస్తాయి. దీక్ష పాత్ర‌లో మంచు ల‌క్ష్మి చ‌క్క‌టి అభిన‌యాన్ని క‌న‌బ‌ర‌చింది. అయితే సినిమా అసాంతం మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ ఛేద‌న‌పైనే దృష్టి పెట్ట‌డంతో క‌థ‌లోని భావోద్వేగాలు మిస్స‌య్యాయ‌నే  భావ‌న క‌లుగుతుంది. ద్వితీయార్థాన్ని ఆస‌క్తిక‌ర‌మైన మ‌లుపులు, స్కీన్‌ప్లేతో న‌డిపించ‌డంతో ద‌ర్శ‌కుడు  స‌ఫ‌లీకృతుడ‌య్యాడు. క‌థ ముందుగానే తెలిసిపోవ‌డంతో క‌థ‌నంపైనే ద‌ర్శ‌కుడు ఎక్కువ‌గా దృష్టిపెట్టాడు.

న‌టీన‌టులు, సాంకేతిక‌త‌

దీక్ష పాత్ర‌లో ల‌క్ష్మి మంచు చ‌క్క‌టి భావోద్వేగాల్ని ప్ర‌ద‌ర్శించింది. న్యాయం కోసం పోరాడే న‌వీన యువ‌తిగా ఆమె పాత్ర చిత్ర‌ణ ఆక‌ట్టుకుంటుంది. అయితే  సంభాష‌ణ‌లప‌రంగా ఆమె ఇప్ప‌టికీ త‌న డిక్ష‌న్‌ను మెరుగుప‌రచుకోవాల‌నిపిస్తుంది.  క‌థ మొత్తాన్ని దీక్ష పాత్ర చుట్టూ న‌డిపించ‌డంతో మిగ‌తా పాత్ర‌ల‌కు అంత‌గా ప్రాధాన్య‌త‌లేన‌ట్లుగా అనిపిస్తుంది. దీక్ష‌కు విచార‌ణ‌లో సాయ‌ప‌డే చారి పాత్ర‌లో ప్రియ‌ద‌ర్శి మెప్పిస్తాడు. ప్ర‌తినాయ‌కుడు రాకీ పాత్ర‌లో ఆద‌ర్శ్ ఆక‌ట్టుకుంటాడు. ఇక సాంకేతికంగా సామ‌ల‌భాస్క‌ర్ కెమెరా ప‌నితనం బాగుంది. ర‌ఘ దీక్షిత్ నేప‌థ్య సంగీతం స‌న్నివేశాల్లోని ఫీల్‌ను ఎలివేట్ వేసింది. సాంకేతికంగా చిత్రాన్ని ఉన్న‌తంగా తీర్చిదిద్దారు. నిర్మాణ  విలువ‌లు బాగున్నాయి.

చివ‌రిగా...

మ‌ర్డ‌ర్‌మిస్ట‌రీ చిత్రాలు ఓ ప్ర‌త్యేక‌మైన జోన‌ర్. వీటికి కొద్దిగా తారాబ‌లం తోడైతే ప్రేక్ష‌కుల‌కు సుల‌భంగా రీచ్ అవుతాయి. థ్రిల్ల‌ర్ మూవీల‌ను ఇష్ట‌ప‌డే ప్రేక్ష‌కుల్ని వైఫ్ ఆఫ్‌రామ్ మెప్పిస్తుంది. క్లైమాక్సే ఈ చిత్రానికి బ‌లం. అయితే అప్ప‌టి వ‌ర‌కూ ఈ సినిమాని కాస్త ఓపిగ్గా చూడాల్సిందే.  

రేటింగ్‌: 2


Also ReadLatest NewsCustomer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here