బన్నీ నుంచి కొరటాలను లాగేసుకున్న తారక్!
on Apr 14, 2021
సుకుమార్‌తో చేస్తోన్న 'పుష్ప' మూవీ తర్వాత కొరటాల శివ డైరెక్షన్లో సినిమా చేయనున్నట్లు చాలా రోజుల క్రితమే ప్రకటించాడు అల్లు అర్జున్. ఆ మూవీని యువసుధ ఆర్ట్స్ బ్యానర్‌పై కొరటాల స్నేహితుడు సుధాకర్ మిక్కిలినేనితో పాటు జీఏ2 పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించాల్సింది. కానీ ఏమైందే, ఏమో ఇప్పుడు ఆ ప్రాజెక్టును జూనియర్ ఎన్టీఆర్ ఎగరేసుకుపోయాడు. 'ఎన్టీఆర్30'గా రూపొందే ఆ మూవీని ఇప్పుడు సుధాకర్‌తో పాటు నందమూరి కల్యాణ్‌రామ్ కలిసి నిర్మిస్తున్నారు.
అఫిషియల్‌గా మంగళవారమే ఈ సినిమాను అనౌన్స్ చేసిన కొరటాల, దాని రిలీజ్ డేట్‌ను కూడా అనౌన్స్ చేసేయడం గమనించాల్సిన అంశం. 2022 ఏప్రిల్ 29న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని ఓ పోస్టర్ ద్వారా ఆయన వెల్లడించాడు. తారక్, కొరటాల కాంబినేషన్లో రానున్న రెండో సినిమా ఇది. ఇదివరకు వారి కాంబినేషన్లో వచ్చిన 'జనతా గ్యారేజ్' బ్లాక్‌బస్టర్ హిట్టయి అప్పటికి జూనియర్ కెరీర్లోనే హయ్యెస్ట్ గ్రాసర్‌గా నమోదైంది. "ఇదివరకు రిపేర్లు లోకల్‌గానే ఉన్నాయి. కానీ మార్పు కోసం ఈసారి మేం సరిహద్దుల్ని దాటుతున్నాం." అని తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ప్రకటించాడు కొరటాల.
'ఆర్ఆర్ఆర్' తర్వాత తారక్, 'ఆచార్య' తర్వాత కొరటాల చేసే సినిమా ఇదే. ఈ సినిమా అనౌన్స్మెంట్ అనంతరం బన్నీ, కొరటాల మధ్య ఏమైందంటూ సోషల్ మీడియాలో విపరీతంగా కామెంట్లు చక్కర్లు కొట్టాయి. తారక్-త్రివిక్రమ్ మధ్య క్రియేటివ్ డిఫరెన్సులు వచ్చి వారి సినిమా ఆగిపోయినట్లే, బన్నీ-కొరటాల మధ్య కూడా క్రియేటివ్ డిఫరెన్సులు వచ్చి సినిమా ఆగిపోయినట్లుందని ఫ్యాన్స్ మధ్య పెద్ద చర్చ నడిచింది. కానీ ‘‘అల్లు అర్జున్ , కొరటాల శివ కాంబినేషన్ సినిమా ఆగిపోలేదు. పరస్పర అంగీకారంతోనే ఈ సినిమా వాయిదా వేయడం జరిగింది. వచ్చే ఏడాది ఏప్రిల్ తర్వాత ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించే ఆలోచనలో ఉన్నాం.’’ అని యువసుధ ఆర్ట్స్ ప్రతినిధులు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
అయితే 'పుష్ప' తర్వాత బన్నీ ఎవరితో సినిమా చేస్తాడనే విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే త్రివిక్రమ్, శ్రీరామ్ వేణు జారిపోగా, లేటెస్ట్గా కొరటాల కూడా తారక్‌కు కమిట్ కావడంతో బన్నీ మైండ్‌లో ఉన్న ఆలోచన ఏమిటనేది ప్రశ్నార్ధకమైంది. ఫస్ట్ టైమ్ తన కెరీర్లో 'పుష్ప' పాన్ ఇండియా ఫిల్మ్‌గా తయారవుతుండటంతో, ఆ సినిమా ఫలితాన్ని బట్టి, తన మార్కెట్ విలువను బట్టి బన్నీ ఎవరితో ఎలాంటి సినిమా చేయాలనే నిర్ణయం తీసుకుంటాడని వినిపిస్తోంది.
Also Read