English | Telugu

థియేటర్ల కోసం 'సైరా' వర్సెస్ 'వార్'!

on Sep 6, 2019

 

మెగాస్టార్ చిరంజీవి నటించిన ఎపిక్ ఫిల్మ్ 'సైరా.. నరసింహారెడ్డి' అక్టోబర్ 2న విడుదలకు అన్ని విధాలా సిద్ధమవుతోంది. ఇండియన్ ఫస్ట్ ఫ్రీడమ్ ఫైటర్ అయినప్పటికీ చరిత్ర విస్మరించిన యోధునిగా పేర్కొంటున్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కేరక్టర్‌లో చిరంజీవి విశ్వరూపం ప్రదర్శించారని యూనిట్ సభ్యులంతా కొనియాడుతున్న ఈ సినిమాని సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేశాడు. 'సాహో' తర్వాత టాలీవుడ్ నుంచి వస్తున్న పాన్-ఇండియన్ ఫిలింగా ట్రేడ్ విశ్లేషకులు 'సైరా'ని పరిగణిస్తున్నారు. ఒక్క తెలుగు భాషలోనే ఈ మూవీని నిర్మించినప్పటికీ, హిందీతో పాటు దక్షిణాదిలోని ఇతర మూడు భాషలు.. తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో డబ్బింగ్ ఫిలింగా రిలీజవుతోంది.

200 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్‌తో నిర్మాణమవుతోన్న 'సైరా'కు సంబంధించి ప్రెజెంట్.. వీఎఫ్ఎక్స్ వర్క్ ఫుల్ స్వింగ్‌లో నడుస్తోంది. పెట్టుబడి ఖర్చును రాబట్టాలంటే భారీ స్థాయి విడుదల తప్పదు. అందుకే ఐదు భాషల్లో సినిమా రిలీజ్‌ని ప్లాన్ చేశారు. మార్కెటింగ్ స్ట్రాటజీ ప్రకారం ఆయా భాషలకు చెందిన పాపులర్ యాక్టర్లతో సినిమాలోని కీలక పాత్రలు చేయించారు. బాలీవుడ్ మెగాస్టార్‌గా అశేష అభిమానులు కొనియాడే అమితాబ్ బచ్చన్, తమిళ హీరో విజయ్ సేతుపతి, కన్నడ స్టార్ యాక్టర్ కిచ్చా సుదీప్, మలయాళీ అయిన నయనతార, భోజ్‌పురి స్టార్ రవి కిషన్, హిందీ ప్రేక్షకులకు సుపరిచితురాలైన తమన్నా వంటివాళ్లు 'సైరా'లో నటించారు.

అంతా బాగానే ఉంది కానీ.. హిందీలో 'సైరా'కు తీవ్ర అడ్డంకి ఒకటి ఎదురవుతుండటం దర్శక నిర్మాతల్ని ఇబ్బంది పెడుతోంది. ఆ అడ్డంకి.. 'వార్' అనే సినిమా. బాలీవుడ్ యాక్షన్ స్టార్స్ హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ కలిసి నటించిన ఈ సినిమా కూడా అక్టోబర్ 2నే విడుదలవుతోంది. ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్ తర్వాత ఆ మూవీపై ఎక్స్‌పెక్టేషన్స్ ఆకాశాన్ని అంటుతున్నాయి. విజువల్స్ కానీ, యాక్షన్ ఎపిసోడ్స్ కానీ మైండ్‌బ్లోయింగ్‌గా ఉన్నాయనే ప్రశంసలు 'వార్'కు లభిస్తున్నాయి. పైగా ఆ సినిమాని బాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ కంపెనీ యశ్ రాజ్ ఫిలిమ్స్ నిర్మించింది. సహజంగానే అత్యధిక థియేటర్లలో ఆ సినిమాని రిలీజ్ చెయ్యడానికి ఇప్పటికే ఆ సంస్థ అన్ని సన్నాహాలూ చేస్తోంది.

ఈ పరిస్థితుల్లో 'సైరా'కు హిందీ బెల్ట్‌లో ఎన్ని థియేటర్లు దక్కుతాయనే ప్రశ్న తలెత్తుతోంది. అయినప్పటికీ హిందీ వెర్షన్ డిస్ట్రిబ్యూటర్ అనిల్ తడానీ సాధ్యమైనన్ని థియేటర్లలో సినిమాని రిలీజ్ చెయ్యడానికి అన్ని విధాలా ట్రై చేస్తున్నాడు. 'సైరా' ట్రైలర్ రిలీజయ్యాక, అందులోని విజువల్స్, వార్ ఎపిసోడ్స్ చూసిన అక్కడి ఎగ్జిబిటర్లు ఫిదా అయ్యారు. 'సైరా'కు తమ థియేటర్లు ఇవ్వడానికి వాళ్లలో చాలామంది ఇంట్రెస్ట్‌గా ఉన్నారని సమాచారం. అయితే వాళ్లను మేనేజ్ చెయ్యడానికి 'వార్' సినిమా నిర్మాతలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారని రిపోర్టులు వస్తున్నాయి. 'సైరా'ను డబ్బింగ్ ఫిలింగా హైలైట్ చేస్తూ, ఒరిజినల్ హిందీ సినిమా అయిన 'వార్' వైపు నిల్చోవాల్సిందిగా ఎగ్జిబిటర్స్‌పై ఒత్తిడి పెంచుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

డబ్బింగ్ సినిమాలతో పోటీ వచ్చినప్పుడు స్ట్రెయిట్ సినిమాలకే ప్రయారిటీ ఇవ్వాలనేది ఏ భాషా సినీ పరిశ్రమ అయినా చేసే డిమాండే. అంతెందుకు.. ఈ ఏడాది జనవరిలో రజనీకాంత్ సినిమా 'పేట', మన సినిమాలైన 'యన్.టి.ఆర్: కథానాయకుడు', 'వినయ విధేయ రామ', 'ఎఫ్ 2'లతో పోటీకి వచ్చినప్పుడు, మన సినిమాలకే ప్రాముఖ్యం ఇవ్వాలని టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు చేసిన కామెంట్ ఇంకా గుర్తుంది. 'పేట'కు తక్కువ థియేటర్లు ఇచ్చారని ఆ సినిమాని తెలుగులో రిలీజ్ చేసిన నిర్మాత తిట్ల దండకం కూడా ఎత్తుకున్నాడు. ఇప్పుడు మన సినిమాకి హిందీలో ఇదే పరిస్థితి తలెత్తుతోంది.

అయినప్పటికీ 'సైరా'కు థియేటర్లు ఇవ్వకపోతే, తాను ఫ్యూచర్‌లో రిలీజ్ చేసే సినిమాలను ఇవ్వనంటూ డిస్ట్రిబ్యూటర్ అనిల్ తడాని అక్కడి ఎగ్జిబిటర్స్‌ను హెచ్చరిస్తున్నాడు. 'వార్'తో పాటు 'సైరా'కు కూడా తగిన సంఖ్యలో థియేటర్లు ఇవ్వాల్సిందేనని ఆయన పట్టుబడుతున్నాడు. దీంతో నార్త్ ఎగ్జిబిటర్లు తలలు పట్టుకుంటున్నారు. రిలీజ్ టైమ్ దగ్గరకు వస్తే కానీ 'సైరా' హిందీ వెర్షన్‌కు ఎన్ని థియేటర్లు దక్కుతాయనే విషయం తేలదు. తెలుగు వెర్షన్‌కు మాత్రం అలాంటి ఇబ్బందేమీ లేదు. 'సాహో' తరహాలోనే 'సైరా'కు థియేటర్లు ఇచ్చేందుకు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఎగ్జిబిటర్లు రెడీ అవుతున్నారు.


Cinema GalleriesLatest News


Video-Gossips