English | Telugu

వినయ విధేయ రామ రివ్యూ

on Jan 11, 2019

 

నటీనటులు: రామ్ చరణ్, కియారా అద్వానీ, ప్రశాంత్, ఆర్యన్ రాజేష్, స్నేహ, వివేక్ ఒబెరాయ్, మహేష్ మంజ్రేకర్, ముఖేష్ ఋషి, హరీష్ ఉత్తమన్, రవివర్మ, మధునందన్, హేమ, పృథ్వీ తదితరులు...
నిర్మాణ సంస్థ: డివివి ఎంటర్టైన్మెంట్స్
కెమెరా: రిషి పంజాబీ, ఆర్థర్ ఎ. విల్సన్
మాటలు: ఎం. రత్నం
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
నిర్మాత‌: డివివి దానయ్య
ద‌ర్శ‌క‌త్వం: బోయపాటి శ్రీను
విడుదల తేదీ: జనవరి 11, 2018

'రంగస్థలం' తర్వాత రామ్ చరణ్ నటించిన సినిమా 'వినయ విధేయ రామ'. అయితే... దీన్ని రామ్ చరణ్ సినిమాగా కంటే బోయపాటి శ్రీను సినిమాగా ప్రేక్షకులు, తెలుగు సినిమా పరిశ్రమ వర్గాలు చూశాయి. ప్రతి సినిమాలో తన హీరో చేత బోయపాటి శ్రీను విపరీతంగా ఫైట్స్ చేయిస్తుంటారు. బోయపాటి సినిమాల్లో కథ కంటే ఫైట్స్, డైలాగ్స్ గురించి ప్రేక్షకులు మాట్లాడుకుంటారు. 'వినయ విధేయ రామ' టీజర్, ట్రైలర్ అందుకు మినహాయింపు కాదు. ప్రచార చిత్రాల్లో రామ్ చరణ్ కంటే బోయపాటి ఎక్కువ కనిపించారనే మాటలు వినిపించాయి. ఈ రోజు విడుదలైన సినిమాలో ఎవరు కనిపించారు? సినిమా ఎలా ఉంది? రివ్యూపై ఓ లుక్కేయండి.

క‌థ‌:
నలుగురు అనాథ బాలలు (ప్రశాంత్, ఆర్యన్ రాజేష్, మధునందన్, రవివర్మ) చచ్చిపోవాలని రైల్వే ట్రాక్ మీద కూర్చుంటారు. పక్కన పొదల్లోంచి చిన్న పిల్లాడి ఏడుపు వినిపించడంతో... చచ్చిపోవాలనే తమ నిర్ణయాన్ని మార్చుకుని పిల్లాడిని ఆసుపత్రికి తీసుకువెళతారు. పిల్లాడికి రామ (రామ్ చరణ్) అని పేరు పెడతారు. ఐదుగురు ఓ కుటుంబంగా ఏర్పడతారు. వీరిలో ప్రశాంత్, ఆర్యన్ రాజేష్, రవివర్మ ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడతారు. ఐఏఎస్ అధికారి, నిజాయితీపరుడు అయిన భువన్ కుమార్ (ప్రశాంత్‌)ని బిహార్‌లో ఎన్నికల అధికారిగా ప్రభుత్వం నియమిస్తుంది. బిహార్‌లో రాజా భాయ్ (వివేక్ ఒబెరాయ్)ని ఎదిరించి ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి. నిజాయతీగా వ్యవహరిస్తున్న భువ‌న్‌కుమార్‌తో పాటు మిగతా వారిని చంపాలని నేపాల్-బీహార్ సరిహద్దుల్లోకి తీసుకు వెళతాడు రాజా భాయ్. చావుకు అతి సమీపంలో ఉన్న అన్నయ్యలను రామ ఎలా కాపాడుకున్నాడు? అనేది సినిమా.

విశ్లేషణ:

'ఒక్కడికీ ట్రయినింగ్ ఉంటే టైమింగ్ లేదు... టైమింగ్ ఉంటే ట్రయినింగ్ లేదు. సరిగ్గా పుట్టినోడు.. సరైన మగడు... ఒక్కడు కూడా తగల్లేదు' - ట్రైల‌ర్‌లో రామ్‌చ‌ర‌ణ్ చెప్పే డైలాగ్‌! విలన్లకు సరైన ట్రయినింగ్, టైమింగ్ ఉన్నాయా? లేవా? అనేది పక్కన పెడితే... 'సినిమాలో ఒక్క సన్నివేశంలోనూ సరైన డైరెక్షన్ లేదు. ఒకవేళ ఎక్కడో అరకొర సన్నివేశంలో డైరెక్షన్ ఉంటే డైలాగులు లేవు.. డైలాగులు ఉంటే డైరెక్షన్ లేదు. రెండూ ఉంటే రీ రికార్డింగ్ లేదు. సరైన సన్నివేశం గానీ... పాట గానీ... ఒక్కటీ తగల్లేదు'! 'మార్కెట్‌లో మాంచి మాస్ హీరో మన చేతికి దొరికాడు. అతడి చేత ఆరేడు ఫైట్స్ చేయిస్తే.. ఫాన్స్ చూస్తారు. దర్శకుడిగా నేను పాస్ మార్కులు వేయించుకోవచ్చు' అని బోయపాటి భావించి ఈ సినిమా తీసినట్టున్నారు. సినిమాలో సరైన కథ గానీ... క్యారెక్టరైజేషన్లు గానీ... సన్నివేశాలు గానీ... డైలాగులు గానీ.... ఏవీ రాసుకోలేదు. ఎంతసేపూ ఫైట్లు... ఫైట్లు... ఫైట్లు! ఫైట్స్ మీద ఆధారపడ్డారు. పోనీ.. అవైనా సరిగ్గా ఉన్నాయా? అంటే లేవు. ప్రేక్షకులు నవ్వుకునేలా తీశారు.

'బాహుబలి'లో అడివి శేష్ తలను ప్రభాస్ నరికితే ప్రేక్షకులు చూశారు. ఒక్క తల బదులు మన హీరో చేత రెండు తలలు నరికేస్తే... ఊర మాస్ అని ప్రేక్షకులు చప్పట్లు కొడతారని బోయపాటి అనుకున్నారేమో? రామ్ చరణ్ చేత రెండు చేతులతో కత్తులు పట్టించి ఒక్క సన్నివేశంలో రెండు తలలు గాల్లో ఎగిరేలా చేశారు. ఇదో ఆణిముత్యం అనుకుంటే... ఆణిముత్యాలకు ఆణిముత్యం అనదగ్గ  సన్నివేశం సినిమాలో మరొకటి ఉంది. పాముకాటుకు మనిషి మరణించడం సర్వ సాధారణం. ప్రతినాయకుడిని కాటేసిన పాము మరణిస్తే.. అది బోయపాటి సినిమా అనుకోవాలి. బోయపాటి కథకు, దర్శకత్వానికి తగ్గట్టు దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు నేపథ్య సంగీతం అందించారు. నిర్మాణ విలువలు మాత్రం అద్భుతం! దర్శకుడు ఏదో అద్భుతం అందిస్తాడని రాజీ పడకుండా కోట్లకు కోట్లు ఖర్చుపెట్టారు. పాటల కోసం భారీ సెట్స్ వేశారు. వందల మంది డ్యాన్సర్లను తీసుకొచ్చారు.

ప్లస్ పాయింట్స్:

రామ్ చరణ్
విల‌న్‌గా వివేక్ ఒబెరాయ్ న‌ట‌న‌

మైనస్ పాయింట్స్:

కథ, కథనం, మాటలు, దర్శకత్వం
ఫైట్స్ / యాక్ష‌న్ సీన్స్‌
దేవిశ్రీ సంగీతం

నటీనటుల పనితీరు:

రామ్ చరణ్‌కి ఇటువంటి పాత్రలు చేయడం కొత్తేమీ కాదు... కొట్టిన పిండి! ఇంతకు ముందు 'రచ్చ', 'బ్రూస్ లీ', 'ఎవడు' సినిమాల్లో చేసినటువంటి పాత్రలకు దగ్గరలో 'వినయ విధేయ రామ'లో పాత్ర ఉంటుంది. తన పాత్ర వరకూ రామ్ చరణ్ బాగా కష్టపడ్డాడు. డ్యాన్సులు చేశాడు, ఫైట్స్ కోసం బాగా బాడీ బిల్డప్ చేశాడు. క్యారెక్టర్‌కి తగ్గట్టు యాటిట్యూడ్ మైంటైన్ చేశాడు. ఫైట్స్ కోసం బిల్డ్ చేసిన బాడీతో కొంచెం కొత్తగా కనిపించారు. విల‌న్‌గా వివేక్ ఒబెరాయ్‌ నటన బావుంది. 'రక్త చరిత్ర'లో నటించినట్టు సీరియ‌స్‌గా నటించాడు. హీరోయిన్ కియారా అద్వానీ పాత్ర రెండు మూడు సన్నివేశాలు, పాటలకు మాత్రమే పరిమితం. మిగతా పాత్రలు తెరపై కనిపిస్తున్నా... ప్రేక్షకులకు వాళ్ళు రిజిస్టర్ కావడం కష్టమే.

చివరగా:

టిపికల్ బోయపాటి ట్రేడ్ మార్క్ స్టైల్‌లో సాగే సినిమా 'వినయ విధేయ రామ'. కథలో, దర్శకత్వంలో కాస్త కూడా కొత్తదనం లేదు. అలాగని ఆసక్తికరంగా కూడా లేదు. రామ్ చరణ్ ఒక్కడూ డ్యాన్సులతో, ఫైటులతో ప్ర్రేక్షకులను అలరించడానికి ప్రయత్నించాడు కానీ.. అతడికి దర్శకుడు, సంగీత దర్శకుడు నుంచి సరైన సహకారం లభించకపోవడంతో బోరింగ్ కమర్షియల్ సినిమాగా 'వినయ విధేయ రామ' మిగిలింది.    


రేటింగ్: 2/5


Also ReadLatest NewsCustomer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here