సిగిరెట్టు కోసం కొట్టుకుంటున్న తమిళ అభిమానులు
on Jul 9, 2018
హీరో అభిమానుల గురించి చెప్పుకోవాలంటే తమిళుర గురించే చెప్పుకోవాలి. తమ అభిమాన హీరో కోసం వాళ్లు ఎంత త్యాగానికైనా సిద్ధపడిపోతారు. అలాంటి అభిమానుల మధ్య ఇప్పుడు ఓ వివాదం మొదలైంది. అది కూడా ఓ సిగిరెట్టు కోసం అంటే ఆశ్చర్యం కలగక మానదు. విషయంలోకి వెళ్తే... తమిళ సూపర్‌స్టార్ విజయ్ ఈమధ్యనే ఒక పోస్టరు విడుదల చేశారు. దాని పేరు సర్కార్, మురుగదాస్ దాని దర్శకుడు. ఇంతకీ ఆ పోస్టరులో విజయ్ స్టైలిష్‌గా సిగిరెట్ తాగుతున్న దృశ్యం ఉంది. ఈ సీన్ కొంతమందికి నచ్చలేదు. మాజీ ఆరోగ్యశాఖమంత్రి అన్బుమణి రాందాస్లాంటివాళ్లు ట్విట్టర్ వేదికగా విజయ్ను ఏకేశారు. ‘హానికరమైన అలవాటుని ఎందుకు ప్రోత్సహిస్తున్నారంటూ’ మండిపడ్డారు. దాంతో తమిళనాడు ఆరోగ్యశాఖ కూడా చిత్రబృందానికి నోటీసులు పంపించింది. ఈ విమర్శలకు జడిసిన చిత్రబృందం ఎందుకొచ్చిన గొడవా అనుకుంటూ, సదరు పోస్టరుని తొలగించింది. అంతే! విజయ్ అభిమానులు ఒక్కసారిగా మండిపడిపోయారు. గతంలో ఏ సినిమా పోస్టరు మీదా తీసుకోని చర్యలు తమ నటుడి సినిమా మీదే ఎందుకు తీసుకుంటున్నారంటూ ఓట్రిస్తున్నారు. పాత పోస్టర్లను బయటకి తీసి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఈ వివాదాన్ని ఎలా పరిష్కరించాలో తెలియని తమిళనాడు ప్రభుత్వం తలపట్టుకుంది.