'పుష్ప'ను వదులుకున్నట్లు కన్ఫామ్ చేసిన సేతుపతి!
on Jul 13, 2020
'పిజ్జా' హీరోగా విజయ్ సేతుపతి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు. ఆ తర్వాత కూడా పలు డబ్బింగ్ సినిమాల ద్వారా తన నటనతో అలరిస్తూనే ఉన్నాడు. తెలుగులో తొలిసారి నేరుగా చిరంజీవి మూవీ 'సైరా.. నరసింహారెడ్డి'లో ఒక కీలక పాత్ర చేసి మనవాళ్లను మరింతగా ఆకట్టుకున్నాడు. అలాగే చిరంజీవి మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్న 'ఉప్పెన'లో విలన్‌గా నటించాడు. ఆ సినిమా విడుదల కావాల్సి ఉంది. ఇక అల్లు అర్జున్ టైటిల్ రోల్ చేస్తోన్న పాన్ ఇండియా ఫిల్మ్ 'పుష్ప'లో ఒక కీలక పాత్ర కోసం అతడిని తీసుకున్నాడు డైరెక్టర్ సుకుమార్.
అయితే, ఆ సినిమా నుంచి డేట్స్ ప్రాబ్లెమ్ కారణంగా తప్పుకున్నట్లు ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ధ్రువీకరించాడు విజయ్ సేతుపతి. తమిళంలో 'తుగ్లక్ దర్బార్', 'కడైసి వివసాయి', 'యాదుమ్ ఊరె యావరుమ్' సినిమాలు చేస్తున్నందున కాల్షీట్ల సమస్య రావడంతో సుకుమార్‌ను స్వయంగా కలిసి ఈ విషయం చెప్పాడు. అయితే ఆ విషయం తాము చూసుకుంటామని 'పుష్ప' నిర్మాతలు చెప్పినా, ప్రామిస్‌లు చేసి తర్వాత ఇబ్బందులు పడేకంటే ఆ మూవీ నుంచి బయటకు రావడమే మేలనుకొని వచ్చినట్లు సేతుపతి తెలిపాడు. అయితే 'పుష్ప' చాలా చక్కని స్టోరీ అనీ, దాన్ని మిస్సవడం బాధగానే ఉందనీ అతనన్నాడు.