తల్వార్‌తో కేక్ కట్ చేసి.. క్షమించమని వేడుకున్న స్టార్ యాక్టర్!
on Jan 16, 2021
విజయ్ టైటిల్ రోల్ చేసిన 'మాస్టర్' మూవీలో విలన్ భవానీ పాత్రలో గొప్పగా రాణించి, అందరి ప్రశంసలూ అందుకుంటున్న విజయ్ సేతుపతి తాజాగా అందరికీ క్షమాపణలు చెప్పాడు. కారణమేంటో తెలుసా? బర్త్‌డే వేడుకలో కేక్‌ను పెద్ద తల్వార్‌తో కట్ చేసినందుకు! జనవరి 16 ఆయన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. తన సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా తమిళంలో షేర్ చేసిన ఒక సుదీర్ఘమైన లేఖలో, తానొక బ్యాడ్ ఎగ్జాంపుల్‌ను సెట్ చేశాననీ, కానీ ఫ్యూచర్లో జాగ్రత్తగా ఉంటాననీ ప్రామిస్ చేశాడు.
పొన్రామ్ డైరెక్షన్లో చేస్తున్న సినిమా సెట్స్‌పై మూడు రోజుల ముందుగానే అతను తన బర్త్‌డే వేడుకను జరుపుకున్నాడు. యూనిట్ మెంబర్స్ అతని కోసం ఓ బర్త్‌డే కేక్‌ను తీసుకొచ్చారు. దానికి ఓ పెద్ద కత్తితో కట్ చేశాడు. దీనికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. దాంతో పాటు కాంట్రవర్సీని కూడా సృష్టించింది. పెద్ద తల్వార్‌తో కేక్ కట్ చేసి, యువతకు, అభిమానులకు ఏం సందేశమిస్తున్నారంటూ పలువురు ప్రశ్నించారు. దీంతో తన పొరపాటు గ్రహించిన విజయ్ సేతుపతి తన చర్యకు క్షమించమని కోరాడు.
"నా బర్త్‌డే సందర్భంగా విష్ చేసిన సినిమా వ్యక్తులకూ, అభిమానులకు మనస్ఫూర్తిగా థాంక్స్ చెప్పుకుంటున్నా. మూడు రోజుల క్రితం నా బర్త్‌డే సెలబ్రేషన్ సందర్భంగా తీసిన ఫొటో ఇప్పుడు కాంట్రవర్సీ అయ్యింది. ఆ ఫొటోలో ఓ పెద్దకత్తితో నా బర్త్‌డే కేక్‌ను కట్ చేస్తున్నాను. నేను డైరెక్టర్ పొన్రామ్ సినిమాలో నటిస్తున్నా. ఆ మూవీలో ఆ కత్తి చాలా ఇంపార్టెంట్ రోల్ పోషిస్తోంది. పొన్రామ్, ఆయన టీమ్‌తో నా బర్త్‌డేని సెలబ్రేట్ చేసుకోవడం వల్ల, నా కేక్‌ను కట్ చేయడానికి ఆ కత్తిని ఉపయోగించాను. ఇది ఒక చెడు ఉదాహరణగా చాలామంది ఆక్షేపించారు. ఇప్పట్నుంచీ, నేను జాగ్రత్తగా ఉంటాను. ఎవరినైనా నేను హర్ట్ చేసినట్లయితే, వారికి క్షమాపణలు చెప్తున్నా, నా చర్యకు చింతిస్తున్నాను." అని ఆ లేఖలో తెలియజేశాడు విజయ్ సేతుపతి.
ఈమధ్యే శ్రీలంక దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్‌లో నటించేందుకు సిద్ధపడి, తమిళుల నుంచి వచ్చిన నిరసనలతో వెనక్కి తగ్గిన విజయ్ సేతుపతి, అప్పుడు కూడా తనను క్షమించమని కోరిన విషయం తెలిసిందే.
Also Read