నేను స్టార్... నన్నెవరూ ఆపలేరు!
on Oct 1, 2018
'అర్జున్‌రెడ్డి', 'గీత గోవిందం' సినిమా విజయాలతో విజయ్ దేవరకొండలో గర్వం పెరిగిందా?
తనకు తాను సూపర్‌స్టార్ అనుకుంటున్నాడా?
తనను ఎవరూ ఆపలేరని అనుకుంటున్నాడా?
తన క్రేజ్ చూడమని ఇండస్ట్రీ జనాలకు ఇన్‌డైరెక్టుగా చెబుతున్నాడా?
విజయవాడలో జరిగిన 'నోటా' ఫంక్షన్లో విజయ్ దేవరకొండ స్పీచ్ వింటే అటువంటి ప్రశ్నలు ఉత్పన్నం కాక మానవు. అతడి మాటల్లో తానొక స్టార్ అనే విశ్వాసం ధ్వనించింది.
మూడేళ్ళ క్రితం 'ఎవడే సుబ్రమణ్యం' విడుదల సమయంలో విజయ్ దేవరకొండ విజయవాడ వెళ్లారు. ఆదివారం 'నోటా' ఫంక్షన్లో అప్పట్లో జరిగిన ఒక సంభాషణను గుర్తు చేసుకున్నాడు. విజయ్ దేవరకొండ మాట్లాడుతూ "ఎవడే సుబ్రమణ్యం' నిర్మాత స్వప్న అక్క (స్వప్న దత్) సొంతూరు విజయవాడే. అప్పట్లో మేం కారులో వస్తుంటే... తెలంగాణ బోర్డర్ సూర్యాపేట దాటాక, 'ఇక్కడి నుంచి ప్రేక్షకులు నిన్ను గుర్తుపడితే నువ్వు స్టార్' అని నాతో చెప్పింది. 'నిన్ను ఎవరూ ఆపలేరు' అన్నది" అని చెప్పాడు. ఆ వెంటనే కెమెరా దగ్గరకు వచ్చి "స్వప్న అక్క మీ ఊరిలో వున్నాను. మీ ఊరిలో నా వాళ్ళు వున్నారు. చూడు" అన్నాడు. ఈ చర్యలు అర్థం ఏమిటి? "విజయవాడలో నన్ను గుర్తుపడుతున్నారు. నేను స్టార్. నన్నెవరూ ఆపలేరు" అనేనా? ప్రస్తుతం ప్రేక్షకుల్లో విజయ్ దేవరకొండ క్రేజ్ మామూలుగా లేదు. అలాగని ఓవర్ చేస్తే ఎలా? అనే అభిప్రాయాలు చాలామందిలో వ్యక్తం అవుతున్నాయి.
సినిమా ఇండస్ట్రీలో ఓడలు బళ్ళు అయిన సందర్భాలు, బళ్ళు ఓడలు అయిన సందర్భాలు వున్నాయి. భవిష్యత్తులో విజయ్ దేవరకొండకు విజయాలు దూరం అయితే ఇటువంటి మాటలను బయటకు తీసి సెటైర్స్ వేసే ప్రమాదం వుంది. అందుకనే పెద్దలు ఎదిగిన కొద్దీ ఒదిగి వుండమని చెప్పేది.