యమన్ : ఇన్ సైడ్ టాక్
on Feb 20, 2017
గతేడాది బిచ్చగాడు లాంటి సూపర్ డూపర్ హిట్ ఇచ్చిన హీరో.... విజయ్ ఆంటోనీ. ఆ సినిమా తరవాత విజయ్ పై నమ్మకం పెరిగింది. తన డబ్బింగ్ చిత్రాలకు మంచి గిరాకీ ఏర్పడింది. అందుకే విజయ్ ఆంటోనీ తాజా చిత్రం యమన్‌పై అందరి చూపూ పడింది. జీవ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ శుక్రవారం విడుదల అవుతోంది. ఇదో పొలిటికల్ థ్రిల్లర్. విజయ్ రెండు పాత్రల్లో కనిపించనున్నాడు. ప్రస్తుత తమిళ రాజకీయాలకు.. యమన్ స్టోరీ చాలా దగ్గరగా ఉంటుందని టాక్.
నమ్మక ద్రోహం అనే కాన్సెప్ట్‌లో ఈ సినిమా సాగబోతోందని, ప్రస్తుతం తమిళ రాజకీయాలు హాట్ హాట్‌గా ఉన్న దృష్ట్యా... యమన్ అక్కడి ప్రేక్షకులకు నచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ పొలిటికల్ డ్రామాలో ట్విస్టులకూ, టర్న్లకూ చోటుందట. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ లోనూ, ఇంట్రవెల్లోనూ వచ్చే ట్విస్టులు అదిరిపోతాయని టాక్. ఒకే టెంపోలో సాగే ఈ సినిమా బీసీలకు ఎంత వరకూ నచ్చుతుందో చూడాలి.
గతేడాది విడుదలైన ధనుష్ ధర్మయోగి కూడా పొలిటికల్ థ్రిల్లరే. ఆ సినిమా బాగానే ఉన్నా, వసూళ్లు మాత్రం అందుకోలేకపోయింది. సరిగ్గా అదే జోనర్లో వస్తున్న ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో. అన్నట్టు బిచ్చగాడు తరువాత వచ్చిన భేతాళుడు తెలుగు ప్రేక్షకుల్ని ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. బిచ్చగాడు గాలివాటంగా వచ్చిన విజయం కాదని నిరూపించుకోవాలంటే.. యమన్ వీరవిహారం చేయాల్సిందే.