టాలీవుడ్లో బయట కుర్రాళ్ళను తొక్కేస్తున్నారా?
on May 14, 2019
తెలుగు ఇండస్ట్రీ ఆ నలుగురి చేతిలో ఉందనేది అప్పుడప్పుడూ వినిపించే మాట. చోటా మోటా కొత్త నిర్మాతలను పైకి రానివ్వకుండా... థియేటర్లు ఇవ్వకుండా తొక్కేస్తున్నారని కొందరు ఆరోపణలు చేస్తుంటారు. అలాగే, ఇండస్ట్రీలో బ్యాగ్రౌండ్ ఉంటే తప్ప హీరోలుగా అవకాశాలు రావని... రవితేజ, నాని, రాజ్ తరుణ్ తప్ప సినీ నేపథ్యం లేకుండా పైకి ఎదిగిన హీరోలు ఎవరున్నారని ఆరోపణలు చేసే కొందరు చెప్పే మాట.
టాలీవుడ్ ఇండస్ట్రీలో నిజంగా బయట/కొత్త కుర్రాళ్లను పైకి రానివ్వడం లేదా? ఈ చర్చతో మీరు ఏకీభవిస్తారా? లేదా? అనే ప్రశ్న తాజా ఇంటర్వ్యూలో తేజకు ఎదురైంది. "అవన్నీ చేతకాని వాళ్ల మాటలు" అని ఆయన కొట్టిపారేశారు. "ఎవరూ అరచేత్తో సూర్యోదయాన్ని ఆపలేరు. టాలెంట్ ని ఎవరూ ఆపలేరు. విజయ్ దేవరకొండ ఏ ఫ్యామిలీ నుంచి వచ్చాడు? రవితేజకు ఏ ఫ్యామిలీ ఉంది? నాకు ఏ ఫ్యామిలీ ఉంది? రాజమౌళికి ఏ ఫ్యామిలీ ఉంది? ఏదో చేతకాని వాళ్లు మాట్లాడుతుంటారు. ముగ్గురు ఫ్యామిలీలు ఉంటే అందరూ హిట్స్ తీయాలిగా. ఎందుకు హిట్స్ తీయడం లేదు? ఫ్లాప్స్ ఎందుకు వస్తున్నాయి?" అని తేజ ప్రశ్నించారు. చేతకానివాళ్ళు మాత్రమే ఇండస్ట్రీలో కొత్త టాలెంట్ ని తొక్కేస్తున్నారనే మాటలు మాట్లాడతారని ఆయన చెప్పారు.
'ఫలక్నుమా దాస్' హీరో కమ్ డైరెక్టర్ విశ్వక్ సేన్ కూడా ఈ చర్చపై సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమంలో మాట్లాడాడు. "ఇండస్ట్రీలో కొత్తవాళ్లను పైకి రానివ్వరని ఏవేవో చెప్తుంటారు. అదీ ఇదీ అంటుంటారు. అలాగేమీ లేదు. నా తొలి సినిమా 'వెళ్ళిపోమాకే'ను దిల్ రాజు గారు విడుదల చేశారు. రెండో సినిమా 'ఈ నగరానికి ఏమైంది'ను సురేష్ బాబు గారు విడుదల చేశారు. మూడో సినిమానూ ఆయనే విడుదల చేస్తున్నారు. వెంకటేష్ గారు ఈ ట్రైలర్ విడుదల చేయడానికి వచ్చారు. ఇండస్ట్రీలో మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి అంతే. రిజల్ట్ వస్తుంది" అని విశ్వక్ సేన్ అన్నారు.