నాన్నా! ఈ సినిమా నీ కోసమే.. వెంకటేశ్ ఎమోషనల్ స్పీచ్!
on Dec 4, 2019
"ఎన్నో సినిమాలు చేశాను. కానీ ఈ సినిమా చెయ్యడం కల నిజమవడం లాంటిది. రానా, చైతన్యలతో కలిసి నటించాలని ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను. ఈ సినిమా చెయ్యడం నాకు అలాంటి అనిర్వచనీయమైన అనుభూతినిచ్చింది. నాన్నగారెప్పుడూ మా కలయికలో సినిమా చెయ్యాలని తపించేవారు. నాన్నా.. ఈ సినిమా నీ కోసమే. ఈ సినిమాని నువ్వు బాగా ఎంజాయ్ చేస్తావనుకుంటున్నా" అంటూ ఉద్వేగానికి గురయ్యారు సీనియర్ హీరో వెంకటేశ్. ఆయన, నాగచైతన్య నిజ జీవితంలో మేనమామ, మేనల్లుళ్లు అనే విషయం తెలిసిందే. అవే తరహా పాత్రల్ని పోషిస్తూ ఆ ఇద్దరూ కలిసి నటించిన చిత్రం 'వెంకీమామ'. కె.ఎస్. రవీంద్ర (బాబీ) దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సురేశ్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లపై డి. సురేశ్‌బాబు, టి.జి. విశ్వప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. డిసెంబర్ 13న ఈ సినిమా విడుదలవుతోంది. ఈ సందర్భంగా బుధవారం (డిసెంబర్ 4) ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో వెంకటేశ్ మాట్లాడారు.
"చైతన్యను మీరు చాలా సినిమాల్లో చూశారు. ఈ సినిమాలో టోటల్ ఆల్‌రౌండర్‌గా అతడ్ని చూడబోతున్నారు. అన్ని ఎమోషన్స్‌ను అతను బాగా పండించాడు. ఎంటర్టైన్మెంట్ను కానీ, యాక్షన్‌ను కానీ, ఉద్వేగభరిత సన్నివేశాల్లో కానీ ఔట్‌స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఆ క్యారెక్టర్లో అతడు ఇమిడిపోయిన విధానానికి హ్యాపీగా ఫీలవుతున్నా. రియల్లీ హ్యాపీ ఫర్ యూ చైతూ. నీ సన్నివేశాలన్నింటినీ ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నా. మామా అల్లుళ్ల కథను హ్యాండిల్ చెయ్యడం అంత ఈజీ కాదు. చాలా పరిణతితో చాలా సెన్సిబుల్‌గా ఈ మూవీని బాబీ రూపొందించాడు. ప్రతి సీక్వెన్స్ సినిమాలో చాలా బాగా వచ్చింది. బాబీ చేసిన బెస్ట్ ఫిలిమ్స్‌లో ఇదొకటి. హి డన్ వెరీ గుడ్ జాబ్.
తమన్ వండర్ఫుల్ మ్యూజిక్, బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. మా అన్నయ్యకు థాంక్స్ చెప్పుకుంటున్నా. 'సినిమా తప్పకుండా బాగా రావాలి. చైతన్య కెరీర్‌లోని బెస్ట్ రోల్స్‌లో ఇదొకటవ్వాలి' అని అన్నయ్య సినిమా మొదలైనప్పట్నుంచీ నాతో అంటూనే వచ్చాడు. ఇలాంటి ఫిలింను చెయ్యడం అనేది మాపై ఉన్న పెద్ద బాధ్యత. రోజూ షూటింగ్ నుంచి ఇంటికి వెళ్లినప్పుడల్లా మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా చైతూ రోల్ గురించి అడుగుతుండేవాళ్లు. అతని రోల్ చాలా ఇంట్రెస్టింగ్గా రావాలని చెప్పేవాళ్లు. నిజంగానే అతని క్యారెక్టర్ రూపొందిన విధానానికి సంతోషంగా ఉన్నా. 'ఎఫ్2' తర్వాత నాకిది భిన్న తరహా చిత్రం. కేవలం ఎంటర్టైన్మెంటే కాకుండా చాలా యాక్షన్, ఎమోషనల్ సీన్స్ ఉన్న సినిమా. డిసెంబర్ 13న ఒక పెద్ద కమర్షియల్ ఫిల్మ్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది" అని ఆయన చెప్పారు.