కూలీ నెం1 వెంకీ.. కూలీ నెం786 వరుణ్
on Nov 3, 2018
విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూలీలుగా కనిపించనున్నారు... అదీ కాసేపే అట! వీరిద్దరూ తోడల్లుళ్లుగా నటిస్తున్న సినిమా 'ఎఫ్2'. ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్.. అనేది కాప్షన్! క్యాప్షన్‌కి తగ్గట్టు వినోదం అందించడం కోసం సినిమాలో కాసేపు కూలీలుగా కనిపించనున్నారు. అందులో ప్రత్యేకత ఏంటంటే... ఇంతకు ముందు 'కూలి నంబర్ 1' సినిమా చేసిన వెంకటేష్, ఈ 'ఎఫ్2'లోనూ కూలీ నంబర్ 1 బ్యాడ్జీతో కనిపిస్తారు. పాత సినిమాలో వెంకటేష్ రైల్వే కూలీగా నటించారు. ఈ కొత్త సినిమాలోనూ రైల్వేగా కూలీగా కనిపిస్తారట! వరుణ్ తేజ్ మాత్రం ఇంతకు ముందెప్పుడూ కూలీగా నటించలేదు. గత సినిమాల్లో ఎప్పుడూ ప్రత్యేకంగా ఒక నంబర్ హైలైట్ చేస్తూ సన్నివేశాలు చేయలేదు. అందుకని, పెదనాన్న చిరంజీవి నంబర్ వాడుకున్నారు. తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరంజీవి 'ఖైదీ'. ఆయనే 'ఖైదీ నంబర్ 786', 'ఖైదీ నంబర్ 150' కూడా! ఈ మూడిటిలో వరుణ్ తేజ్ 786 నంబర్ సెలెక్ట్ చేసుకున్నారు. ఆయన రైల్వే కూలీ 786గా కనిపిస్తారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో వెంకటేష్ సరసన తమన్నా, వరుణ్ తేజ్ సరసన మెహరీన్ నటిస్తున్న సంగతి తెలిసిందే.