English | Telugu

'వాల్మీకి'గా వరుణ్ తేజ్ చింపేశాడా?

on Sep 9, 2019

 

"నాపైన పందాలేస్తే గెలుస్తరు. నాతోటి పందాలేస్తే చస్తరు", "మనం బతుకుతున్నమని పదిమందికి తెల్వకపోతే ఇక బతుకుడెందుకురా".. అంటున్నాడు 'వాల్మీకి' ట్రైలర్‌లో వరుణ్ తేజ్. ఇది ఆ సినిమాలో అతని కేరెక్టరైజేషన్ అని చెప్పుకోవచ్చు. హరీశ్ శంకర్ డైరెక్ట్ చేసిన 'వాల్మీకి' మూవీలో గద్దలకొండ గణేశ్ అనే గ్యాంగ్‌స్టర్ కేరెక్టర్‌లో వరుణ్ తేజ్ కనిపించనున్నాడు. సోమవారం 'వాల్మీకి' ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.

పదిమందిలో మంచి అనిపించుకోవాలని కొంతమంది సేవా కార్యక్రమాల ద్వారానో, ఇంకేవైనా మంచి పనుల ద్వారానో ప్రయత్నిస్తుంటారు. గద్దలకొండ గణేశ్ ఆ బాపతు కాదు. తన గురించి పదిమందీ మాట్లాడుకోవడానికి అతను ఎంచుకున్న మార్గం హింసా మార్గం. తనకు ఎదురు తిరిగినవాళ్లను, తన మాట పట్టించుకోనివాళ్ల్లను చంపడానిక్కూడా వెనుకాడని క్రూరుడు. ఏ మాత్రం దయా దాక్షిణ్యాలు లేని నరరూప రాక్షసుడు లాంటివాడు. అలాంటి వాడు 'వాల్మీకి'లా ఎలా సాధువుగా మారాడనే విషయాన్ని ఈ సినిమాలో డైరెక్టర్ చూపించబోతున్నాడు.

నిజానికి ఇదే ఒరిజినల్ స్టోరీ కాదు, తమిళం నుంచి దిగుమతి చేసుకున్న కథ అని మనలో చాలామందికి తెలిసిన విషయమే. అక్కడ 'జిగర్తాండ' పేరుతో రిలీజై సూపర్ హిట్ అయిన సినిమాని మన ఆడియెన్స్ సెన్సిబిలిటీస్‌కు తగ్గట్లు మార్పులు చేర్పులు చేసి తీశానని హరీశ్ శంకర్ చెప్తున్నాడు. అక్కడ బాబీ సింహా చేసిన కేరెక్టర్‌ను ఇక్కడ వరుణ్ తేజ్ చేశాడు. వరుణ్‌ను దృష్టిలో పెట్టుకొని ఆ కేరెక్టర్‌కు ప్రాధాన్యం పెంచాడు డైరెక్టర్. అందుకే హీరో కేరెక్టర్ కంటే తెలుగులో విలన్ కేరెక్టర్‌కే ఎక్కువ ప్రాధాన్యం కనిపిస్తుంది.

మృణాలిని రవి కేరెక్టర్ "ఆ గణేశ్ గాడి దెబ్బకు మగపురుగు కూడా నా మీద వాలట్లేదు" అని వాపోవడం చూస్తే, ఆమె అంటే గణేశ్ పడి చస్తాడనీ, అందుకే ఏ మగవాడూ ఆమెని కన్నెత్తి చూడడనీ తెలుస్తోంది. కానీ ఆమె మాత్రం హీరో అధర్వను ప్రేమిస్తుంది. మరి ఆ ప్రేమజంట కథ సుఖాంతమయ్యిందా? గణేశ్‌ని ఎదిరించి ఆ ఇద్దరూ ఒక్కటయ్యారా? అనేది ఆసక్తి కలిగించే అంశం.

'వాల్మీకి'లో తమిళ నటుడు అధర్వ హీరోగా నటించాడు. ఈ సినిమాలో అతను ఒక అప్‌కమింగ్ మూవీ డైరెక్టర్ కేరెక్టర్ చేశాడు. నిజానికి తన సినిమాలో నిజ జీవితంలో గ్యాంగ్‌స్టర్ అయినవాడ్ని హీరోగా పెట్టాలనుకుంటాడు అధర్వ. అతను తీసే సినిమాలో తనే హీరో అని డిక్లేర్ చేస్తాడు గణేశ్. అతనికి భయపడి తప్పనిసరి పరిస్థితుల్లో అతడ్ని హీరోగా పెట్టి సినిమా తీస్తాడు అధర్వ. ఆ సినిమా కోసం గణేశ్ ఆహార్యం మారిపోతుంది. రౌడీగా ఉన్నప్పటి పొడవాటి గడ్డాన్ని సినిమా కోసం తీసేసి, పక్క పాపిడి, ఉంగరాల జుట్టుతో పాత కాలం హీరో లెక్క తయారవుతాడు గణేశ్. అతని జోడీగా పూజా హెగ్డే వస్తుంది. ట్రైలర్ చివరలో "ఒక మామూలు మనిషి మహర్షి అయ్యి రామాయణం రాశాడు. అందుకే మన సినిమాకు 'వాల్మీకి' అనే టైటిల్ అనుకుటున్నాను" అని అధర్వ చెప్పడం కనిపిస్తుంది. అంటే 'వాల్మీకి'లో అధర్వ తీసే సినిమా పేరు కూడా 'వాల్మీకి' అని తెలుస్తోంది.

"గత్తరలేపినవ్.. చింపేసినవ్‌పో" అని గణేశ్‌తో ఒకామె అనడం గమనిస్తే.. అది ఆ సినిమాలో గణేశ్ యాక్టింగ్‌కు ఆమె ఇచ్చిన ప్రశంస అని ఊహించవచ్చు. ఇది 'వాల్మీకి'గా వరుణ్ తేజ్ నటనకు డైరెక్టర్ హరీశ్ శంకర్ ఇచ్చిన కితాబు అని కూడా మనకు అర్థమవుతుంది. సెప్టెంబర్ 20న ఆడియెన్స్ ముందుకు వస్తున్న 'వాల్మీకి'తో నిజంగా వరుణ్ తేజ్ ఎలాంటి సంచలనం సృష్టిస్తాడోనని సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


Cinema GalleriesLatest News


Video-Gossips