విమెన్స్ డే పుణ్యమా అని 'వకీల్ సాబ్'లో ముగ్గురు అమ్మాయిల ఫస్ట్ లుక్ వచ్చింది!
on Mar 8, 2021
పవన్ కల్యాణ్ టైటిల్ రోల్ పోషిస్తోన్న 'వకీల్ సాబ్' మూవీకి సంబంధించి తొలిసారి ఆ సినిమాలో కీలక పాత్రధారులైన ముగ్గురు తారల లుక్‌ను విమెన్స్ డే సందర్భంగా సోమవారం రివీల్ చేశారు. సూపర్ హిట్ హిందీ ఫిల్మ్ 'పింక్'కు రీమేక్ అయిన 'వకీల్ సాబ్'లో లైంగిక వేధింపులకు గురయ్యే ముగ్గురు యువతులుగా నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ల నటిస్తున్నారు. ఒరిజినల్లో ఈ పాత్రలను తాప్సీ, కృతి కుల్హరి, ఆండియా తరియాంగ్ పోషించారు. నిజానికి ఒరిజినల్లో హైలైట్ అయ్యేది, ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఉండేదీ ఆ మూడు పాత్రలకే. తెలుగుకు వచ్చేసరికి వకీలు క్యారెక్టర్‌ను హైలైట్ చేశారు.
విమెన్స్ డే సందర్భంగా 'వకీల్ సాబ్' ప్రొడక్షన్ హౌస్ శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఒక పోస్టర్‌ను షేర్ చేసింది. ఈ పోస్టర్లో కుర్చీలో పవన్ కల్యాణ్ కూర్చొని ఉండగా, ఆయన వెనుక వరుసగా నివేదా, అంజలి, అనన్య నిల్చొని ఉన్నారు. పవన్ చేతిలో "విమెన్ లా అండ్ క్రిమినల్ జస్టిస్" బుక్ ఉండటం చూడొచ్చు. ముగ్గురు యువతుల ముఖాలూ వేదనాభరితంగా కనిపిస్తున్నాయి. సినిమాలో ఆ ముగ్గురి తరపున కోర్టులో వాదించే వకీలు పాత్రను పవన్ కల్యాణ్ పోషిస్తున్నారు.
ఏప్రిల్ 9న 'వకీల్ సాబ్'ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. శ్రీరామ్ వేణు డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తమన్ మ్యూజిక్ సమకూరుస్తుండగా, పి.ఎస్. వినోద్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. ఇటీవలే పవన్ కల్యాణ్ క్యారెక్టరైజేషన్‌ను తెలియజేసే "సత్యమేవ జయతే" సాంగ్‌ను రిలీజ్ చేశారు. అయితే అది ఆశించిన రీతిలో ఆదరణ పొందకపోవడం గమనార్హం.
Also Read