'వకీల్ సాబ్' ఇంకా గట్టెక్కలేదు! 9 డేస్ కలెక్షన్ ఇదే..
on Apr 19, 2021
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ టైటిల్ రోల్ చేసిన 'వకీల్ సాబ్' సినిమా తొమ్మిదో రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 1.32 కోట్ల షేర్ రాబట్టింది. రెండో వారాంతంలో శనివారం మరింత ఎక్కువ కలెక్షన్లు ఆశించగా, ఆ అంచనాలను 'వకీల్ సాబ్' అందుకోలేకపోయింది. దీంతో బయ్యర్లు కొంత నిరుత్సాహాయానికి గురైన మాట నిజం. రెండు తెలుగు రాష్ట్రాల్లో 'వకీల్ సాబ్' ప్రి బిజినెస్ వాల్యూ రూ. 80.35 కోట్లు. తొమ్మిది రోజులకు వచ్చింది రూ. 74.72 కోట్లు. అంటే 93 శాతం రికవర్ అయినట్లే.
అయితే క్రమక్రమంగా వసూళ్లు తగ్గిపోతుండటంతో మిగతా అమౌంట్లో ఎంత రికవర్ అవుతుందనే విషయంలో ట్రేడ్ వర్గాలు కూడా కచ్చితంగా అంచనాకు రాలేకపోతున్నాయి. అయితే బయ్యర్లకు ఈ సినిమా లాభాలు తేవడం మాత్రం కష్టమేనని మాత్రం వారంటున్నారు. తొమ్మిది రోజులకు 'వకీల్ సాబ్' ఆంధ్రలో రూ. 38.61 కోట్లు, తెలంగాణలో రూ. 23.79 కోట్లు, రాయలసీమలో రూ. 12.32 కోట్లు వసూలు చేసింది.
తెలంగాణ ప్రి బిజినెస్ విలువ రూ. 25.2 కోట్లకు గాను ఇప్పటికే రూ. 23.79 కోట్లు రికవర్ అయ్యింది. అంటే 94 శాతం రికవర్ అయ్యింది. శనివారం ఇక్కడ రూ. 48 లక్షల షేర్ వచ్చింది. ఈ వారంతో తెలంగాణలో ఈ సినిమా బ్రేకీవెన్ కావచ్చని ఆశిస్తున్నారు.
ఆంధ్రలో ప్రి బిజినెస్ వాల్యూ రూ. 41.75 కోట్లకు గాను తొమ్మిది రోజులకు వచ్చింది రూ. 38.61 కోట్లు. రికవరీ శాతం సుమారు 92.5. ఈ ఏరియాలో కొంతమంది ఎంతో కొంత నష్టపోయే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు.
రాయలసీమ ప్రి బిజినెస్ వాల్యూ రూ. 13.4 కోట్లకు గాను తొమ్మిది రోజులకు వచ్చింది రూ. 12.32 కోట్లు. రికవరీ అయ్యింది సుమారు 92 శాతం. ఈ ఏరియాలోనూ కొద్దిమంది బయ్యర్లు నష్టపోవచ్చు.
మొత్తానికి భారీ ఓపెనింగ్స్ రాబట్టిన 'వకీల్ సాబ్' రెండో వారంలో నిరాశాజనక ఫలితాలను అందిస్తున్నాడు. మొదట బ్లాక్‌బస్టర్ అవడం ఖాయమనుకున్న స్టేజ్ నుంచి బ్రేకీవెన్ అయితే చాలనుకొనే స్టేజ్‌కు వచ్చాడు.