English | Telugu

అతడు తెలుగు సినిమాకు కొత్త మాట... కొత్త రాత!

on Nov 7, 2019

 

తెలుగు సినిమాకు మాటలు నేర్పిన రచయితలు ఎందరో ఉన్నారు. అయితే, ఈ తరంలో తెలుగు సినిమాకు కొత్త మాట నేర్పిన రచయిత మాత్రం త్రివిక్రమ్ శ్రీనివాస్ అనడంలో ఎటువంటి సందేహాలు అవసరం లేదు. కొత్త రాతను పరిచయం చేసింది మాత్రం నిస్సందేహంగా అతడే!

త్రివిక్రమ్ రాకతో తెలుగు సినిమాల్లో డైలాగులు రాసే విధానం మారింది. ప్రాసకు ప్రాధాన్యం పెరిగింది. మంచి విషయాలను మహా మంచిగా చెప్పడం మొదలైంది. పంచ్ డైలాగులు వెనక పాకులాడడం ప్రారంభమైంది. త్రివిక్రమ్ రాకతో రచనా పరంగా తెలుగు సినిమా కొత్త రూపు సంతరించుకుంది.

ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన రచయిత త్రివిక్రమ్. మహేష్ బాబు కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన తొలి చిత్రం 'అతడు'. అందులో పతాక సన్నివేశాలకు ముందు మహేష్, త్రిష మధ్య ఒక సన్నివేశం ఉంటుంది. 'నేనూ వస్తా... నేనే వస్తా' - ఇద్దరి మధ్య సంభాషణ ఇంతే! యుద్ధానికి వెళ్తున్న అతడితో తాను వస్తానని చెబుతుంది. అందుకు బదులుగా అతడు తానే తిరిగి వస్తానని చెబుతాడు. ఆ సన్నివేశంలో పేజీలకు పేజీలు డైలాగులు ఉండవు. కానీ, ఒక్క పేజీలో పట్టనంత భావం ఉంటుంది. డైలాగులను క్లుప్తంగా రాయడం త్రివిక్రమ్ ప్రారంభించాడు. అందరూ అతన్ని ఫాలో అయ్యారు. దర్శకుడికి ఫ్రంట్ సీట్ ఇస్తూ, రైటర్ గా బ్యాక్ సీట్ కి త్రివిక్రమ్ పరిమితమైన సన్నివేశాలు ఉన్నాయి. వాటిలోనూ అతడి మాటలే హైలైట్ అవ్వడం విశేషమే.

దర్శకుడిగా త్రివిక్రమ్ తొలిచిత్రం 'నువ్వే నువ్వే'. అందులో కథానాయికకు ఓ సందేహం వస్తుంది. తనపై హీరో కి బోర్ కొట్టి వదిలేస్తే? హీరో ని అడిగేస్తుంది కూడా! అప్పుడు హీరో ఏం చెబుతాడో తెలుసా? 'అమ్మ... ఆవకాయ్... అంజలి... ఎప్పటికీ బోర్ కొట్టవు' అని! ఈ సన్నివేశంలో కథానాయక పై తన ప్రేమను మాత్రమే హీరో చెబితే చాలు. కేవలం ప్రేమ గురించి మాత్రమే రాస్తే... ఆ రచయిత త్రివిక్రమ్ ఎందుకు అవుతాడు? అమ్మను ఎంత ప్రేమగా చూసుకోవాలి అనేది ప్రేక్షకులకు గుర్తు చేస్తాడు! తెలుగు వంటలపై తనకు ఉన్న మమకారాన్ని చూపుతాడు.

పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన బ్లాక్ బస్టర్ 'అత్తారింటికి దారేది'. అందులో 'చూడప్ప సిద్దప్ప... నేను సింహం లాంటోడిని. అది గడ్డం గీసుకోదు నేను గీసుకుంటా అంతే తేడా మిగతాదంతా సేమ్ టు సేమ్' డైలాగ్ అందరికీ గుర్తుంటుంది. ఆ సినిమాలో కోట శ్రీనివాసరావు యాస, భాషను గమనించారా? చిత్తూరు మాండలికంలో ఉంటుంది. 'అరవింద సమేత వీర రాఘవ'లో రాయలసీమ యాసకు ప్రాముఖ్యం ఇచ్చారు. రాయలసీమ యాసలో సొగసు చూపించే ప్రయత్నం చేశారు. 

'అరవింద సమేత'లో ఎన్టీఆర్ వీరత్వం గురించి జగపతిబాబు ఒక డైలాగ్ లో చెబుతారు.... 'ఆపొద్దు వాడిని చూస్తూ ఉంటే చావు చొక్కా విప్పుకుని తిరుగుతున్నట్టు ఉంది' అని. చావు చొక్కా విప్పి తిరగడం ఏంటి? కోపంతో రగులుతున్న కథానాయకుడి ముందుకు వెళితే మరణమే అనే మాటను అంత అందంగా చెప్పడం త్రివిక్రమ్ కి మాత్రమే సాధ్యం. అదే సినిమాలో కథానాయకుడు కత్తి పట్టినట్టు లేదని, అతడి చేతికి కత్తి మొలిచినట్టు ఉందని అర్థం వచ్చేలా మరోమాటలో నానమ్మ పాత్రతో త్రివిక్రమ్ చెప్పించారు. చెప్పుకుంటూ పోతే త్రివిక్రమ్ రాసిన గొప్ప మాటలు ఎన్నో. ఒక గొప్ప భావాలను వాడుక పదాలలో చెప్పిన సన్నివేశాలు ఎన్నో.

త్రివిక్రమ్ మాటలు పద కవిత్వంతో సమానం! అతడిని అనుసరించాలని చాలా మంది ప్రయత్నించారు. కానీ, అతడి స్థాయిని అందుకోలేక సతమతమవుతున్నారు. కారణం ఒక్కటే... పంచ్ రాయాలనే ప్రయత్నం త్రివిక్రమ్ మాటల్లో కనిపించదు. అలవోకగా, పండు వలిచి నోట్లో పెట్టినంత అందంగా అచ్చ తెలుగులో రాస్తుంటారు. తెలుగుభాషపై యువతకు ఆసక్తి పెరిగేలా మాటలు రాయగలిగిన రచయిత త్రివిక్రమ్ మాత్రమే. అతడికి తెలుగువన్ తరఫున జన్మదిన శుభాకాంక్షలు.
 


Also ReadLatest NewsCustomer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here