బాలు కంఠం దేవదత్తం!
on Sep 25, 2020
ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల సరిహద్దు పల్లె కోనేటంపేటలో పుట్టిన బాలసుబ్రహ్మణ్యం తెలుగువాళ్లకీ, తమిళులకీ ఉమ్మడి సినీ గాయకుడు. తమిళాంధ్ర దేశాలను బాలు లాగ ఉర్రూతలూగించిన గాయకుడు మరొకరు లేరు. ఘంటసాల, టి.ఎం. సౌందరరాజన్ ఒక విధంగా తెలుగు, తమిళ రంగాలకే పరిమితమైనవారు. కానీ బాలు గళం ఈ రెండు రంగాలకే కాకుండా కన్నడ, హిందీ రంగాలకు కూడా వ్యాపించి తెలుగు గాయకశ్రేణికి అఖండమైన కీర్తిని ఆర్జించిపెట్టింది. ఏకంగా 11 భాషల్లో 40 వేలకు మించి పాటలకు ఆలపించిన మహోత్తమ ప్రతిభాశాలి బాలు.
సాధనతో ఒక వ్యక్తి ఎంతటి శక్తిగా మారగలడో నిరూపిస్తుంది బాలు జీవితం. ముత్యాలొలికే దస్తూరి, మూలాగ్రాలెరిగిన ఆంధ్ర సాహితీ పరిచయం, ధ్వన్యనుకరణ వంటి కళల్లో ప్రవేశం, అనర్గళంగా ఇంగ్లీషుతో పాటు దేశభాషలు అయిదారు మాట్లాడగల వాగ్ఝరి ఆయన నిధులు. శాస్త్రీయ సంగీతం నేర్చుకొనకపోయినా, కె.వి. మహదేవన్, పుగళేంది లాంటి మహనీయుల వల్ల దానిని సాధించి పాడి మెప్పించిన సాధకుడు. సంగీత దర్శకుడిగా తక్కువ సినిమాలే చేసినా మధురంగా, మనోహరంగా సంగీతం వినిపించారు బాలు. అలాగే గొంతులు మార్చి పాడటంలో గాత్రధారులకు కొత్త కోణాలు ఆవిష్కరించిన దశకంఠుడు బాలు.
మహామహులైన సంగీత దర్శకుల, రచయితల మధుర గీతాలెన్నో పాడే అవకాశం ఇతర గాయకుల కన్నా ఎక్కువగా ఆయనకే దొరికింది. చరిత్ర సృష్టించిన చిత్రాలకు పాడి చరితార్థుడైనాడు. ఆయన కంఠం దేవదత్తం. ధ్వన్యనుకరణలో, గాత్రదానంలో, గాత్రపరమైన నటనలో ఇంతటి కళాకారుడు ఇంతవరకు రాలేదు. బాలూకి సాహిత్యమంటే అమితమైన అభిమానం. ఎక్కడెక్కడి పద్యాలో, గీతాలో అవలీలగా ఆయన స్మృతిపథంలో నుంచి వచ్చేవి.
డబ్బింగ్ రంగంలో నేర్పు ఆయనను ప్రథమపంక్తిలో నిలబెట్టింది. నిద్ర లేచింది మొదలు నిద్రపోయేవరకూ నిర్ణిద్ర గాత్రావధానమే ఆయన జీవితం. చిత్ర వాణిజ్యంలో తెలుగుపాట విలువ, మర్యాద కాపాడుతూ పాడినవాడు. నటుడిగానూ రాణించారు. వ్యాపారవేత్తగా కొన్ని సినిమాలు నిర్మించి చేతులు కాల్చుకున్నారు.
Also Read