English | Telugu

ఈ ఏడాది శ్రోతల్ని ఉర్రూతలూగించిన ఓ పది పాటలు మీ కోసం !

on Dec 31, 2017

సినిమాలో పాటలు బావుంటే సినిమా సగం విజయం సాధించినట్లే. ఇది మేధావులు సైతం అంగీకరించిన మాట. కథకు తగ్గట్టు నేపథ్య సంగీతం కుదిరితే.. సినిమా దాదాపు హిట్. దీన్నిబట్టి.. సినిమా విజయంలో సంగీతం పాత్ర ఎంతుందో అర్థంచేసుకోవచ్చు.

జనాలను అలరించే సినిమాలు ప్రతి ఏడాదీ వస్తూనే ఉంటాయ్. అలాగే... శ్రోతలను ఉర్రూతలూగించిన పాటలు కూడా ఏ యేటికాయేడు హల్ చల్ చేస్తూనే ఉంటాయ్.  మరి ఈ ఏడాది విజయవంతమైన సినిమాల గురించి మొన్న చెప్పుకున్నాం. మరి ఈ ఏడాది ఉర్రూతలూగించిన కొన్ని పాటల గురించి సరదాగా గుర్తు చేసుకుందాం.  

1.  ‘దండాలయ్యా.. దండాలయ్యా... మాతోనే నువ్వు ఉండాలయ్యా...’  (బాహబలి  ది కంగ్లూషన్)

బహుశా ఈ ఏడాది ఈ పాటంత జనాలనోళ్లలో ఈ పాటంత నానిన పాట మరొకటి లేదేమో. ‘బాహుబలి ది కంగ్లూషన్’లోని ఈ పాట నిజంగా ఆల్ టైమ్ హిట్. ఈ చిత్ర సంగీత దర్శకుడు కీరవాణే ఈ పాటకు లిరిక్ రైటర్ కూడా కావడం విశేషం. అంతేకాదు... కీరవాణి తనయుడు కాలభైరవ ఈ పాటను ఆలపించడం మరో విశేషం.


2.  అమ్మడు లెట్స్ డు కుమ్ముడు  (ఖైదీ నంబర్ 150)

మెగాస్టార్ మార్క్ మాస్ బీట్. పదేళ్ల విరామం తర్వాత ఆయన స్టెప్పుల్ని చూసిన అభిమానులు పరవశించిపోయారు. థియేటర్లన్నీ విజిల్స్ తో మోతమోగిపోయాయ్. దానికి తగ్గట్టే ఆడియో పరంగా కూడా ఈ పాట పెద్ద హిట్. రింగ్ టోన్స్ ఈ పాటే, కాలర్స్ ట్యూన్స్... ఈ పాటే. మరి మెగాస్టారా మజాకా. దేవిశ్రీ ప్రసాద్ స్వయంగా రాసి ఈ పాటను స్వరపరచడం విశేషం.  పాడింది కూడా ఆయనేనండోయ్. ఫిమేల్ వాయిస్ మాత్రం రెనీనా రెడ్డి పాడారు.


3. ‘వచ్చిండే...మెల్లమెల్లగ వచ్చిండే... క్రీము బిస్కెట్ వేసిండే‘  (ఫిదా)

యూత్ ని విపరీతంగా ఆకట్టుకున్న పాట ఇది. ‘ఫిదా’ సినిమా అనగానే.. ముందు అందరూ హమ్ చేసింది ఈ పాటనే. ఈ పాటను మధుప్రియ, రామ్ కీ కలిసి పాడారు. నిజానికి వారిద్దరూ పాడటం కూడా అలాగే పాడార్లే. ఇరగదీసేశారు. ఇక పెర్ ఫార్మెన్స్ తో ఆ పాటను ఆకాశమంత ఎత్తులో కూర్చోబెట్టింది సాయిపల్లవి. ఏం పిల్లండీ బాబూ... కుర్రాళ్లకు పిచ్చెక్కించేసిందంటే నమ్మండి. సామాజిక దృక్పథంతో కూడిన సాహిత్యాన్నే ఎక్కువగా రాసే సుద్దాల అశోక్ తేజా కలం... ఈ పాటలో పోయిన హొయలు అన్నీఇన్నీ కావు. సంగీత దర్శకునిగా శక్తికాంత్ కార్తీక్ కి ఈ పాట పెద్ద బ్రేక్.


4. ’హే పిల్లగాడా... ఏందిరో పిల్లగాడా...నా గుండెకాడా లొల్లి’   (ఫిదా)

ఈ పాట కూడా ‘ఫిదా’ సినిమాలోదే. నిజంగానే పిల్లగాళ్ల గుండెల్లో లొల్లి చేసేసిందీ పాట. శక్తికాంత్ కార్తీక్ స్వరపరచిన ఈ పాట వింటుంటే... మనల్ని తీపి జ్ఙాపకాలు పలకరిస్తుంటాయ్. ఆ మ్యూజిక్ ఎక్కడో విన్నట్టు... మనల్ని పలకరిస్తున్నట్లు అనిపిస్తుంది. అప్పుడు గుర్తొస్తారు మనకు మల్లీశ్వరి, నాగరాజు... పరుగులు తీస్తున్న గిత్తల్ని ఉరకలు వేయిస్తూ. వనమాలి రాసిన ఈ పాటను సింధూరిi, సిన్వొరాజ్ పాడారు. ఇక సాయిపల్లవి గురించి ఏం చెబుతాం లేండి. ఎంత చెప్పుకున్నా తక్కువే కదా.


5. ‘ఓ సక్కనోడా... పట్టు పడికిలై... దాడి చేసినావె దడదడా..’  (గురు)

‘గురు’ సినిమాలోని పాట ఇది. ఈ ఏడాది బాగా వినిపించిన పాట. బాగా జనాలతో హమ్ చేయించిన పాట ఇదే. చాలామంది అమ్మాయిలు.. ఈ పాటను ‘డబ్స్ మేష్’ చేసి సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టారు. అంత పాపులర్ అయిన పాట ఇది. ధీ.. అనే అమ్మాయి ఈ పాట పాడింది. పేరు లాగే..ఆ అమ్మాయ్ వాయిస్ కూడా వెరైటీగా ఉంది. హస్కీగా ఆమె ఈ పాట పాడిన తీరు సూపర్బ్. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటను సంతోశ్ నారాయణన్ స్వరపరిచాడు. ఈ ఏడాది సూపర్ హిట్ సాంగ్స్ లో ఇదొకటి.


6. ‘ అరెరెరే.. ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ నా ప్రాణం.. నా ప్రశ్నకు నువ్వేలే సమాధానం‘  (నేను లోకల్)

‘నేను లోకల్’ లోని ఈ పాట సూపర్ హిట్. దేవిశ్రీ ప్రసాద్ నిజంగా కిర్రేక్ పుట్టించాడు ఈ పాటతో. ఇక నాని, కీర్తి సురేశ్ అయితే... పెర్ ఫార్మెన్స్ ఇరగదీసేశారు. యువతరాన్ని బాగా అలరించిన పాట ఇది. నరేశ్, మనీషా ఈ పాటను అలపించారు.

 

7. ‘నీ కళ్లలోని కాటుక ఓ నల్లమబ్బు కాదా.’  ( జై లవకుశ)

ఈ ఏడాది సూపర్ హిట్ సాంగ్స్ లో ఈ పాట ఒకటి. అందులో అనుమానమే లేదు. ఎన్టీయార్, నివేదా థామస్ తమదైన శైలిలో అదరగొట్టేశారు ఈ పాటలో. ‘జై లవకుశ’ ఆడుతున్నన్ని రోజులూ ఎక్కడ విన్నా ఈ పాటే. డ్యూయెట్ లో కనిపించే ఈ సోలో సాంగ్ ని చంద్రబోస్ రాయగా... హేమచంద్ర ఆలపించాడు. ఇక దేవిశ్రీప్రసాద్ గురించి చెప్పేదేమెుంది.


8. ‘హలో.. ఎక్కడున్నా హలో ’   (హలో)

ఈ ఏడాది చివర్లో వచ్చిన సూపర్ హిట్ సాంగ్ ఇది. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ పాటే. ‘హలో’ సినిమాలో టైటిల్ సాంగ్ గా వచ్చే ఈ పాట యువతరాన్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. అనూప్ రూబెన్స్ అద్భుతంగా స్వరపరిచిన ఈ పాటను వనమాలి, శ్రేష్ట కలిసి రాయగా, అర్మాన్ మాలిక్ ఆలపించాడు. ఇక ఈ పాటలో అఖిల్ అక్కినేని నటన అదుర్స్. ఈ ఏడాది సూపర్ హిట్ పాటల్లో ఇది కూడా ఒకటి సందేహం లేదు. .


9. ‘శతమానం భవతి... మీకు శతమానం భవతీ’ (శతమానం భవతి)

ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా అగ్రహీరోల సినిమాలను సైతం వెక్కిరిస్తూ ఘన విజయాన్ని అందుకుంది. ఇక అందులోని ఈ పాట ఆల్ టైమ్ హిట్. సినిమా ఆత్మను ప్రతిబింబించేలా రామజోగయ్యశాస్త్రి ఈ పాటను రాస్తే...  మిక్కీ జె.మేయర్ స్వరపరిచాడు. చిత్ర, విజయ్ ఏసుదాస్ ఆలపించారు. సంక్రాంతి పండుగ వాతావరణాన్ని ప్రతిబింబించిందీ పాట. ఈ ఏడాది మంచి పాట, బాగా వినిపించిన పాట ఇది.


10. ‘అడిగా అడిగా’ (నిన్నుకోరి)

యువతరానికి కిక్కెక్కించిన పాట ఇది. గోపి సుందర్ మెలోడియస్ గా ట్యూన్ చేసిన ఈ పాటను... గాయకుడు సిద్ధి శ్రీరామ్ హస్కీ వాయిస్ తో చక్కగా పాడాడు. సినిమాలో నాని పెర్ ఫార్మెన్స్ సూపర్. బయట కూడా ఈ పాటను  కుర్రాళ్లు తెగ పాడుకున్నారు. ఈ ఏడాది శ్రోతల్ని అలరించిన పాటల్లో ఇదొకటి.


ఇవి మాత్రమే కాదండోయ్...ఈ ఏడాది శ్రోతల్ని ఉర్రూతలూగించిన పాటలు చాలానే ఉన్నాయ్. మచ్చుకు కొన్ని పాటల్ని చెబుతున్నామంతే. ఇదే మా అభిప్రాయం కాదు. ఇవే మాత్రమే హిట్ సాంగ్స్ కావు. ఇంతకంటే మంచి పాటలూ ఉండొచ్చు. ఉండకపోవచ్చు. గమనించగలరు.


Also ReadLatest NewsCustomer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here