English | Telugu

క‌రోనా దెబ్బ‌కు విడుద‌ల వాయిదాప‌డ్డ 10 సినిమాలు

on Mar 22, 2020

 

క‌రోనా వైర‌స్ వ్యాప్తి భ‌యంతో సినిమా హాళ్లు మూసివేయ‌డం, షూటింగ్‌లు నిలిపివేయ‌డంతో టాలీవుడ్ భారీ స్థాయిలో ప్ర‌భావానికి గుర‌వుతోంది. అత్యంత భారీ వ్య‌యంతో నిర్మాణమ‌వుతోన్న రాజ‌మౌళి ఆర్ఆర్ఆర్‌, చిరంజీవి ఆచార్య‌, ప్ర‌భాస్ ఓ డియ‌ర్ త‌దిత‌ర సినిమాల షూటింగ్‌లు నిలిచిపోయాయి. ఈ ఏడాది క్రేజీ ఫిలిమ్స్‌లో ఒక‌టైన నాని 'వి' విడుద‌ల తేదీ పెండింగ్‌లో ప‌డింది. ఇదంతా ప్ర‌జల క్షేమ కోసం, కోవిడ్‌-19 వ్యాప్తిని అరిక‌ట్ట‌డంలో భాగంగా జ‌రుగుతున్న‌దే. అయితే దేశంలో అత్య‌ధిక సంఖ్య‌లో సినిమాల‌ను నిర్మించే చిత్ర ప‌రిశ్ర‌మ‌ల్లో ఒక‌టైన టాలీవుడ్‌కు 2020 సంవ‌త్స‌రం ఒక కుదుపు లాంటిద‌ని చెప్ప‌వ‌చ్చు. క‌రోనా ఎఫెక్ట్‌తో విడుద‌ల తేదీ వాయిదా పడిన‌, ప‌డుతున్న సినిమాలివే.

1. వి

నాని 25వ చిత్రంగా రూపొందుతోన్న 'వి' మూవీ విడుద‌ల నిర‌వ‌ధికంగా వాయిదా ప‌డింది. ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ డైరెక్ష‌న్‌లో దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ మూవీలో నాని విల‌న్‌గా, సుధీర్‌బాబు హీరోగా న‌టిస్తుండ‌టం విశేషం. నివేదా థామ‌స్‌, అదితి రావ్ హైద‌రి హీరోయిన్లు. కిల్ల‌ర్‌గా నాని, పోలీస్ ఇన్‌స్పెక్ట‌ర్‌గా సుధీర్‌బాబు క‌నిపించ‌నున్నారు. ఉగాది సంద‌ర్భంగా మార్చి 25న విడుద‌ల చేయాల‌ని ఏర్పాట్లు చేసిన దిల్ రాజు నిర‌వ‌ధికంగా విడుద‌ల తేదీని వాయిదా వేశాడు. ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డిన త‌ర్వాత విడుద‌ల తేదీని ప్ర‌క‌టిస్తామ‌ని ఆయ‌న తెలిపాడు.

2. 30 రోజుల్లో ప్రేమించ‌టం ఎలా?

టీవీ యాంక‌ర్‌గా సూప‌ర్ పాపుల‌ర్ అయిన ప్ర‌దీప్ మాచిరాజు హీరోగా ప‌రిచ‌య‌మ‌వుతున్న చిత్రం '30 రోజుల్లో ప్రేమించ‌టం ఎలా?'. మున్నా డైరెక్ట‌ర్‌గా ప‌రిచ‌య‌మ‌వుతున్న ఈ సినిమాని క‌న్న‌డంలో ప‌లు సినిమాలు నిర్మించిన తెలుగు నిర్మాత య‌స్వీ బాబు నిర్మిస్తున్నారు. అమృతా అయ్య‌ర్ హీరోయిన్‌గా న‌టించిన ఈ సినిమాలో అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించిన పాట‌లు సంగీత ప్రియుల్ని అమితంగా అల‌రిస్తున్నాయి. ముఖ్యంగా 'నీలి నీలి ఆకాశం ఇద్దామ‌నుకున్నా' సాంగ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ అయ్యింది. మార్చి 25న విడుద‌ల కావాల్సిన ఈ సినిమా కూడా ఆగిపోయి, కొత్త విడుద‌ల తేదీ కోసం ఎదురుచూస్తోంది.

3. ఒరేయ్ బుజ్జిగా

రాజ్ త‌రుణ్ హీరోగా కొండా విజ‌య్ కుమార్ రూపొందించిన 'ఒరేయ్ బుజ్జిగా' సినిమా కూడా ఉగాది పండుగ‌నే ల‌క్ష్యంగా చేసుకొని ప్రేక్ష‌కుల ముందుకు వ‌ద్దామ‌ని ఆశించింది. కె.కె. రాధామోహ‌న్ నిర్మించిన ఈ సినిమాలో మాళ‌వికా నాయ‌ర్ హీరోయిన్ కాగా, హెబ్బా ప‌టేల్ ఒక కీల‌క పాత్ర చేసింది. ఐదు వ‌రుస ఫ్లాపుల‌తో క్లిష్ట స్థితిలో ఉన్న రాజ్ త‌రుణ్ 'ఒరేయ్ బుజ్జిగా' మూవీతో హిట్ కొడ‌తాన‌నే న‌మ్మ‌కంతో ఉన్నాడు. దీని విడుద‌ల తేదీ మార్చి 25 నుంచి వాయిదా ప‌డింది.

4. నిశ్శ‌బ్దం

అనుష్క అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న సినిమా 'నిశ్శ‌బ్దం'. ఏదేమైనా క‌రోనా వైర‌స్ భ‌యంతో ఏప్రిల్ 2న ప్రేక్ష‌కుల ముందుకు రావాల్సిన ఈ సినిమా విడుద‌ల‌ను వాయిదా వేశారు. ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్‌గా రూపొందిన ఈ మూవీలో మాధ‌వ‌న్‌, అంజ‌లి, షాలినీ పాండే, శ్రీ‌నివాస్ అవ‌స‌రాల‌, సుబ్బ‌రాజుతో పాటు హాలీవుడ్ యాక్ట‌ర్ మైఖేల్ మ్యాడ్స‌న్ కూడా న‌టించాడు. హేమంత్ మ‌ధుక‌ర్ డైరెక్ట్ చేసిన ఈ మూవీని టి.జి. విశ్వ‌ప్ర‌సాద్‌, కోన వెంక‌ట్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

5. అర‌ణ్య‌

అడ్వంచ‌ర్ డ్రామాగా తయారైన 'అర‌ణ్య' మూవీలో రానా ద‌గ్గుబాటి, విష్ణు విశాల్‌, శ్రియా పిల్గావోంక‌ర్‌, జోయా హుస్సేన్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. ప్ర‌భు సాల్మ‌న్ డైరెక్ట్ చేసిన హిందీ మూవీ 'హాథీ మేరే సాథీ'కి ఇది తెలుగు వెర్ష‌న్‌. ఏప్రిల్ 2న రిలీజ్ కావాల్సిన ఈ మూవీని క‌రోనా వైర‌స్ వ్యాప్తి కార‌ణంగా విడుద‌ల‌ను వాయిదా వేస్తున్నామ‌ని రానాతో పాటు చిత్ర నిర్మాణ సంస్థ ఈరోస్ ఇంట‌ర్నేష‌న‌ల్ ప్ర‌క‌టించింది. పాతికేళ్లుగా అర‌ణ్యంలో జీవిస్తున్న ఒక వ్య‌క్తి క‌థ‌తో ఈ చిత్రం రూపుదిద్దుకుంది.

6. ఉప్పెన‌

అధికారికంగా ప్ర‌క‌టించ‌క‌పోయినా 'ఉప్పెన' మూవీ విడుద‌ల వాయిదా ప‌డింది. మెగాస్టార్ చిరంజీవి మేన‌ల్లుడు వైష్ణ‌వ్ దేవ్ హీరోగా ప‌రిచ‌య‌మ‌వుతున్న ఈ చిత్రంలో త‌మిళ స్టార్ యాక్ట‌ర్ విజ‌య్ సేతుప‌తి విల‌న్‌గా న‌టించాడు. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా డైరెక్ట‌ర్‌గా, కృతి శెట్టి హీరోయిన్‌గా ప‌రిచ‌య‌మ‌వుతున్న ఈ మూవీని మైత్రీ మూవీ మేక‌ర్స్‌తో పాటు సుకుమార్ స్వ‌యంగా నిర్మిస్తున్నాడు. షెడ్యూల్ ప్ర‌కారం ఏప్రిల్ 2న రావాల్సిన ఈ మూవీ ఎప్ప‌డు విడుద‌ల‌వుతుందో వెల్ల‌డి కావాల్సి ఉంది.

7. రెడ్‌

'ఇస్మార్ట్ శంక‌ర్' వంటి కెరీర్ బిగ్గెస్ట్ హిట్ మూవీ త‌ర్వాత రామ్ హీరోగా న‌టిస్తున్న 'రెడ్' మూవీ షెడ్యూల్ ప్ర‌కారం ఏప్రిల్ 9న విడుద‌ల కావాల్సి ఉండ‌గా, క‌రోనా వైర‌స్ భయాందోళ‌న‌ల మ‌ధ్య వాయిదా ప‌డింది. ఇదివ‌ర‌కు రామ్‌తో 'నేను శైల‌జ', 'ఉన్న‌ది ఒక‌టే జింద‌గీ' సినిమాలు రూపొందించిన కిశోర్ తిరుమ‌ల డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాని స్ర‌వంతి ర‌వికిశోర్ నిర్మిస్తున్నారు. క‌వ‌ల సోద‌రులుగా రామ్ ద్విపాత్ర‌లు చేస్తోన్న ఈ క్రేజీ మూవీలో నివేదా పేతురాజ్‌, అమృతా అయ్య‌ర్‌, మాళ‌వికా శ‌ర్మ హీరోయిన్లు. త‌మిళ హిట్ ఫిల్మ్ 'తాడ‌మ్‌'కు రీమేక్ అయిన ఈ సినిమా కొత్త విడుద‌ల తేదీని ఏప్రిల్ ఫ‌స్ట్ వీక్‌లో ప్ర‌క‌టించ‌నున్నారు.

8. ఉమామ‌హేశ్వ‌ర ఉగ్ర‌రూప‌స్య‌

'కేరాఫ్ కంచ‌ర‌పాలెం' వంటి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు, అవార్డులు పొందిన సినిమాని డైరెక్ట్ చేసిన వెంక‌టేశ్ మ‌హా రూపొందిస్తోన్న 'ఉమామ‌హేశ్వ‌ర ఉగ్ర‌రూప‌స్య‌' మూవీలో టైటిల్ రోల్‌ను టాలెంటెడ్ యాక్ట‌ర్‌గా పేరు తెచ్చుకున్న స‌త్య‌దేవ్ పోషిస్తున్నాడు. ఫాహ‌ద్ ఫాజిల్ న‌టించ‌గా మ‌ల‌యాళంలో హిట్ట‌యిన 'మ‌హేషింతే ప్రతీకార‌మ్' మూవీకి రీమేక్ అయిన ఈ చిత్రాన్ని 'బాహుబ‌లి' నిర్మాణ సంస్థ ఆర్కా మీడియా వ‌ర్క్స్ నిర్మిస్తుండ‌టం గ‌మ‌నార్హం. షెడ్యూల్ ప్ర‌కారం ఏప్రిల్ 17న విడుద‌ల కావాల్సిన ఈ ఆస‌క్తిక‌ర చిత్రం కొత్త విడుద‌ల తేదీని అన్వేషిస్తోంది.

9. మిస్ ఇండియా

'మ‌హాన‌టి'తో జాతీయ ఉత్త‌మ న‌టిగా అవార్డు పొందిన కీర్తి సురేశ్ టైటిల్ రోల్ చేస్తోన్న 'మిస్ ఇండియా' మూవీని ఏప్రిల్ 17న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ఇదివ‌ర‌కు నిర్మాత ప్ర‌క‌టించారు. న‌రేంద్ర‌నాథ్ అనే డెబ్యూ డైరెక్ట‌ర్ రూపొందిస్తోన్న ఈ లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్‌లో న‌వీన్ చంద్ర హీరోగా న‌టిస్తుండ‌గా, జ‌గ‌ప‌తిబాబు, రాజేంద్ర‌ప్ర‌సాద్‌, పూజితా పొన్నాడ‌, న‌దియా కీల‌క పాత్ర‌లు చేస్తున్నారు. ఈస్ట్ కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ బేన‌ర్‌పై ఇదివ‌ర‌కు '118' మూవీని నిర్మించిన మ‌హేశ్ కోనేరు నిర్మిస్తోన్న ఈ సినిమా విడుద‌ల వాయిదా ప‌డింది.

10. శ్రీ‌కారం

ప్ర‌స్తుతం బ్యాడ్ ఫేజ్ న‌డుస్తోన్న శ‌ర్వానంద్ హీరోగా న‌టిస్తోన్న 'శ్రీ‌కారం' చిత్రాన్ని కిశోర్ అనే నూత‌న ద‌ర్శ‌కుడు రూపొందిస్తున్నాడు. 14 రీల్స్ ప్ల‌స్ బ్యాన‌ర్‌పై రామ్ ఆచంట‌, గోపి ఆచంట నిర్మిస్తోన్న ఈ మూవీని ఏప్రిల్ 24న విడుద‌ల చేస్తున్న‌ట్లు ఇదివ‌ర‌కు ప్ర‌క‌టించారు. సాధార‌ణంగా మోడ‌ర‌న్ లుక్‌లో క‌నిపిస్తూ వ‌చ్చే శ‌ర్వానంద్ ఈ సినిమాలో రైతుగా క‌నిపించ‌నుండ‌టం విశేషం. మిక్కీ జె. మేయ‌ర్ మ్యూజిక్ ఎస్సెట్‌గా త‌యార‌వుతున్న ఈ సినిమా విడుద‌ల కూడా నిర‌వ‌ధికంగా వాయిదా పడింది.

- బుద్ధి య‌జ్ఞ‌మూర్తి


Cinema GalleriesLatest News


Video-Gossips