English | Telugu

అన్ని దుర్గుణాలు ఉన్న శ్రీవిష్ణు.. 'తిప్పరా మీసం' ట్రైలర్ రివ్యూ

on Nov 6, 2019

 

విలక్షణ కథాంశాలున్న సినిమాల్లో విభిన్న పాత్రలు చేస్తూ, కంటెంట్ ఉన్న హీరో అని పేరు తెచ్చుకున్న శ్రీవిష్ణు నటించిన లేటెస్ట్ ఫిల్మ్ 'తిప్పరా మీసం' ఈ శుక్రవారం (నవంబర్ 8) విడుదలవుతోంది. 'అసుర' ఫేం కృష్ణవిజయ్ ఎల్. డైరెక్ట్ చేసిన ఈ మూవీలో శ్రీవిష్ణు జోడీగా 'కాంచన 3', 'చీకటిగదిలో చితక్కొట్టుడు' సినిమాల హీరోయిన్ నిక్కీ తంబోలి నటించింది. ఈ మూవీ ట్రైలర్‌ను యూట్యూబ్‌లో సురేశ్ ప్రొడక్షన్స్ రిలీజ్ చేసింది. శ్రీవిష్ణు క్యారెక్టరైజేషన్ ఏమిటనేది ఈ ట్రైలర్ కళ్లకు కట్టినట్లు చూపించింది. 'నీదీ నాదీ ఒకే కథ'లో తండ్రితో ఎప్పుడూ తిట్లు తినే కొడుకుగా కనిపించిన అతను, 'తిప్పరా మీసం'లో తల్లితో నిత్యం ఘర్షణ పడే కొడుకుగా కనిపించాడు. 

"కన్నతల్లిని రోడ్డుమీదకు ఈడ్చిన కొడుకుగా చరిత్రలో మిగిలిపోతావ్." అని శ్రీవిష్ణుతో వెన్నెల రామారావు అనడం, ఆ వెంటనే తల్లి పాత్రధారిణి రోహిణి వానలో గొడుగు వేసుకొని ఇంటిబయట నిల్చోవడం చూస్తే, ఆమెతో శ్రీవిష్ణు ఎలా ప్రవర్తిస్తుంటాడో ఊహించవచ్చు. "వాడికున్న కోపమంతా వాళ్లమ్మ మీదే." అని బ్యాగ్రౌండ్‌లో బెనర్జీ చెప్తుంటే, తల్లి ముందు కుర్చీని కోపంగా కాలితో తన్ని బయటకు విసురుగా వెళ్లే కొడుకుగా శ్రీవిష్ణు కనిపించాడు. "నిన్ను కన్నందుకు నీ తల్లి బాధపడాలి. డ్రగ్స్.. మందు.. అమ్మాయిలు.. ఏం లేవురా నీకు.." అని ఓ పాత్ర చెప్తుండటాన్ని బట్టి మనవాడికి లేని దురలవాటు లేదని తెలుస్తోంది. 

శ్రీవిష్ణు ఈ మూవీలో డిస్క్ జాకీగా కనిపించనున్నాడు. అతడికి సమాజం మీద బాగా కసి అని "నా గతాన్నీ, నా సమస్యనీ గుర్తించని ఈ పనికి మాలిన సమాజం నేను చేసింది తప్పూ అని ముద్ర వేసింది" అంటూ అతడు చెప్పే మాటల ప్రకారం తెలుస్తోంది. "అందరూ నన్ను అర్థంకాని యెదవననుకుంటారు. ఎవడేమనుకుంటే నాకేంటి?.. నేననుకున్నదే చేస్తా" అని తన గురించి తాను చెప్పుకున్నాడు శ్రీవిష్ణు. అతడి మనస్తత్వం ఏమిటన్నది ఆ మాటలు పట్టిస్తున్నాయి. "రేయ్.. ఏ మాటకామాట.. నిన్ను భరించడం చాలా కష్టంరా" అని అతని ఫ్రెండే అన్నాడంటే మనవాడిది ఎంత విపరీత మనస్తత్వమో ఊహించుకోవచ్చు. అతడు ఎందుకలా తయారయ్యాడనే విషయం సినిమా చూస్తే కానీ మనకు తెలీదు. అతడికి ఒక గతం ఉన్నదనీ, దాన్నివల్లే అతడు ఫ్రస్ట్రేటెడ్ పర్సన్‌గా మారాడనీ అనిపిస్తుంది. అయితే ఎవరూ ఆ గతాన్ని గుర్తించడం లేదని అతను ఫీలవుతున్నాడు. అందుకే సమాజం మీద కసితో చెడ్డవాడిగా మారిపోయాడా? అనే విషయం తెలియాల్సి ఉంది.

మూవీలో ఇంటెన్సిటీ ఉండే యాక్షన్ సీన్స్ ఉన్నాయని 'ట్రైలర్' చూపిస్తోంది. మనవాడి విపరీత ధోరణి కోపం తెప్పించడంతో హీరోయిన్ నిక్కీ అతడి చెంప ఛెళ్లుమనిపించడమూ మనం చూడొచ్చు. సిగరెట్ ముట్టించబోతున్న అతడిని వెనక నుంచి ఎవరో వచ్చి అతడి ముఖానికి నల్లడి ముసుగేయడం, ఒక ప్లాస్టిక్ కవర్‌తో అతడి ముఖాన్ని కప్పేసి, ఊపిరాడకుండా చెయ్యాలని చూడటం, నీళ్లలో గొలుసుతో దేన్నో పట్టుకున్నట్లు చూపించడం వంటి సీన్లు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. మరి 'తిప్పరా మీసం' అనే టైటిల్ ఎందుకు పెట్టినట్లు? సాధారణంగా గర్వపడే సందర్భం వచ్చినప్పుడు 'తిప్పరా మీసం' అని అంటుంటారు. విపరీత ధోరణి కలిగిన, నెగటివ్ షేడ్స్ ఎక్కువగా కనిపిస్తున్న మనవాడికి మీసం తిప్పే సందర్భం ఎప్పుడొచ్చింది? 

'నీదీ నాదీ ఒకే కథ'లో కానీ, 'బ్రోచేవారెవరురా'లో కానీ శ్రీవిష్ణు 'బాయ్ నెక్స్ట్ డోర్' టైప్ కేరెక్టర్‌లో కనిపించాడు. ఇందులో ఒక బ్యాడ్ బాయ్‌గా కనిపిస్తున్నాడు. పైగా తల్లి అంటే ఏమాత్రం భయభక్తులు, ప్రేమ, గౌరవం లేని కొడుకుగా కనిపిస్తున్నాడు. అలాంటి పాత్రలో శ్రీవిష్ణు ఎలా రాణించాడో చూడాలి. అలాగే 'కాంచన 3'లో హీరోయిన్లలో ఒకరిగా కనిపించిన నిక్కీ తంబోలి, ఆ తర్వాత తెలుగులో 'చీకటి గదిలో చితక్కొట్టుడు' అనే అడల్ట్ మూవీలో ఫుల్ ఎక్స్‌పోజింగ్‌తో కనిపించి ప్రేక్షకుల మనసుల్లో సెక్సీ తారగా ముద్ర వేసుకుంది. కానీ ఈ సినిమాలో ఆమెది డీసెంట్‌గా కనిపించే పోలీస్ కేరెక్టర్. ఏ మేరకు ఆమె ఆ కేరెక్టర్‌తో మెప్పిస్తుందన్నది ఆసక్తికరం. ఇక సినిమాలో శ్రీవిష్ణు పాత్రతో సమాన ప్రాధాన్యం ఉన్న పాత్ర.. అతని తల్లిగా చేసిన రోహిణిది. రోహిణి ఎలాంటి నటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 'తిప్పరా మీసం'లో ఆమె తన నటనతో ప్రేక్షకుల్ని ఎలా ఆకట్టుకుందో చూడాలి. తల్లీ కొడుకుల మధ్య అంతటి ఘర్షణ వాతావరణం ఎందుకున్నదనే విషయం ప్రేక్షకుల్ని మెప్పిస్తే, సినిమా ఘన విజయం సాధిస్తుందని చెప్పొచ్చు. చూద్దాం.. ఏం జరుగుతుందో...


Also ReadLatest NewsCustomer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here