వర్మకు థియేటర్ల సమస్య..
on Dec 3, 2018
'భైరవ గీత'కు రామ్‌గోపాల్ వర్మ దర్శకుడు కాదు... కథా రచయిత, నిర్మాత. కానీ, వర్మ సినిమాగా వార్తల్లో వుంటోందీ సినిమా! వర్మ కూడా సినిమాను, సినిమా ప్రచారాన్ని తన భుజాలపై వేసుకుని మరీ ముందుకు నడిపిస్తున్నారు. నవంబర్ 30న 'భైరవ గీత'ను విడుదల చేయడానికి సన్నాహాలు చేశారు. రజనీకాంత్ '2.ఓ'తో ఈ సినిమాను ముడిపెడుతూ వర్మ ట్వీట్లు మీద ట్వీట్లు చేశారు. చివరకు, సెన్సార్ సమస్యల వలన నవంబర్ 30న సినిమాను విడుదల చేయలేకపోతున్నామని, డిసెంబర్ 7న వస్తామని ట్వీట్ చేశారు. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే... డిసెంబర్ 7న ఈ సినిమా తెలుగులో విడుదల కావడం లేదు. ఎందుకు? అంటే... థియేటర్ల సమస్య. ఈ రోజు కావలసినన్ని థియేటర్లు అందుబాటులో వుండని కారణంగా, పబ్లిసిటీ కారణాల వలన తెలుగులో విడుదల చేయడం లేదని వర్మ తెలిపారు. డిసెంబర్ 14న సినిమాను విడుదల చేస్తామని ట్వీట్ చేశారు. కన్నడలో మాత్రం డిసెంబర్ 7న విడుదల చేస్తామన్నారు. ముందుగా అనుకున్నట్టు నవంబర్ 30న ఈ సినిమా విడుదలైతే... ఈపాటికి ఫలితం వచ్చేది. రిజల్ట్ కోసం మరికొన్ని రోజులు వర్మ వెయిట్ చేయక తప్పదు. ఈ సినిమాతో కొత్త దర్శకుడు సిద్ధార్థ్‌ని వర్మ పరిచయం చేస్తున్నారు.