తెలుగులో వచ్చిన కొరియన్ సినిమాలివే!
on Aug 5, 2020
సౌత్ కొరియన్ సినిమా అంటే మానవ సంబంధాలు, యాక్షన్ సీన్స్, ఎమోషన్స్, అనూహ్యమైన ట్విస్ట్‌లకు పెట్టింది పేరు. మనకు కావాల్సింది కూడా అదే. అందుకే ఇవాళ భారతీయ సినిమా కొరియన్ సినిమా మీదే దృష్టిపెట్టి లాభపడాలని చూస్తోంది. గత ఇరవై ఏళ్లుగా కొరియన్ సినిమాలు మన తెలుగు సహా అనేక భారతీయ సినిమాలకు స్ఫూర్తినిస్తున్నాయి. తెలుగు డైరెక్టర్లు, రైటర్లు స్క్రిప్ట్ రాయడానికి ప్రేరణ కోసం యూట్యూబ్‌లో కానీ, ఓటీటీలో కానీ మొదటగా చూస్తోంది కొరియన్ సినిమా కోసమే. కుర్రాడైన వరుణ్ తేజ్‌ను మిడిల్ ఏజ్డ్ గ్యాంగ్‌స్టర్‌గా చూపిస్తూ హరీశ్ శంకర్ తీసిన 'గద్దలకొండ గణేష్' సినిమాకి ఆధారం 'ఎ డర్టీ కార్నివాల్' అనే కొరియన్ ఫిల్మ్. అంటే దాని ఒరిజనల్ అయిన తమిళ 'జిగర్తాండ' తీసింది ఈ సినిమాని బేస్ చేసుకొనే. అదే పేరుతో కన్నడంలోనూ ఆ సినిమా రీమేక్ కావడం గమనార్హం. ఇదే కాదు.. పదిహేనేళ్ల నుంచే కొరియన్ సినిమాల ఆధారంగా ఇండియాలో సినిమాలు వండటం జరుగుతూ వస్తోంది.
2001లో వచ్చిన కొరియన్ ఫిల్మ్ 'సాసీ గాళ్' సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. దాని ఆధారంగా తెలుగులో భరత్, విదిశ జంటగా 'మా ఇద్దరి మధ్య' (2006), హిందీలో మల్లికా షెరావత్, రణ్వీర్ షోరీ జంటగా 'అగ్లీ ఔర్ పగ్లీ' (2008) సినిమాలు వచ్చాయి. ఒకరి జీవితంలో ఎదురైన ఘటనలు, 30 ఏళ్ల తర్వాత మరొకరికి తారసపడితే ఎలా ఉంటుందనే కథాంశంతో వచ్చిన 'పారలల్ లైఫ్' కూడా ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. అదే అంశంతో తెలుగులో '2.. మేమిద్దరం' అనే సినిమా వచ్చింది. అలాగే ఇంచుమించు ఇదే ఇతివృత్తంతోనే వచ్చిన మరో కొరియన్ మూవీ 'టైమ్ రెనెగేడ్స్' ప్రేరణతో అల్లు శిరీష్ సినిమా 'ఒక్క క్షణం'ను రూపొందించారు.
'ఎ మిలియనీర్స్ ఫస్ట్ లవ్' సినిమా చూసి, నాని 'పిల్ల జమీందార్' చూస్తే.. సేమ్ టు సేమ్ అనిపించక మానదు. విలన్‌గా తారకరత్నకు నంది అవార్డ్ తీసుకొచ్చిన 'అమరావతి' చిత్రం 'హెచ్' అనే కొరియన్ మూవీకి నకలు. 'ద క్వైట్ ఫ్యామిలీ'ని బేస్ చేసుకొని ఆది సాయికుమార్ 'నెక్స్ట్ నువ్వే' (2017), 'మై వైఫ్ ఈజ్ ఎ గ్యాంగ్‌స్టర్' ప్రేరణతో అల్లరి నరేశ్ 'జేమ్స్‌బాండ్.. నేను కాదు నా పెళ్లాం' (2015) చిత్రం వచ్చాయి. ఇక హిందీలో అయితే మరిన్ని సినిమాలు తయారయ్యాయి. మునుముందు కూడా కొరియన్ సినిమాలకు మన దగ్గర అఫిషియల్ రీమేక్‌లతో పాటు, ఫ్రీమేక్లూ తప్పనిసరిగా వస్తాయి.
Also Read