English | Telugu

తప్పదు... 2019లో హిట్ కొట్టాలి మరి!!

on Jan 3, 2019

 

తెలుగు సినిమా క్యాలెండ‌ర్‌లో ఓ ఏడాది వెళ్ళింది. మరో ఏడాది వచ్చింది. గతేడాది (2018) అంచనాలతో విడుదలైన కొన్ని సినిమాలు నిరాశ పరిస్తే.. మరికొన్ని ప్రేక్షకులను అలరించాయి. అనూహ్యంగా కొన్ని సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి. అందుకని, కోటి ఆశలతో కొత్త ఏడాది (2019)లో వచ్చే సినిమాల వైపు ప్రేక్షకులు చూస్తున్నారు. ప్రేక్షకులతో పాటు కొందరు హీరో హీరోయిన్లు కూడా కొత్త ఏడాదిపై కోటి ఆశలు పెట్టుకున్నారు. గతేడాది మూడేసి, రెండేసి ఫ్లాపులతో ముగించి, ఈ ఏడాది గ్యారెంటీగా హిట్ కొట్టాల్సిందే అనే పరిస్థితికి వచ్చారు. ఈ జాబితాలో ఎవరెవరు వున్నారో ఓసారి చూడండి.

 

 

రవితేజ: గతేడాది ముందు వరకూ రవితేజ బండి నెమ్మదిగా నడిచింది. ఆల్మోస్ట్ రెండేళ్లు ఖాళీగా వున్నాడు కూడా! కానీ, గతేడాది స్పీడు పెంచాడు. ఏకంగా మూడు సినిమాలు చేశాడు. అయితే.. ప్రయోజనం లేదు. 'టచ్ చేసి చూడు', 'నెల టికెట్', 'అమర్ అక్బర్ ఆంటోనీ' సినిమాలు రవితేజను నిరాశపరిచాయి. ఈ ఏడాది ఆయన తప్పకుండా హిట్ కొట్టాల్సిందే. లేదంటే హీరోగా అతడి మార్కెట్ మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది. అందుకని, రవితేజ కూడా కాస్త విరామం తీసుకున్నాడు. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ప్రారంభించిన సినిమాను పక్కన పెట్టాడు. 'ఎక్కడికి పోతావు చిన్నవాడా', 'ఒక్క క్షణం' సినిమాలు తీసిన విఐ ఆనంద్ దర్శకత్వంలో 'డిస్కో రాజా'ను ముందు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ సినిమాపై మాస్ మహారాజ చాలా ఆశలు పెట్టుకున్నాడు.

 

 

రాజ్ తరుణ్: గతేడాది మూడు ఫ్లాపులతో ముగించిన మరో హీరో రాజ్ తరుణ్. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించిన 'రంగుల రాట్నం', దిల్ రాజు నిర్మించిన 'లవర్' సినిమాలతో పాటు 'రాజుగాడు' కూడా రాజ్ తరుణ్‌కి హిట్ ఇవ్వలేదు. దాంతో ఈ హీరో సినిమాలకు చిన్న కామా (,) పెట్టాడు. ప్రస్తుతం సినిమాలు ఏవీ చేయడం లేదు. కథలు వింటున్నాడు. ఎటువంటి కథతో ఎవరి దర్శకత్వంలో ఈ ఏడాది సినిమా చేస్తాడో గానీ.. ఈ ఏడాది సినిమా చేస్తే తప్పకుండా రాజ్ తరుణ్ హిట్ కొట్టాల్సిందే.

 

 

కాజల్ అగర్వాల్: పదేళ్లుగా తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‌గా తన స్టార్‌డ‌మ్‌ని, ఉనికిని కాపాడుకుంటున్న హీరోయిన్ ఎవరైనా వున్నారంటే అది కాజల్ అగర్వాలే. ట్రెండ్‌కి తగ్గట్టు స్ట‌యిలిష్‌గా క‌నిపిస్తూ.. కుర్ర హీరోలతో నటిస్తూ కొత్త కొత్త సినిమాలతో సందడి చేస్తుంది. గతేడాది ప్రయోగాత్మక సినిమా 'అ!'లో నటించింది. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఆ సినిమాకు వసూళ్లు రాలేదు. తర్వాత నందమూరి కళ్యాణ్ రామ్ సరసన నటించిన 'ఎమ్మెల్యే', బెల్లంకొండ సాయిశ్రీనివాస్ సరసన నటించిన 'కవచం' సినిమాలు ఆమెకు ఫ్లాపులు అందించాయి. బెల్లంకొండ సాయిశ్రీనివాస్ సరసన తేజ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా ఈ ఏడాది ఆమెకు హిట్ అందిస్తుందేమో చూడాలి.

 

 

బెల్లంకొండ సాయిశ్రీనివాస్: గతేడాది ముందు వరకూ అగ్ర దర్శకులతో భారీ బడ్జెట్ సినిమాలు చేశాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. కథను నమ్మి శ్రీవాస్ దర్శకత్వంలో 'సాక్ష్యం', కొత్త దర్శకుడు శ్రీనివాస్ మామిళ్ళతో 'కవచం' చేశాడు. రెండూ అతణ్ణి నిరాశపరిచాయి. ప్రస్తుతం తేజ దర్శకత్వంలో చేస్తున్న సినిమాపై బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నమ్మకంగా ఉన్నాడు. దీంతో మళ్ళీ హిట్ ట్రాక్ లోకి వస్తాడని ఆశిద్దాం.

 

 

తమన్నా: జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్న తమన్నాకు గతేడాది చేదు జ్ఞాపకంగా మిగిలింది. పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ, జయేంద్ర దర్శకత్వం అని 'నా నువ్వే' చేస్తే ప్రేక్షకులు కనికరించలేదు. అందులో అందాలు ఆరబోసినా ఎవరూ చూడలేదు. తరవాత 'నెక్స్ట్ ఏంటి' కూడా నిరాశపరిచింది. 'దటీజ్ మహాలక్ష్మి' వివాదాల్లో చిక్కుకోవడం వాళ్ళ దర్శకుణ్ణి మార్చాల్సి వచ్చింది. గతేడాది తమన్నాకు అన్నీ తలనొప్పులే. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలవుతున్న 'ఎఫ్2'తో విజయాల బాటలోకి వస్తానని తమన్నా ధీమాగా వున్నారు. మరి, ఏం జరుగుతుందో చూడాలి.

 

 

సందీప్ కిషన్: 'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్' తరవాత సరైన విజయాలు లేని సందీప్ కిషన్ గతేడాది రెండు సినిమాల్లో నటించాడు. సూప‌ర్‌స్టార్‌ కృష్ణ కుమార్తె మంజుల దర్శకురాలిగా పరిచయ,మైన 'మనసుకు నచ్చింది', హిందీ దర్శకుడు కునాల్ కోహ్లీ తీసిన 'నెక్స్ట్ ఏంటి' సినిమాలు అతడికి పరాజయాలను అందించాయి. దాంతో గ్యారెంటీగా హిట్ కొట్టాలని తానే నిర్మాతగా మారి 'నిను వీడని నీడను నేను' అనే సినిమా తీశాడు సందీప్ కిషన్. ఈ సినిమా 2019లో సందీప్ కిషన్ హిట్ ఖాతా తెరవాలని కోరుకుందాం.

'పంతం'తో గోపీచంద్, 'పడి పడి లేచె మనసు'తో శర్వానంద్, 'చల్ మోహన్ రంగ', 'శ్రీనివాస కళ్యాణం' సినిమాలతో నితిన్, 'ఇంటిలిజెంట్', 'తేజ్... ఐ లవ్యూ' సినిమాలతో సాయిధరమ్ తేజ్, 'నా నువ్వే', 'ఎమ్మెల్యే' సినిమాలతో నందమూరి కళ్యాణ్ రామ్... మరికొంతమంది హీరో హీరోయిన్లు గతేడాది ఫ్లాపులతో ముగించారు. ఈ ఏడాది వాళ్ళూ విజయాలు అందుకోవాలని ప్రయత్నిస్తున్నారు.


Also ReadLatest NewsCustomer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here