English | Telugu

2018లో మన హీరోల సినిమాలు ఇవే!

on Jan 1, 2018

2017 హడావిడీ ముగిసింది. సినిమా రంగానికి ఎన్నో రకాల రుచులను చూపించి... కూల్ గా ఈ ఏడాది వెళ్లిపోతుంటే.. గంపల కొద్ది విశేషాలను మూటగట్టుకొని.. పుట్టెడు ఆశలతో 2018 వచ్చేస్తోంది. మరి ఈ వచ్చే కొత్త ఏడాదిలో ఏ ఏ హీరో.. ఏ ఏ సినిమాలు చేయబోతున్నారో... సరదాగా ముచ్చటించుకుందామా!

1. మన హీరోల్లో నంబర్ వన్ ఎవరు? అనడిగితే... టక్కున వచ్చే సమాధానం మెగాస్టార్. అందుకే... 2018 మెగాస్టార్ సినిమాలేంటి? అనేది చూద్దాం.
పరిస్థితుల్ని బట్టి చూస్తే... 2018లో మెగాస్టార్ సినిమా ఉండదేమో అనిపిస్తుంది. ఎందుకంటే... ఇటీవలే ఆయన నటిస్తున్న ‘సైరా నరసింహా రెడ్డి’ షూటింగ్ మొదలైంది. భారీగా రూపొందుతోన్న ఈ చిత్రానికి దర్శకుడు సురేందర్ రెడ్డి. ఏడెనిమిది నెలల్లో పూర్తయ్యే ప్రాజెక్టయితే కాదిది. సో... 2018లో మెగాస్టార్ సినిమా ఉండక పోవచ్చు.

2. నెక్ట్స్ చెప్పుకోవలసింది బాలయ్య గురించేగా. గతేడాది లాగే... ఈ సారి కూడా సంక్రాంతి బరిలోనే నిలిచింది నందమూరి నటసింహం. అయితే.. గత ఏడాది అన్నయ్య మెగాస్టార్ తో పోటీ పడితే... ఈ సారి తమ్ముడు పవర్ స్టార్ తో పోటీ పడుతున్నాడు బాలయ్య. అరు పదల వయసు దగ్గర పడుతున్నా... యువ హీరోలకు ప్రేరణనిస్తూ... వేగంగా సినిమాలు చేస్తూ... దూసుకుపోతున్నాడు. ఈ ఏడాది... సంక్రాంతికి ‘జై సింహా’గా రాబోతున్నాడు బాలయ్య.
ఆ తర్వాత చేసే సినిమా ఏంటి? అనేది ప్రస్తుతం సస్పెన్స్, అయితే.. ఆ సస్పెన్స్ కూడా ఎక్కువ రోజులు ఉంచేట్టు లేడు బాలయ్య. ఇప్పటికే దర్శకులు అనిల్ రావిపూడి, ఎస్వీ కృష్ణారెడ్డిల కథలు రెడీగా ఉన్నాయ్. మరోవైపు రచయిత సాయిమాధవ్ బుర్రా కూడా ఓ కథను ఇప్పటికే రెడీ చేశారు. మరి వీటిలో ఏ సినిమా చేస్తాడో ఇంకో పదిరోజుల్లో తేలిపోతుంది. ఈ ఏడాదే ఈ సినిమా కూడా విడుదలవుతుంది. ఇదే ఏడాది ఎన్టీయార్ బయోపిక్ కూడా  స్టార్ట్ చేస్తాడు బాలయ్య. అయితే.. ఆ సినిమా విడుదల 2019లో ఉంటుంది.

3. ఇక నాగార్జున... 2018 నాగ్ అభిమానులకు భిన్నమైన అనుభూతిని ఇవ్వనుందని చెప్పొచ్చు. ఎందుకంటే... దాదాపు 23 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ నాగ్, రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్ ని ప్రేక్షకులు చూడబోతున్నారు. మరి ‘శివ’తో సినిమా నడకనే మార్చేసిన ఈ ధ్వయం.. ఈ సారి ఎలాంటి అనుభూతిని ప్రేక్షకులకు పంచుతారో చూడాలి.  

4. వెంకటేశ్ విషయానికొస్తే... 2018లో రెండు సినిమాలు కనిసిస్తున్నాయ్. అందులో ఒకటి తేజా సినిమా కాగా, రెండోది అనిల్ రవిపూడి సినిమా. అయితే రెండూ మొదలవ్వలేదు. తేజా సినిమాకు ‘ఆట నాదే.. వేటా నాదే’ అనే టైటిల్ అనుకుంటున్నారు. ఇక అనిల్ రావిపూడి సినిమా వచ్చేసరికి మల్టీస్టారర్. ఇందులో వెంకీ, వరుణ్ తేజ్ కలిసి నటించనున్నట్లు సమాచారం. మరి ఈ రెంటిలో ఏది ముందు మొదలవుతుందో చూడాలి. అంతేకాదు.. ఈ రెంటిలో ఈ ఏడాది రిలీజయ్యేది కూడా ఒక్కటే.  

5. ఇక పవర్ స్టార్...  సంక్రాంతి కోడి పుంజుల్లో పవర్ స్టార్ ఒకడన్న విషయం తెలిసిందే. ఇప్పటికే   ’అజ్ఙాతవాసి’ జపంతో ఫ్యాన్స్ ఊగిపోతున్నారు.  ఈ సినిమా తర్వాత ఏఎం రత్నం నిర్మాతగా ‘వేదాళం’ తమిళ రీమేక్ చేయాల్సి ఉంది. మరి రాజకీయ హడావిడిలో పడి ఆ సినిమా చేస్తాడో, లేదో చూడాలి.

6. 2018లో రెండు సినిమాలు విడుదల చేయడానికి మహేశ్ ప్లాన్ చేశాడు. కొరటాల శివ దర్శకత్వంలో చే్స్తున్న ‘భరత్ అను నేను’ 2018 ఏప్రిల్ లో రానుంది. ఈ లోగానే... వంశీ పైడిపల్లి సినిమా కూడా  స్టార్ట్ చేసి... ఆ సినిమాను దసరగాకు ప్లాన్ చేస్తున్నాడు మహేశ్. అంటే.. 2018 సూపర్ స్టార్ అభిమానులకు పండగే అనమాట.

7. ఇక తారక్.. ‘జై లవకుశ’తో భారీ విజయాన్ని అందుకున్న ఈ యంగ్ టైగర్..  ఈ ఏడాది త్రివిక్రమ్ సినిమాతో రాబోతున్నాడు. ‘అజ్ఙాతవాసి’ తర్వాత త్రివిక్రమ్ చేసే సినిమా ఎన్టీయార్ దే కావడం గమనార్హం. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టి. దసరాకు విడుదలయ్యేలా ప్లాన్ చేస్తున్నారు.

8. ’బాహుబలి’ తర్వాత ప్రభాస్ సినిమా అంటే... ఏ రేంజ్ లో ఉండాలి! అదే రేంజ్ లో తయారవుతోంది ‘సాహో’. సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. 2018 చివర్లో ఈ సినిమా ఉండొచ్చని సమాచారం. తెలుగుతో పాటు హిందీలో కూడా ఈ సినిమా రూపొందుతోంది.

9. 2018 రాబోతున్న బన్నీ తొలి సినిమా  ‘నా పేరు సూర్య - నా ఊరు ఇండియా’. వక్కంతం వంశీ ఈ సినిమా ద్వారా దర్శకునిగా పరిచయం అవతున్నాడు. 2018 ఏప్రిల్ లో ఈ సినిమా విడుదల కానుంది. ప్రశాంత్ అనే నూతన దర్శకునితో కూడా బన్నీ ఓ సినిమా చేయాల్సి ఉంది. అలాగే... వీఐ ఆనంద్ దర్శకత్వంలో కూడా సినిమా ఉంది. అయితే.. ఇవి 2018లో ప్రారంభమయ్యే సినిమాలే కానీ.. విడుదల అయ్యేవి కావు.

10. 2018లో రామ్ చరణ్ సినిమా అంటే... ఎవరైనా ఇట్టే చెప్పేస్తారు ‘రంగస్థలం’ అని. ఎందుకంటే.. ఆ సినిమాపై ఉన్న హైప్స్ అలాంటివి. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం మార్చి 30న ఈ సినిమా విడుదల కానుంది. ఇదే ఏడాది బోయపాటి శ్రీను దర్శకత్వంలో కూడా సినిమా చేయనున్నాడు చర్రీ. త్వరలో ఈ సినిమాను ప్రారంభించి  దసరా కానుకగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

11. ‘రాజా ది గ్రేట్’ తో భారీ విజయాన్ని అందుకున్న మాస్ మహారాజా రవితేజా.. మళ్లీ స్పీడ్ పెంచాడు. 2018లో మూడు సినిమాలు లైన్లో పెట్టేశాడు. ‘రాజా చేయి వేస్తే’ .. 2018లో రాబోతున్న రవితేజ తొలి సినిమా. ఆ సినిమా తర్వాత కల్యాణకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఆ తర్వాత తన చిరకాల మిత్రులు శ్రీనువైట్ల దర్శకత్వంలో నటించనున్నాడు. రవితేజా స్పీడ్ ని బట్టి.. ‘రాజా చేయి వేస్తే’ తో పాటు మిగిలిన రెండూ కూడా ఇదే ఏడాది వచ్చినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు.

12. 2018లో నాగచైతన్య రెండు సినిమాల్లో కనిపించనున్నాడు. అందులో ఒకటి ‘సవ్యసాచి’ కాగా, రెండోది ‘శైలజారెడ్డి అల్లుడు’. చెందూ మొండేటి ‘సవ్యసాచి’కి దర్శకుడు కాగా, ‘శైలజారెడ్డి అల్లుడు’కి మారుతి దర్శకుడు. ఈ రెండూ 2018లోనే రానున్నాయ్.

13. వరుస విజయాలతో దూసుకుపోతున్న నాని.. 2018లో ‘కృష్ణార్జున యుద్ధం’తో రానున్నాడు. మేర్లపాక గాంధీ దర్శకుడు. ఇంకా కొన్ని కమిట్మెంట్లు ఉన్నాయ్.

14. 2018లో సాయిధరమ్ తేజ్ మాస్ ని మస్మరైజ్ చేయనున్నాడు.కారణం... ఆయన చేయనున్న సినిమాకు దర్శకుడు వి.వి.వినాయక్ కావడమే. ఈ సినిమా కచ్చితం 2018లోనే విడుదల కానుంది.

15. శర్వానంద్ 2018లో రెండు సినిమాలతో రానున్నాడు. ఓ సినిమాకు దర్శకుడు అను రాఘవపూడి కాగా, మరో సినిమా దర్శకుడు సుధీర్ వర్మ. ఈ రెండు సినిమాలో 2018లోనే రానున్నాయ్.

16.  రామ్ 2018లో మంచి ఎంటర్టైనర్ తో ముందుకు రానున్నాడు. త్రినాథరావు నక్కిన దర్శకుడు. మామా అల్లుళ్ల నేపథ్యంలో సాగే సినిమా ఇది.

17.  2018లో ‘తొలిప్రేమ’ తో బోణీ కొట్టనున్నాడు వరుణ్ తేజ్. వెంకీ అట్లూరి దర్శకుడు. అలాగే... ఇదే ఏడాది వెంకటేశ్ తో కలిసి ఓ మల్టీస్టారర్ లో కూడా నటించనున్నాడు. అనిల్  రావిపూడి దర్శకుడు. ఈ ఏడాదే ఈ సినిమాలు ఉండొచ్చు.

18. ఇక నితిన్ విషయానికొస్తే... పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ పతాకంపై ఓ చిత్రం చేస్తున్నాడు. చైతన్యకృష్ణ దర్శకుడు.

ఇక మంచు విష్ణు ఆచారి అమెరికా యాత్ర, ఓటర్ సినిమాలు 2018లో రానుండగా, కణం, చలో సినిమాలతో నాగశౌర్య పలకరించనున్నాడు. నారా రోహిత్ వచ్చేసరికి పండగలా దిగివచ్చాడు, వీరభోగ వసంతరాయలు, భీమ సినిమాలతో రానున్నాడు.
 
ఇవండీ... 2018లో మన హీరోల సినిమాలు.


Also ReadLatest NewsCustomer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here