English | Telugu

ఎక్స్‌క్లూజివ్: విక్టరీ వెంకటేశ్ టాప్ 10 రీమేక్స్

on Jan 22, 2020

 

మూడున్నర దశాబ్దాలుగా తనదైన నటనా సామర్థ్యంతో ప్రేక్షకుల్ని అలరిస్తూ, ఇప్పటికీ టాప్ సీనియర్ స్టార్లలో ఒకడిగా తన స్థానానికి న్యాయం చేస్తొన్న యాక్టర్.. విక్టరీ వెంకటేశ్. భిన్న జానర్ సినిమాలు, భిన్న తరహా పాత్రలతో మెప్పిస్తూ వస్తున్న ఈ స్టార్ యాక్టర్‌ను రీమేక్ కింగ్‌గా కూడా చెబుతూ ఉంటారు. 35 సంవత్సరాల సుదీర్ఘ కెరీర్‌లో చేసింది 73 సినిమాలైనా వాటిలో 28 సినిమాలు రీమేక్‌లే కావడం దీనికి నిదర్శనం. ఇప్పుడు తన 74వ సినిమాను 'నారప్ప' టైటిల్‌తో ఆయన స్టార్ట్ చేశాడు. సందర్భవశాతూ అది కూడా ఒక రీమేకే. తమిళంలో ధనుష్ నటించగా వెట్రిమారన్ డైరెక్ట్ చేసిన సూపర్ హిట్ ఫిల్మ్ 'అసురన్' ఆధారంగా ఈ సినిమాని 'కొత్త బంగారులోకం', 'సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రాల దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేస్తున్నాడు. 

1986లో హీరోగా కెరీర్ ఆరంభించిన వెంకటేశ్, 1987లో నటించిన 4వ సినిమా 'భారతంలో అర్జునుడు' నుంచి రీమేక్స్ చేయడం మొదలుపెట్టాడు. ఆ సినిమా ఒరిజినల్ హిందీ బ్లాక్‌బస్టర్ 'అర్జున్'. అప్పట్నుంచీ కూడా ఇతర భాషల్లో వచ్చిన తనకు ఇష్టమైన సినిమాల్ని రీమేక్ చేయడాన్ని ఒక వ్యసనంగా మార్చుకున్నాడు వెంకటేశ్. ఈ నేపథ్యంలో ఆయన చేసిన రీమేక్స్‌లో టాప్ టెన్ సినిమాలేవో చూద్దామా...

10. రక్తతిలకం (1988): 
యాక్షన్ మేళవించిన రివెంజ్ డ్రామాగా రూపొందిన ఈ మూవీని బి. గోపాల్ డైరెక్ట్ చేశాడు. అమల హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో శారద కథకు అత్యంత కీలకమైన పాత్ర చేశారు. తనను పెంచిన తల్లి కూతురిపై దారుణంగా అత్యాచారం జరిపి హత్యచేసిన వాళ్లపై ప్రతీకారం తీర్చుకొనే యాక్షన్ హీరోగా వెంకటేశ్ ప్రదర్శించిన అభినయం ప్రేక్షకుల్ని మెప్పించి, సినిమాకి ఘన విజయం చేకూర్చింది. బెంగాలీ హిట్ ఫిల్మ్ 'ప్రతీకార్'కు ఇది రీమేక్.

9. సంక్రాంతి (2005): 
ఫ్యామిలీ డ్రామాగా తయారైన ఈ సినిమాని ముప్పలనేని శివ డైరెక్ట్ చేశాడు. ఎన్. లింగుస్వామి రూపొందించిన తమిళ హిట్ ఫిల్మ్ 'ఆనందం'.. ఈ మూవీకి ఆధారం. వెంకటేశ్ జోడీగా స్నేహ నటించిన ఈ సినిమాలో, ఆర్తీ అగర్వాల్, శ్రీకాంత్, సంగీత, శారద కీలక పాత్రధారులు. తమ్ముడి భార్య కారణంగా కుటుంబం విడిపోయే పరిస్థితి వచ్చినప్పుడు ఆ ఇంటి పెద్దకొడుకుగా తన కుటుంబాన్ని ఒక్కటి చేసే రాఘవేంద్రగా వెంకటేశ్ ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకున్నారు. పేరుకు తగ్గట్లు సంక్రాంతి పండుగకు రాకుండా, ఫిబ్రవరిలో రిలీజైనా కలెక్షన్ల విషయంలో పండగ చేసుకుంది ఈ చిత్రం.

8. రాజా (1999): 
సెంటిమెంట్ మేళవించిన ఈ రొమాంటిక్ డ్రామాను ముప్పలనేని శివ డైరెక్ట్ చేశాడు. సౌందర్య హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో అబ్బాస్, సుధాకర్ కీలకపాత్రలు చేశారు. ఒక యువతి సాహచర్యంలో మంచివాడుగా మారిన దొంగ, ఆమె ఉన్నతికి ఎలా తోడ్పడ్డాడనే కథలో టైటిల్ పాత్ర పోషించిన వెంకటేశ్, అతడిని మంచివాడుగా మార్చిన పాత్రలో సౌందర్య పోటాపోటీగా నటించి ప్రేక్షకుల్ని రంజింపజేశారు. కార్తీక్, రోజా ప్రధానపాత్రధారులుగా విక్రమన్ తమిళంలో డైరెక్ట్ చేసిన హిట్ మూవీ 'ఉన్నిదత్తిల్ ఎన్నై కొడుతేన్'కి ఇది రీమేక్.

7. అబ్బాయిగారు (1993): 
సెంటిమెంట్ మేళవించిన ఈ ఫ్యామిలీ డ్రామాను ఈవీవీ సత్యనారాయణ రూపొందించాడు. కె. భాగ్యరాజ్ నటించి దర్శకత్వం వహించిన తమిళ సూపర్ హిట్ సినిమా 'ఎంగ చిన్న రాస' ఈ చిత్రానికి ఆధారం. వెంకటేశ్ సరసన మీనా నటించిన ఈ మూవీలో జయచిత్ర, శ్రీకాంత్, కోట శ్రీనివాసరావు కీలకపాత్రలు పోషించారు. తనపై వల్లమాలిన ప్రేమ పెంచుకున్న మారుటి కొడుకును విషమిచ్చి చంపడానికి ప్రయత్నించిన ఒక తల్లి, అది విషమని భార్య ఎంతచెప్పినా వినకుండా తల్లిమీద ప్రేమతో ఆ విషాన్ని తాగి చావును ఆహ్వానించిన ఒక కొడుకు కథలోని సెంటిమెంటుకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. నటుడిగా వెంకటేశ్‌కు ఈ సినిమా మంచి పేరు తెచ్చింది.

6. దృశ్యం (2014): 
క్రైం థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాని నటి శ్రీప్రియ డైరెక్ట్ చేశారు. వెంకీ భార్యగా మీనా నటించిన ఈ మూవీలో నదియా, రవి కాలే కీలక క్యారెక్టర్లు చేశారు. తన కూతుర్ని న్యూడ్‌గా సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి, ఆమెను, తన భార్యను బ్లాక్‌మెయిల్ చేయడానికి ప్రయత్నించిన యువకుడిని తప్పనిసరి పరిస్థితుల్లో హత్యచేసి, ఆ నేరం నుంచి తప్పించుకొనే ఒక కేబుల్ ఆపరేటర్‌గా వెంకటేశ్ ప్రదర్శించిన నటన ప్రేక్షకుల్ని బాగా మెప్పించి, భారీ వసూళ్లను సాధించింది. మోహన్ లాల్, మీనా జంటగా జీతూ జోసెఫ్ డైరెక్ట్ చేసిన మలయాళ బ్లాక్‌బస్టర్ 'దృశ్యం'కు ఇది రీమేక్. 

5. ఘర్షణ (2004): 
ఈ యాక్షన్ థ్రిల్లర్‌ను గౌతం మీనన్ రూపొందించాడు. సూర్య, జ్యోతిక జంటగా గౌతం మీనన్ డైరెక్ట్ చేసిన సూపర్ హిట్ తమిళ మూవీ 'కాక్క కాక్క' ఈ సినిమాకు ఆధారం. వెంకటేశ్ జోడీగా అసిన్ నటించిన ఈ మూవీలో సలీం కీలకమైన విలన్ రోల్‌ను సలీ బేగ్ పోషించాడు. తను ఎంతగానో ప్రేమించి పెళ్లిచేసుకున్న భార్యను పాండా అనే క్రిమినల్ కిడ్నాప్ చేస్తే, ఆమెను రక్షించుకోడానికి డీసీపీ రామచంద్ర ఏం చేశాడనే కథతో తయారైన ఈ సినిమాలో వెంకటేశ్ నటన చూసి తీరాల్సిందే. అసిన్ పర్ఫార్మెన్స్, గౌతం మీనన్ డైరెక్షన్ ఈ సినిమాకి ఘన విజయం సాధించిపెట్టాయి. 

4. ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు (1996): 
రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాగా తయారైన ఈ సినిమాను ఈవీవీ సత్యనారాయణ డైరెక్ట్ చేశాడు. వెంకటేశ్ భార్యలుగా సౌందర్య, వినీత నటించిన ఈ సినిమాలో తండ్రిగా కోట శ్రీనివాసరావు ఒక ప్రధాన పాత్ర చేశారు. భార్యతో సంతోషంగా సంసార జీవనం సాగిస్తున్న ఒక యువకుడు బిజినెస్ టూర్ మీద నేపాల్ వెళ్లి, అక్కడ అనూహ్య పరిస్థితుల్లో మరో యువతిని పెళ్లాడి ఎలాంటి ఇక్కట్లు పడ్డాడనే కథలో వెంకటేశ్ అగచాట్లు ప్రేక్షకుల్ని విపరీతంగా నవ్వించాయి, వసూళ్ల వర్షాన్ని కురిపించాయి. పాండ్యరాజన్ హీరోగా ఎన్. మురుగేష్ డైరెక్ట్ చేసిన తమిళ హిట్ ఫిల్మ్ 'దైకులమే దైకులమే'కు ఇది రీమేక్.

3. సూర్యవంశం (1998): 
సెంటిమెంట్ మిక్స్ చేసిన ఈ ఫ్యామిలీ డ్రామాను డైరెక్టర్ భీమనేని శ్రీనివాసరావు రూపొందించాడు. శరత్ కుమార్ తండ్రీకొడుకులుగా నటించగా విక్రమన్ డైరెక్ట్ చేసిన బ్లాక్‌బస్టర్ తమిళ్ మూవీ 'సూర్యవంశం' ఈ సినిమాకు ఆధారం. వెంకటేశ్ డ్యూయల్ రోల్ చేసిన ఈ మూవీలో మీనా నాయికగా నటిస్తే, ఆనంద్ రాజ్ విలన్ రోల్ చేశాడు. తనను తప్పుగా అర్థం చేసుకొని దగ్గరకు రానీయకుండా దూరం పెట్టిన తండ్రి ప్రేమ కోసం అలమటిస్తూ, భార్య ప్రోత్సాహంతో జీవితంలో ఎదిగి అనుకున్నది సాధించిన ఒక కొడుకు కథ ఈ సినిమా. తండ్రీ కొడుకులుగా భిన్న పాత్రల్లో వెంకటేశ్ ఉన్నత స్థాయి నటనతో ప్రేక్షకుల హృదయాల్ని గెలిచాడు.

2. సుందరకాండ (1992): 
రొమాంటికి కామెడీ డ్రామాగా రూపొందిన ఈ మూవీకి కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. మీనా, అపర్ణ హీరోయిన్లుగా నటిస్తే, గొల్లపూడి మారుతిరావు కీలక పాత్ర చేశారు. ప్రేమిస్తున్నానంటూ వెంటపడుతున్న తన స్టూడెంట్ నుంచి తప్పించుకోడానికి నిరక్షరాస్యురాలైన ఒక యువతిని పెళ్లాడిన తెలుగు లెక్చరర్ ఎలాంటి ఇబ్బందులు పడ్డాడనే కథలో వెంకటేశ్, మీనా జోడీ విపరీతంగా నవ్వులు పంచగా, సెంటిమెంట్ మేళవించిన అల్లరి పాత్రలో కొత్తమ్మాయి అపర్ణ ఆకట్టుకుంది. కె. భాగ్యరాజ్ నటిస్తూ డైరెక్ట్ చేసిన తమిళ సూపర్ హిట్ మూవీ 'సుందర కాండం'కు ఇది రీమేక్.

1. చంటి (1992): 
మదర్ సెంటిమెంట్ మిక్స్ చేసిన ఈ ఫ్యామిలీ డ్రామాను రవిరాజా పినిశెట్టి డైరెక్ట్ చేశాడు. ప్రభు, కుష్బూ జంటగా నటించగా పి. వాసు డైరెక్ట్ చేసిన సూపర్ హిట్ తమిళ్ ఫిల్మ్ 'చిన్న తంబి' ఈ సినిమాకు ఆధారం. వెంకటేశ్ జోడీగా మీనా నటించిన ఈ సినిమాలో సుజాత, నాజర్ కీలక పాత్రధారులు. లోకజ్ఞానం తెలీని చంటి అనే యువకుడు తన యజమానుల ముద్దుల చెల్లెలి ప్రేమకు పాత్రుడై, దానివల్ల ఎలాంటి విపరిణామాలు ఎదుర్కొన్నాడు, తల్లికి జరిగిన అవమానానికి ఎలా స్పందించాడనే కథను ప్రేక్షకులు అపూర్వంగా ఆదరించారు. వెంకటేశ్ నట జీవితంలో చంటి పాత్ర పోషణ ఒక కలికితురాయిగా పేరుపొందింది.

ఈ సినిమాలే కాకుండా 'త్రిమూర్తులు', 'బ్రహ్మపుత్రుడు', 'వారసుడొచ్చాడు', 'బాడీగార్డ్', 'గురు' సినిమాలు కూడా వెంకటేశ్‌కు మంచి పేరే తెచ్చాయి. 1992లో, 1993లో వెంకటేశ్ సినిమాలు మూడేసి రిలీజైతే అవన్నీ రీమేక్‌లే కావడం  విశేషం.

వెంకటేశ్ రీమేక్ సినిమాల లిస్ట్:

1. భారతంలో అర్జునుడు (1987) - అర్జున్ (హిందీ)
2. త్రిమూర్తులు (1987) - నసీబ్ (హిందీ)
3. రక్త తిలకం (1988) - ప్రతీకార్ (బెంగాలీ)
4. బ్రహ్మ పుత్రుడు (1988) - మైఖేల్ రాజ్ (తమిళ్)
5. వారసుడొచ్చాడు (1988) - తీర్థ కారైయినిలే (తమిళ్)
6. టూ టౌన్ రౌడీ (1989) - తేజాబ్ (హిందీ)
7. చంటి (1992) - చిన్న తంబి (తమిళ్)
8. చినరాయుడు (1992) - చిన్న గౌండర్ (తమిళ్)
9. సుందరకాండ (1992) - సుందర కాండం (తమిళ్)
10. కొండపల్లి రాజా (1993) - ఖుద్‌గర్జ్ (హిందీ)
11. అనారి (హిందీ - 1993) - చిన్న తంబి (తమిళ్)
12. అబ్బాయిగారు (1993) - ఎంగ చిన్న రాస (తమిళ్)
13. పోకిరి రాజా (1995) - ఆంఖే (హిందీ)
14. తఖ్‌దీర్‌వాలా (హిందీ-1995) - యమలీల (తెలుగు)
15. ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు (1996) - థైకులమే థైకులమే (తమిళ్)
16. సూర్యవంశం (1998) - సూర్యవంశం (తమిళ్)
17. రాజా (1999) - ఉన్నిడత్తిల్ ఎన్నై కొడుతేన్ (తమిళ్)
18. శీను (1999) - సొల్లామలే (తమిళ్)
19. జెమిని (2002) - జెమిని (తమిళ్)
20. ఘర్షణ (2004) - కాక్క కాక్క (తమిళ్)
21. సంక్రాంతి (2005) - ఆనందం (తమిళ్)
22. ఈనాడు (2009), ఉన్నైపోల్ ఒరువన్ (తమిళ్) - ఎ వెన్స్‌డే (హిందీ)
23. నాగవల్లి (2010) - ఆప్తరక్షక (కన్నడ)
24. బాడీగార్డ్ (2012) - బాడీగార్డ్ (మలయాళం)
25. మసాల (2013) - బోల్ బచ్చన్ (హిందీ)
26. దృశ్యం (2014) - దృశ్యం (మలయాళం)
27. గోపాల గోపాల (2015) - ఓ మై గాడ్ (హిందీ)
28. గురు (2017) - ఇరుది సూత్రు (తమిళ్)
29. నారప్ప (2020) - అసురన్ (తమిళ్)

- బుద్ధి యజ్ఞమూర్తి


Cinema GalleriesLatest News


Video-Gossips