ఒకే పాత్ర..ముగ్గురు సూపర్స్టార్లు..!
on Aug 2, 2017
తెలుగు సినిమా పుట్టిన దగ్గర్నుంచీ ఇప్పటివరకూ ముగ్గురు సూపర్ స్టార్లు వెండితెరను ఏలారు. వారే... లెజెండ్ ఎన్టీయార్, సూపర్ స్టార్ కృష్ణ, మెగాస్టార్ చిరంజీవి. 1951లో వచ్చిన ‘పాతాళభైరవి’చిత్రం ఎన్టీయార్ ను సూపర్ స్టార్ ని చేసింది. ఇక అప్పట్నుంచి ముఖ్యమంత్రి అయ్యేంత వరకూ అంటే... 1983 దాకా తెలుగు తెరపై నంబర్ వన్ అంటే ఎన్టీయారే.
ఎన్టీయార్ రాజకీయాల్లోకెళ్లాక ఖాళీ అయిన నంబర్ వన్ సింహాసనాన్ని సూపర్ స్టార్ కృష్ణ అధిష్టించారు. 1983-1987 వరకూ అంటే... నాలుగేళ్ల పాటు తెలుగు తెరను శాసించేశారు కృష్ణ. ఆ నాలుగేళ్ల సమయంలో ఆయన సినిమాలు కూడా అలాంటివే వచ్చాయ్. అగ్నిపర్వతం, వజ్రాయుధం, పల్నాటి సింహం, సింహాసనం, ఖైదీ రుద్రయ్య... ఇలా వరుస విజయాలతో ‘నంబర్ వన్’ అనిపించుకున్నారు కృష్ణ.
1987లో ‘పసివాడి ప్రాణం’సినిమా వచ్చింది. అక్కడ్నుంచి తెలుగు తెరపై ఓ కొత్త అధ్యాయం మొదలైంది. అప్పటిదాకా ఓ స్టార్ హీరోగా మాత్రమే ఉన్న చిరంజీవి ఆ సినిమాతో ఎదురులేని హీరోగా అవతరించారు. ‘మెగాస్టార్’గా నంబర్ వన్ సింహాసనాన్ని అధిష్టించి, ఏకంగా ఇరవై ఏళ్లు తెలుగు తెరను ఏకఛత్రాధిపత్యంగా ఏలారు. ఎన్టీయార్ తర్వాత ఎక్కువకాలం తెలుగుతెరను ఏలిన స్టార్ చిరంజీవే. పాలిటిక్స్ లోకివెళ్లకపోతే... నేటికీ నంబర్ వన్ స్థానం ఆయనిదే అన్నది ఎక్కువ మంది అభిప్రాయం. అందుకు నిదర్శనమే ఆయన రీ ఎంట్రీ. చిరంజీవి 150వ చిత్రంగా విడుదలైన ‘ఖైదీ నంబర్ 150’ 150 కోట్ల వసూళ్లను రాబట్టి... నాన్ బాహుబలి చిత్రాల్లో రికార్డ్ గా నిలిచింది. దటీజ్ మెగాస్టార్.
ఇప్పుడు ఈ ముగ్గురు సూపర్ స్టార్ల గురించి ఎందుకు చెప్పుకోవల్సొచ్చిందంటే... బాలకృష్ణ అన్నట్లు... ‘యాదృశ్చికంగా జరిగిందో, కాకతాళీయంగా జరిగిందో’ కానీ... ఈ ముగ్గురూ వేరే వేరే పిరియడ్స్ లో ఒకే పాత్రను పోషించారు. తెలుగు తెరపై ఎందరో హీరోలున్నా.. వారెవరూ అభినయించని ఆ పాత్రను ఈ ముగ్గురు మాత్రమే అభినయించడం విశేషం. అందుకే... సూపర్ స్టార్లు అభినయించిన పాత్రగా ఆ పాత్ర నిలిచిపోయింది. ఇంతకీ ఆ పాత్ర ఏంటో చెప్పనేలేదు కదూ... ‘టార్జాన్’పాత్ర... అవును... టార్జాన్ పాత్రే.
అయితే... ఈ ముగ్గురిలో సూపర్ స్టార్ కృష్ణ ఈ పాత్రను ముందు అభినయించారు. సినిమా పేరు ‘ఇద్దరు మోనగాళ్లు’. విఠలాచార్య దర్శకత్వంలో 1967లో వచ్చిన ఈ సినిమా బాగా ఆడింది. ఇది కృష్ణ నాలుగో సినిమా కావడం విశేషం.
కృష్ణ తర్వాత ఆ పాత్రను ఎన్టీయార్ చేశారు. 1978లో వచ్చిన ‘రాజపుత్ర రహస్యం’ చిత్రంలో ఎన్టీయార్ ఈ ఫీట్ చేశారు. ఎస్.డి.లాల్ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ సినిమా కూడా సూపర్ హిట్.
ఇక చిరంజీవి టార్జాన్ గా నటించిన సినిమా చాలామందికి తెలుసు. ఆ సినిమానే ‘అడవి దొంగ’. 1985లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించిన తొలి సినిమా ఇదే కావడం విశేషం.
కామెడీ ఏంటంటే... నిజానికి టార్జాన్ ఎలా ఉంటాడు? అతడు మనిషే కానీ... ప్రవర్తన అంతా జంతువులా ఉంటుంది. జుత్తు, గడ్డం పెరిగిపోయి, చాలా వికారంగా ఉంటాడు. కనీ... మన టార్జాన్లు మాత్రం నీట్గా షేవింగ్ చేసుకొని కనిపిస్తారు. ఈ కారణంగా క్రిటిక్స్ నుంచి పలు విమర్శలను కూడా ఎదుర్కొన్నారు.
ఏది ఏమైనా... ముగ్గురు సూపర్ స్టార్లు టార్జాన్స్ గా కనిపించేసి.. మాస్ ప్రజానీకాన్ని బుట్టలో వేసుకునే ప్రయత్నం చేశారు. ఇలాంటి రేర్ ఫీట్లు చేశారు కాబట్టే ఈ ముగ్గురూ నంబర్ వన్లు కాగలిగారు. ఏమంటారు ఫ్రెండ్స్?