'చంద్రముఖి' సీక్వెల్లో టబు
on Nov 14, 2019
'లక లక లక' అంటూ 'చంద్రముఖి'లో రజనీకాంత్ నట విశ్వరూపాన్ని చూపించారు. జ్యోతిక గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇటు తెలుగులో గానీ... అటు తమిళంలో గానీ... 'చంద్రముఖి'కి సీక్వెల్ తీయడం లేదు. హిందీలో తీస్తున్నారు. పన్నెండేళ్ల క్రితం 'చంద్రముఖి'ని హిందీలో 'భూల్ భులైయా' పేరుతో అక్షయ్ కుమార్ రీమేక్ చేశారు. అందులో జ్యోతిక పాత్రను విద్యా బాలన్ పోషించారు. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ 'భూల్ భులైయా 2' తీస్తున్నారు. కార్తీక్ ఆర్యన్ హీరో. 'భరత్ అనే నేను', 'వినయ విధేయ రామ' ఫేమ్ కియారా అడ్వాణీ హీరోయిన్. ఇందులో కీలక పాత్రలో నటించడానికి టబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. జనవరి నుండి ఆమె షూటింగులో జాయిన్ కానున్నారు.
'భూల్ భులైయా 2'లో టబు క్యారెక్టర్ ఏంటనేది ప్రస్తుతానికి సస్పెన్స్. అయితే హారర్ కామెడీలో నటించడం ఆమెకు కొత్తేమీ కాదు. హిట్ ఫ్రాంచైజీ 'గోల్ మాల్' సిరీస్ లో రోహిత్ శెట్టి తీసిన హారర్ కామెడీ 'గోల్ మాల్ అగైన్'లో టబు ఆత్మలతో మాట్లాడే పాత్రలో నటించారు. 'భూల్ భులైయా 2'లో 'చంద్రముఖి'లో జ్యోతిక తరహా పాత్ర చేస్తున్నారా? అనేది కొందరి సందేహం. హిందీ సినిమాలు పక్కన పెడితే... తెలుగులో అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న 'అల... వైకుంఠపురములో' సినిమాలో టబు నటిస్తున్న సంగతి తెలిసిందే.
Also Read