పవన్ కళ్యాణ్ వాయిస్.. రోమాలు నిక్కబొడుచుకునేలా 'సైరా'
on Aug 20, 2019
'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి'. తెలుగువాడు మాత్రమే కాదు ప్రతి భారతీయుడు తెలుసుకోవాల్సిన కథ. ఆంగ్లేయులపై పోరాడి యుద్దానికి పునాది వేసి, ఎందరో వీరుల గుండెల్లో దేశభక్తి రగిల్చిన యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. ఆ కథనే 'సైరా నరసింహారెడ్డి' పేరుతో మెగాస్టార్ చిరంజీవి మన ముందుకు తీసుకొస్తున్నారు. ఐదు భాషల్లో విడుదలవనున్న ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, మేకింగ్ వీడియో అంచనాలను అమాంతం పెంచేశాయి. దీంతో ఆ స్వాతంత్య్ర యోధుడికి ఎప్పుడెప్పుడు సలామ్ చేద్దామా అని సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా విడుదలైన టీజర్ ఈ సినిమా స్థాయేంటో రుజువు చేసింది.
సైరా నరసింహారెడ్డి చిత్ర యూనిట్.. తాజాగా టీజర్ విడుదల చేసింది. "చరిత్ర స్మరించుకుంటుంది.. ఝాన్సీ లక్ష్మిభాయ్, చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్ లాంటి ఎందరో మహనీయుల ప్రాణత్యాగాల్ని.. కానీ ఆ చరిత్ర పుటల్లో కనుమరుగయ్యాడు ఒక వీరుడు. ఆంగ్లేయులపై తొలిసారి యుద్ధభేరి మోగించిన రేనాటి సూర్యుడు." అంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ తో టీజర్ మొదలవుతుంది. రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తుంది. "చరిత్రలో మనం ఉండకపోవొచ్చు.. కానీ చరిత్ర ఈరోజు మనతోనే మొదలవ్వాలి." అని చిరంజీవి చెప్పే పవర్ ఫుల్ డైలాగ్.. నరసింహారెడ్డి పాత్ర ఎంత పవర్ ఫుల్ గా ఉండబోతుందో చెప్పేసింది. యుద్దాన్ని గుర్తుచేసే విజువల్స్, యుద్ధం చేయాలనిపించే లాంటి ఆర్ఆర్ తో.. మొత్తానికి టీజర్.. 'సైరా నరసింహారెడ్డి' అని గర్వంగా గొంతు చించుకొని అరిచేలా చేస్తుంది.