English | Telugu

అదరహో.. 'సైరా' మేకింగ్ వీడియో!

on Aug 14, 2019

 

రెండు కళ్లు చాలవనేంత గ్రాండ్ స్కేల్‌లో భారీ సెట్లు, లొకేషన్లు, వీఎఫ్ఎక్స్ వర్క్, ఒళ్లు గగుర్పాటు కలిగించే యాక్షన్ అండ్ వార్ సీన్స్, ఒక్కొక్క కేరెక్టర్ ఇంట్రడక్షన్.. ఇదీ 'సైరా.. నరసింహారెడ్డి' మేకింగ్ వీడియోలో ఉన్న విశేషాలు. 

అభిమానులతో పాటు సగటు సినీ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని వేయి కళ్లతో ఎదురుచూస్తున్న మెగాస్టార్ చిరంజీవి 'సైరా.. నరసింహారెడ్డి' సినిమా మేకింగ్ వీడియో మనముందుకు వచ్చేసింది. ప్రకటించిన విధంగానే నిర్మాతలు సరిగ్గా 3.45 గంటలకు యూట్యూబ్‌లో 'సైరా' మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. 1 నిమిషం 47 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియో.. 'సైరా' ఏ రేంజిలో ఉంటుందబోతోందనే దానికి నిఖార్సయిన శాంపిల్‌గా కనిపిస్తోంది. ఇంగ్లీషులో 'ఫస్ట్ సివిల్ రెబలియన్ ఎగనెస్ట్ ద బ్రిటిష్ ఎంపైర్' అంటూ ఒక కోట ముఖ ద్వారం నిర్మాణాన్ని చూపించడం ద్వారా మొదలై, 'ద వరల్డ్ ఆఫ్ సైరా' అంటూ ఆ ప్రపంచంలోకి మనల్ని తీసుకెళ్తుంది ఈ వీడియో. 19వ శతాబ్దం ఆరంభం నాటి కాస్ట్యూమ్స్, అప్పటి యోధులు, బ్రిటిషర్లు ఉపయోగించిన వస్తువులు, ఆయుధాలు ఎలా ఉంటాయో చూపించారు.

ఆ తర్వాత రోమాలు నిక్కబొడుచుకొనేలా ఉన్న యాక్షన్ అండ్ వార్ సీన్స్ మేకింగ్ చూపించారు. ఈ సన్నివేశాల్ని మన సొంత టాప్ యాక్షన్ డైరెక్టర్స్ రాం-లక్ష్మణ్ తో పాటు, హాలీవుడ్ అగ్రశ్రేణి స్టంట్ డైరెక్టర్లు గ్రెగ్ పోవెల్, లీ విట్టేకర్ రూపొందించారు. ఈ సందర్భంలో "మీరెప్పుడూ ఇలాంటి మైండ్ బ్లోయింగ్ హై ఆక్టేన్ యాక్షన్ సీన్స్‌ని చూసివుండరు" అంటూ లీ విట్టేకర్ చెప్పే మాటల్ని మనం చూడొచ్చు. ఆ సీన్స్‌ను చేయడానికి వాళ్లెంత కష్టపడ్డారో, వాటిని ఎంత గ్రాండ్ స్కేల్‌లో చేశారో మనకు అర్థమవుతుంది.

ఆ తర్వాత ఒక్కొక్క మెయిన్ కేరెక్టర్‌ను ఇంట్రడ్యూస్ చేస్తూ వచ్చారు. మొదటగా గోసాయి వెంకన్నగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, అవుకురాజుగా కన్నడ స్టార్ యాక్టర్ సుదీప్, ఓబయ్య కేరెక్టర్‌లో తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి, నరసింహారెడ్డి ధర్మపత్ని సిద్ధమ్మ పాత్రలో నయనతార, మరికొన్ని కీలక పాత్రలు చేస్తున్న తమన్నా, జపతిబాబు, రవికిషన్, నిహారికలను పరిచయం చేసి, చివరగా మెగాస్టార్ చిరంజీవి చేసిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కేరెక్టర్‌ను పరిచయం చేశారు. నరసింహారెడ్డిగా చిరంజీవి ఒక బ్రిటిష్ సోల్జర్‌ను కత్తితో నరికే తీరు చూస్తుంటే, ఆయనలోని ఎనర్జీ ఏమాత్రం తగ్గలేదనిపిస్తోంది. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ గొప్పగా ఉంది.

మొత్తంగా 'సైరా' ఒక విజువల్ ఫీస్ట్‌గా ఉండబోతోందన్నది ఖాయం. రత్నవేలు సినిమాటోగ్రఫీ, కమల్ కణ్ణన్ వీఎఫ్ఎక్స్ సూపర్‌విజన్, రాజీవన్ ప్రొడక్షన్ డిజైన్‌తో రాంచరణ్ ఈ సినిమాని ఎంతటి హయ్యెస్ట్ స్టాండర్డ్స్‌తో నిర్మించారో, డైరెక్టర్ సురేందర్‌రెడ్డి ఎంతటి క్రియేటెవ్‌నెస్‌తో సినిమాని రూపొందించారో ఈ మేకింగ్ వీడియో చెప్పకనే చెబుతోంది.తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఒకేసారి గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న వస్తోన్న ఈ మూవీ టాలీవుడ్‌లో రికార్డులు సృష్టించడం ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దాంతో పాటు వచ్చే ఏడాది ప్రకటించే నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్‌లో 'సైరా'కు చోటు తథ్యమనే మాట ఇప్పట్నుంచే వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈరోజు రిలీజ్ చేసిన మేకింగ్ వీడియోతో 'సైరా' ప్రమోషన్ గ్రాండ్ స్కేల్‌లో స్టార్టయింది. ఇక సినిమా మన ముందుకు రావడమే ఆలస్యం.


Cinema GalleriesLatest News


Video-Gossips