అమ్మ బాటలో సుస్మితా సేన్ కూతురు!
on Oct 16, 2020
మాజీ మిస్ యూనివర్స్ సుస్మితా సేన్ తల్లి కావాలని ఎప్పుడూ కోరుకుంటూ సింగిల్ మదర్‌గా 24 ఏళ్ల వయసులోనే ఒక పాపను దత్తత తీసుకొని తల్లిగా మారింది. ఆ పాపకు రెనీ సేన్ అనే పెరు పెట్టింది. ఆ తర్వాత కొన్నాళ్లకు మరో అమ్మాయి అలీసాను దత్తత తీసుకుంది. అలా పెళ్లి చేసుకోకుండా, తను గర్భం దాల్చకుండా ఇద్దరమ్మాయిలకు తల్లిగా మారి, మాతృత్వానికి కొత్త అర్థం చెప్పింది సుస్మిత. ఇప్పుడు అమ్మ మాదిరిగా తన కలలను నిజం చేసుకోవడానికి రెనీ సేన్ నటిగా సినిమాల్లో అడుగుపెట్టింది.
అవును. 21 సంవత్సరాల రెనీ తన తొలి సినిమా షూటింగ్‌ను ప్రారంభించింది. ఆ సినిమా పేరు 'సుట్టాబాజీ'. ఒక సంప్రదాయ కుటుంబానికి చెందిన ఇద్దరు తల్లీకూతుళ్ల అనుబంధం, వారు ఎదుర్కొన్న పరిస్థితుల చుట్టూ ఈ సినిమా కథ నడుస్తుంది. ఆధునిక భావాలున్న కూతురిగా రెనీ నటిస్తోన్న ఈ మూవీలో తల్లిగా కోమల్ ఛాబ్రియా ('పద్మావత్', 'మర్దాని' 2 ఫేమ్) నటిస్తున్నారు. తండ్రి పాత్రను రాహుల్ వోరా ('స్వదేశ్', 'మేడ్ ఇన్ హెవెన్' ఫేమ్) పోషిస్తున్నారు. కబీర్ ఖురానా దర్శకుడు. ఈ సినిమాతో ప్రేక్షకులను రెనీ ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.
Also Read