ఆస్కార్ నామినేషన్ బరిలో సూర్య 'ఆకాశం నీ హద్దురా'!
on Jan 27, 2021
సూర్య హీరోగా సుధ కొంగర డైరెక్ట్ చేసిన 'ఆకాశం నీ హద్దురా' (తమిళ ఒరిజినల్ 'సూరారై పొట్రు') చిత్రం ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో నేరుగా రిలీజై ఘన విజయం సాధించింది. ఓటీటీలో బ్లాక్‌బస్టర్ అయిన తొలి భారీ బడ్జెట్ ఫిల్మ్‌గా అది రికార్డుల్లోకి ఎక్కంది. తాజాగా ఆ సినిమా ఆస్కార్ నామినేషన్ పోటీలో ముందు వరసలో ఉన్నట్లు సమాచారం. జనరల్‌గా అకాడమీ అవార్డులకు థియేటర్లలో విడుదలైన చిత్రాలనే పరిగణనలోకి తీసుకుంటారు. కానీ కొవిడ్ 19 మహమ్మారి కారణంగా 2020 మార్చి నుంచి డిసెంబర్ దాకా సినిమా థియేటర్లు మూతపడటంతో ఓటీటీలో రిలీజ్ అయిన సినిమాలను కూడా అవార్డులకు పరిగణలోకి తీసుకున్నారు.
అకాడమీ స్క్రీనింగ్ రూమ్‌లో 'సూరారై పొట్రు' మూవీని ఇటీవల ప్రదర్శించారు. జనరల్ కేటగిరిలో ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ డైరెక్టర్, ఉత్తమ సంగీతం సహా పలు విభాగాల్లో నామినేషన్‌కు ఈ సినిమా రంగంలోకి దిగింది. పేదలకు సైతం విమాన యానాన్ని కల్పించాలనే లక్ష్యంతో ఎయిర్ దక్కన్‌ను నెలకొల్పిన జి.ఆర్. గోపీనాథ్ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని సుధ కొంగర రూపొందించారు. ఆమె దర్శకత్వ ప్రతిభ, సూర్య నటన ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. త్వరలోనే ఈ సినిమా ఆస్కార్ నామినేషన్లు పొందిందీ, లేనిదీ వెల్లడి కానున్నది.
Also Read