నవంబర్ 14న వస్తున్నట్లు వెల్లడించిన 'ఆకాశం నీ హద్దురా' ట్రైలర్!
on Oct 26, 2020
సూర్య హీరోగా నటించిన 'ఆకాశం నీ హద్దురా' ట్రైలర్ సోమవారం, అక్టోబర్ 26న యూట్యూబ్‌లో విడుదలై, సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. మోహన్‌బాబు, అపర్ణా బాలమురళి, పరేష్ రావల్ ప్రధాన పాత్రధారులైన ఈ సినిమా ఎయిర్ దక్కన్ ఫౌండర్ కెప్టెన్ జి.ఆర్. గోపీనాథ్ రాసిన బయోగ్రఫీ 'సింప్లీ ఫ్లై' ఆధారంగా కాల్పనిక సన్నివేశాలతో రూపొందింది. ఒక గ్రామీణ యువకుడు ఆకాశ యాన ప్రయాణం చెయ్యాలని కలలు కని, అతి తక్కు ఖర్చుతో ప్రతి భారతీయుడూ ఆకాశ యానం చేసేలా ఎలా ఒక విమాన యాన సంస్థను నెలకొల్పాడనే స్ఫూర్తి దాయక కథను ఈ సినిమాలో చూస్తామనే అభిప్రాయాన్ని ట్రైలర్ కలిగించింది. తన కలను సాకారం చేసుకోడానికి అతడు ఎన్ని అడ్డంకులు ఎదుర్కొన్నాడో ఉద్వేగభరితంగా చిత్రంచినట్లు తెలుస్తోంది.
సూర్య భార్యగా అపర్ణ ఇంప్రెస్ చేస్తోంది. ఎయిర్‌ఫోర్స్ ఆఫీసర్ భక్తవత్సలం నాయుడుగా తన మోహన్‌బాబు తన అసలుపేరుతో కనిపించడం ఈ సినిమాలోని ఓ విశేషం. హీరో పాత్రకు అడ్డంకులు సృష్టించే నెగటివ్ రోల్‌ను పరేష్ రావల్ చేశారు. ఎప్పటిలా ప్రధాన పాత్రలో సూర్య చెలరేగిపోయి నటించాడు. అతని కెరీర్‌లోని మంచి సినిమాల్లో 'ఆకాశం నీ హద్దురా' ఉంటుందని చెప్పడానికి సందేహించాల్సిన పనిలేదు. ప్రేక్షకులను ఆకట్టుకొనే మలుపులతో డైరెక్టర్ సుధ కొంగర ఈ సినిమాని మలిచారనే నమ్మకాన్ని కలిగిస్తోంది ట్రైలర్.
ఇటీవలే కొన్ని పర్మిషన్లు రావడంలో ఆలస్యమవడం వల్ల సినిమా విడుదలలో జాప్యం జరుగుతోందని సూర్య ఓ బహిరంగ ఉత్తరం రాసిన విషయం తెలిసిందే. అయితే ట్రైలర్లో రిలీజ్ డేట్‌ను వెల్లడించారు. నవంబర్ 12న అమెజాన్ ప్రైమ్ వీడియోలో 'ఆకాశం నీ హద్దురా' మూవీ విడుదలవుతోంది. ఒరిజినల్ తమిళ వెర్షన్ 'సూరారై పొట్రు' సహా కన్నడ, మలయాళం భాషల్లో ఏక కాలంలో ఈ సినిమా ఓటీటీలో ప్రేక్షకుల ముందుకు వస్తోంది.