ENGLISH | TELUGU  

కృష్ణలో ధైర్యాన్ని నింపిన ఎన్టీయార్!

on Aug 2, 2017

కృష్ణ ‘మోసగాళ్లకు మోసగాడు(1971)’ సినిమా నిర్మాణం పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉన్న రోజులవి. సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారు కృష్ణ. తెలుగులో వచ్చిన తొలి కౌబాయ్ చిత్రం ఇదే కావడం విశేషం. ఓ హాలీవుడ్ చిత్రం ప్రేరణగా కె.ఎస్.ఆర్.దాస్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 

తన ప్రతి చిత్రాన్ని... విడుదలకు ముందు విజయ సంస్థ అధినేతల్లో ఒకరైన చక్రపాణికి చూపించడం కృష్ణకు మొదట్నుంచీ అలవాటు. దాన్ని కొనసాగిస్తూ... చక్రపాణికి స్పెషల్ గా ఓ షో వేశారు కృష్ణ. ఆ రోజుల్లో చక్రపాణి జడ్జిమెంట్ అంటే శిలాశాసనం. ఆయన సినిమా హిట్ అంటే హిట్. ఫట్ అంటే ఫట్. అంత కరెక్ట్ గా ఉండేది చక్రపాణి జడ్జిమెంట్. దాంతో ఆయన సినిమా చూసి ఏం అంటారో... అని కృష్ణకు ఒకటే టెన్షన్. సినిమా అయిపోయింది. చక్రపాణి మౌనంగా థియేటర్ నుంచి బయటకు వచ్చి కారెక్కి వెళ్లిపోయారు.

కృష్ణకు టెన్షన్ తో బీపీ పెరిగిపోయింది. ‘ఏంటి? పెద్దాయన ఏం చెప్పకుండా వెళ్లిపోయాడు?’అని సతమతమైపోయారు. ఇక ఈ టెన్షన్ ఆపుకోలేక... ఏదైతే అదైందని.. ఫోన్ చేసేశారు. ‘గురుగారూ ఏంటి? ఏం చెప్పకుండా వెళ్లిపోయారు. అసలు ఎలా ఉంది సినిమా?’అని అడిగారు కృష్ణ. దానికి చక్రపాణి... ‘సినిమాకు ఎంత ఖర్చుపెట్టావ్?’అని ఎదురు ప్రశ్నించారు. కృష్ణకు టెన్షన్ పెరిగిపోతోంది. ‘చాలానే అయ్యిందండీ... కౌబాయ్ సినిమా కదా’అని సమాధానమిచ్చారు. ‘నీ డబ్బులన్నీ... బూడిదలో పోసిన పన్నీరే!’అని తడుముకోకుండా అనేశారు చక్రపాణి. అంతే కృష్ణకు గుండె ఆగినంత పనైంది. ‘అదేంటి గురూగారూ? అలా అంటారూ’అన్నారు బాధగా. ‘లేకపోతే ఏంటయ్యా... అసలు అది సినిమానేనా. ఆ చెక్కల కొంపలేంటి? ఆ టోపీ లేంటి? ఆ వేషభాషలేంటి? ఆ కొట్టుకోడాలేంటి? అసలు మన నేటివిటీ ఎక్కడైనా ఉందా? నువ్వేమైనా అనుకో... నాకు అస్సలు నచ్చలేదు.’ అని ఖరాకండీగా చెప్పేసి ఫోన్ పెట్టేశారు చక్రపాణి. 

ఇక కృష్ణకు ఒకటే దిగులు. ఈ విషయం బయ్యర్లకు తెలిస్తే... కొననుకూడా కొనరు. ఇప్పుడెలా? అని ఆలోచిస్తూ కూర్చున్నారు. ఇంతలో కృష్ణకు ఓ ఫోన్ వచ్చింది. ఫోన్ లిప్ చేయగానే... అవతల పక్క నుంచి ‘హలో బ్రదర్... ఎలా ఉన్నారు?’అంటూ ఓ గంభీర కంఠం వినిపించింది. అంతే... కృష్ణ అలర్ట్ అయ్యారు. ‘నమస్తే అన్నగారూ..’అని విష్ చేశారు. ఆయన ఎవరో మీకు అర్థమయ్యే ఉంటుంది.. అన్న ఎన్టీయార్. ‘మీ సినిమా ఓ సారి మాకు చూపిస్తారా?’అని అడిగారు ఎన్టీయార్. ‘తప్పకుండా అన్నగారూ’ అని మరుసటి రోజు ఎన్టీయార్ కి స్సెషల్ షో వేశారు కృష్ణ. సినిమా చూసిన ఎన్టీయార్... కృష్ణను అభినందనలతో ముంచెత్తారు. ‘మీ కెరీర్ లోనే ఇది పెద్ద హిట్. గురూగారు మన నేటివిటీని దృష్టిలో పెట్టుకొని అలా అన్నారు. భయపడొద్దు. నిర్భయంగా విడుదల చేయండి’ అని ఎన్టీయార్ భరోసా ఇచ్చారు. 

‘మోసగాళ్లకు మోసగాడు’ సినిమా విడుదలైంది. ఎన్టీయార్ మాట నిజమైంది. సినిమా బంపర్ హిట్. ఈ విషయాలన్నీ కృష్ణ పలు సందర్భాల్లో చెప్పుకొని పొంగిపోతుంటారు. ఆనాడు ఎన్టీయార్ ఇచ్చిన ఆత్మస్థైర్యాన్ని జీవితంలో మరిచిపోలేనని అంటారాయన.


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.