సునీల్ అనుకున్నదొకటి.. అయినదొకటి!
on Dec 4, 2020
కమెడియన్లు హీరోగా సుదీర్ఘ కాలం రాణించలేరనే అపవాదును చెరిపివేయాలని ప్రయత్నించిన సునీల్ ఆ విషయంలో సక్సెస్ కాలేకపోయాడు. 'అందాల రాముడు' మూవీతో హీరోగా మారి, విజయం సాధించిన సునీల్, ఆ తర్వాత నాలుగేళ్లకు రాజమౌళి డైరెక్షన్లో చేసిన 'మర్యాద రామన్న' (2010) బ్లాక్‌బస్టర్ హిట్టవడంతో హీరోగా రాణించగలడనే నమ్మకాన్ని అందరిలోనూ కలిగించాడు. వీరభద్రమ్ చౌదరి డైరెక్షన్లో చేసిన 'పూలరంగడు' మూవీలో సిక్స్ ప్యాక్‌లో కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఆ సినిమా కూడా ఘనవిజయం సాధించి అతని ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది.
అయితే ఆ సినిమా సక్సెస్ మీట్లో సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కోట శ్రీనివాసరావు మాట్లాడుతూ, కమెడియన్లు హీరోగా సుదీర్ఘ కాలం రాణించడం కష్టమనీ, అందువల్ల మరోవైపు కమెడియన్‌గానూ కొనసాగమని సునీల్‌కు సూచించారు. కమెడియన్ కూడా హీరోగా రాణిస్తాడని చూపించాలనుకుంటున్నట్లు సునీల్ అప్పుడు చెప్పాడు. ఆ తర్వాత హీరో పాత్రలకే ప్రాధాన్యం ఇస్తూ రావడం వల్ల కమెడియన్‌గా వచ్చిన అనేక అవకాశాలను వదులుకున్నాడు. 2012 నుంచి 2017 వరకు అతడు చేసినవన్నీ హీరో పాత్రలే. ఆ క్రమంలో నాగచైతన్యతో చేసిన 'తడాఖా' హిట్టవగా, 'భీమవరం బుల్లోడు' ఓ మోస్తరుగా ఆడింది. మిస్టర్ పెళ్లికొడుకు, కృష్ణాష్టమి, ఈడు గోల్డ్ ఎహే, జక్కన్న, ఉంగరాల రాంబాబు, 2 కంట్రీస్, సిల్లీ ఫెలోస్ సినిమాలు ఒకదాని తర్వాత ఒకటిగా ఫెయిలవడంతో, హీరో అవకాశాలు అడుగంటాయి.
దాంతో 'అరవింద సమేత' నుంచి తిరిగి కామెడీ రోల్స్‌లోకి వచ్చేశాడు సునీల్. కానీ గతంలో ఉన్న డిమాండ్ ఇప్పుడు లేదు. ఒకప్పుడు ఏడాదికి పదిహేను, ఇరవై సినిమాలు చేసిన అతడికి ఇప్పుడు మూడు నాలుగు సినిమాలకు మించి రావట్లేదు. అతడి స్థానాన్ని వెన్నెల కిశోర్, సత్యా లాంటివాళ్లు ఆక్రమించేశారు. ఇటీవల 'కలర్ ఫొటో'లో నెగటివ్ రోల్ కూడా చేసి సక్సెస్ అయిన సునీల్.. పూర్వ వైభవాన్ని సాధిస్తాడా?