అదే నా బలం... నా బలహీనత
on Dec 3, 2018
సుమంత్ ఓ పడిలేచే కెరటం. అతణ్ణి పరాజయాలు పలకరించిన ప్రతిసారీ కిందకు పడినట్టు కనిపిస్తాడు. కానీ, మరో విజయంతో పైకి లేస్తాడు. 'మళ్ళీ రావా' విజయంతో సుమంత్ మళ్ళీ పైకి లేచాడు. వరుసగా సినిమాలు చేస్తున్నాడు. సుమంత్ నాస్తికుడిగా నటించిన సినిమా 'సుబ్రహ్మణ్యపురం'. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా సినిమా గురించి సుమంత్ మాట్లాడుతూ "సినిమాలో నా పేరు కార్తీక్. దేవుడు అంటే నమ్మకం వుండదు. కానీ, దేవాలయాలపై పరిశోధన చేస్తుంటాడు. చివరికి అతడు దేవుణ్ణి ఎలా నమ్మాడు? భక్తుడిగా ఎలా మారాడు? అనేది కథ. 'కార్తికేయ' సినిమాకీ, ఈ సినిమాకీ సంబంధం లేదు. రెండూ దేవాలయాలపై తెరకెక్కిన సినిమాలు అంతే. కథలు వేరుగా ఉంటాయి" అన్నారు. వ్యక్తిగత జీవితంలో తాను దేవుణ్ణి నమ్ముతానని సుమంత్ చెప్పారు. దేవాలయాలకు, మసీదులకు, చర్చిలకు వెళతానని అన్నారు.
'హీరోగా, కమర్షియల్ లెక్కల పరంగా 'మళ్ళీ రావా' విజయం మీలో మార్పు తీసుకొచ్చిందా?' అని ప్రశ్నిస్తే "నా దగ్గరకు ఎవరైనా వచ్చి కథ చెబితే మనసుకు హత్తుకునేలా వుందా? లేదా? అని మాత్రమే ఆలోచిస్తా. కమర్షియల్ లెక్కలు వేసుకోను. అదే నా బలం.. అదే నా బలహీనత. కథ నచ్చిస్తే చేస్తా. 'మళ్ళీ రావా' తరవాత అన్నీ రొమాంటిక్ సినిమాలు వస్తాయని అనుకున్నా. చిత్రంగా థ్రిల్లర్స్ వచ్చాయి. చేస్తున్నా" అన్నారు. ఎన్టీఆర్ బయోపిక్‌లో నటించే అవకాశం రాగానే మరో ఆలోచన లేకుండా అంగీకరించానని తెలిపారు. తాతగారి (ఏయన్నార్)ని ఇమిటేట్ చేయకుండా.. సహజంగా నటించాలని అనుకున్నట్టు, నటించినట్టు ఆయన చెప్పారు. తాతగారిలా కనిపించడం తన అదృష్టమని సుమంత్ అన్నారు.