English | Telugu

దాసరి రికార్డ్ బద్దలవ్వడం ఖాయం!

on Oct 10, 2017

దాసరి రికార్డ్ బద్దలవ్వడం ఖాయం! ( రాజమౌళి బర్త్‌డే స్పెషల్ )

 

ఎస్.ఎస్.రాజమౌళి... అనే ముద్ర... పోస్టర్ మీద వేసుకున్నప్పుడు...చాలామంది వెటకారంగా మాట్లాడారు. ‘ఇప్పటివరకూ పెద్దపెద్ద లెజెండ్రీ దర్శకులే ఆ పని చేయలేదు... ఏంటంట.. ఈయనగారి పొగరు?’ అంటూ విమర్శలు గుప్పించారు. పోస్టర్ పై ముద్ర వేసుకోవడాన్ని పొగరుగా, అహంభావంగా, ఓవర్ కాన్ఫిడెన్స్ గా అభివర్ణించుకున్నారే తప్ప.. అది రాజమౌళిలో ఉన్న ఆత్మస్థైర్యానికి, ఆత్మాభిమానానికీ, తనపై తనకున్న నమ్మకానికి ప్రతీక అని అర్థం చేసుకోలేకపోయారు. కానీ... కాలం ప్రతి దానికీ సమాధానం ఇస్తుంది... ఇచ్చింది.  ‘రాజ’ముద్ర..  ఇప్పుడు  పోస్టర్లపై కాదు.. జనాల గుండెల్లో ఉంది. దర్శకుడికి హీరో ఇమేజ్ తీసుకొచ్చిన దర్శకులు చాలామందే ఉన్నారు కానీ... దక్షిణభారత సినిమాను మార్కెట్ పరంగా జాతీయ స్థాయికి తీసుకెళ్లిన దర్శకులు మాత్రం ఇప్పటివరకూ లేరు. దటీజ్ రాజమౌళి. 

ఇప్పుడు... మన మార్కెట్ కూడా బాలీవుడ్ కి దాదాపు సమానం. ఆ ఘనత తెచ్చింది ఎవరు?... రాజమౌళి. వందల కోట్లు ఖర్చుపెట్టి మనం కూడా సినిమాలు తీయొచ్చు అన్న నమ్మకాన్ని నిర్మాతల్లో కలిగించిన దర్శకుడెవరు? ...రాజమౌళి. ఒక్క సినిమాతో... ప్రపంచం మొత్తం తెలుగు సినిమావైపు చూసేలా చేసిన దర్శకధీరుడెవ్వరు?... రాజమౌళి దక్షిణాది సినిమా గురించి ఎగతాళిగా మాట్లాడుకునే ఉత్తరాది క్రియేటర్ల గూబ గులాబ్ జామ్ చేసిన ఘనుడెవ్వరు? ... రాజమౌళి నిరంతరం సినిమాకై పరితపిస్తూ... ఉంటాడు కాబట్టే... అపజయం లేకుండా దూసుకుపోగలుగుతున్నాడు. నిజానికి రాజమౌళి విజయంలో కృషితో పాటు అదృష్టం పాత్ర కూడా ఎక్కువే. అతను అడుగుపెట్టిన వేళా విశేషం బావుంది. అందుకే... అన్నీ విజయాలే. ‘బాహుబలి 2’ తో వరుసగా పది విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు. వరుసగా 13 విజయాలను సాధించిన రికార్డు ప్రస్తుతం స్వర్గీయ దాసరి నారాయణరావు ఖాతాలో ఉంది. త్వరలో ఆ రికార్డుని కూడా రాజమౌళి అధిగమించడం ఖాయం.. అని పలువురి అభిప్రాయం. 

‘బాహుబలి2’దాదాపు 16 వందల కోట్ల వసూళ్లు రాబట్టి... ప్రపంచ సంచలనంగా నిలిచింది. అంతటి విజయం తర్వాత రాజమౌళి నుంచి వచ్చే సినిమా ఎలా ఉంటుంది? అనేది ఇప్పుడు ఆసక్తికరమైన ప్రశ్న. రాజమౌళి తర్వాత సినిమాలో హీరో ఎవరు? అనేది కూడా ఇప్పుడు అందరినీ తొలిచేస్తున్నప్రశ్న. ఒకాయన మహేశ్ అంటాడు. ఇంకో ఆయన ఎన్టీయార్ అంటాడు. వీళ్లిద్దరూ కాదు బన్నీ అని మరో మనిషి అంటాడు. అసలు రాజమౌళి మనసులో ఏముంది? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా నిలిచిపోయింది. అవును... ప్రస్తుతం హీరోల ఇమేజ్ కి కూడా అందనంత స్థాయిలో ఉంది రాజమౌళి ఇమేజ్. సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఆయన సినిమా అంటే.. నటించడానికి రెడీ. ఇది ప్రతి తెలుగోడూ గర్వంగా చెప్పుకోదగ్గ విషయం. 

నేడు దర్శకుధీరుడు రాజమౌళి పుట్టిన రోజు... ఇలాంటి వేడుకలు ఆయన నూరెళ్లు జరుపుకోవాలనీ... అద్వితీయమైన విజయాలతో దూసుకుపోవాలని కాంక్షిస్తుందీ... ‘తెలుగువన్’ .


Also ReadLatest NewsCustomer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here