English | Telugu

శ్రీ‌నివాస క‌ళ్యాణం రివ్యూ

on Aug 9, 2018

పెళ్లి ప్ర‌తి ఒక్క‌రి జీవితంలో మ‌ధుర‌ఘ‌ట్టం. త‌రాలు మారుతున్నా వివాహ ప్రాశ‌స్త్యం ఏమాత్రం చెక్కుచెద‌ర‌లేదు. అయితే నేటి జీవిత విధానానికి అనుగుణంగా పెళ్లి జ‌రుపుకునే విధివిధానాల్లో కొన్ని మార్పులు వచ్చాయి. ముఖ్యంగా నేటిత‌రంలో పెళ్లివేడుక‌ను ఒక సెల‌బ్రేష‌న్‌లా, అట్ట‌హాసంగా జ‌రుపుకునే ఓ ఈవెంట్‌లా మాత్ర‌మే చూస్తున్నారు. కానీ పెళ్లంటే మ‌న‌వైన సంస్కృతి, సంప్ర‌దాయాల‌కు అద్దం ప‌ట్టే ప‌విత్ర వేడుక‌. జీవితాంతం ప‌దిల‌ప‌ర‌చుకునే ఓ అంద‌మైన జ్ఞాప‌కమ‌ని తెలియ‌జెప్పే ప్ర‌య‌త్నంలో భాగంగా శ్రీ‌నివాస క‌ళ్యాణం చిత్రానికి శ్రీ‌కారం చుట్టారు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు స‌తీష్ వేగేశ్న,  దిల్‌రాజు. శ‌త‌మానం భ‌వ‌తి చిత్రం ద్వారా మంచి విజ‌యాన్ని ద‌క్కించుకున్నారు ద‌ర్శ‌కుడు స‌తీష్ వేగేశ్న‌. ఆయ‌న మ‌రోసారి దిల్‌రాజు సంస్థ‌లో సినిమా చేస్తుండ‌టంతో శ్రీ‌నివాస క‌ళ్యాణం ప్రేక్ష‌కుల్లో అంచ‌నాల్ని పెంచింది. త‌మ సంస్థ చ‌రిత్ర‌లో గొప్ప‌గా నిలిచిపోయే చిత్ర‌మిద‌ని ప్ర‌చార కార్య‌క్ర‌మాల సంద‌ర్భంగా నిర్మాత దిల్‌రాజు సినిమా గురించి ప‌దే ప‌దే ప్ర‌శంస‌లు కురిపించారు.  దాదాపు ప‌దిహేనేళ్ల సుదీర్ఘ విరామం త‌ర్వాత నితిన్ దిల్‌రాజు నిర్మాణంలో సినిమా చేయ‌డం కూడా ఆస‌క్తినిరేకెత్తించింది.  ఇంత‌టి అంచనాల మ‌ధ్య వ‌చ్చిన  శ్రీ‌నివాస క‌ళ్యాణం ప్రేక్ష‌కుల్ని ఏ మేర‌కు ఆక‌ట్టుకుందో తెలుసుకుందాం...

క‌థ‌:-

శ్రీ‌నివాస‌రాజు (నితిన్‌) కోన‌సీమ ప్రాంతంలోని అంద‌మైన ప‌ల్లెటూరు స‌ఖినేటిప‌ల్లిలో పుట్టి పెరుగుతాడు. మ‌న సంస్కృతి, సంప్ర‌దాయాల‌ను అమితంగా ప్రేమిస్తుంటాడు. పెళ్లంటే జీవితంలో ఒకేసారి వ‌చ్చే పెద్ద పండ‌గ  అంటూ చిన్న‌ప్పుడు నాన‌మ్మ (జ‌యసుధ‌) పెళ్లి ఔన్న‌త్యం గురించి చెప్పిన మాట‌లు అత‌ని మ‌న‌సులో ముద్రించుకుపోతాయి. ఛండీఘ‌ర్‌లో ఆర్కిటెక్ట్‌గా ప‌నిచేస్తున్న శ్రీ‌నివాస‌రాజుకు అక్క‌డ ఓ సంద‌ర్భంలో శ్రీ‌దేవి (రాశీఖ‌న్నా) ప‌రిచ‌య‌మ‌వుతుంది. ఆమె హైద‌రాబాద్‌లోని ఆర్‌.కె.గ్రూప్ అధినేత ఆర్కే కూతురు. శ్రీ‌నివాస‌రాజులోని మంచిత‌నం, కుటుంబ విలువల్ని పాటించే తీరు, సంప్ర‌దాయాల ప‌ట్ల మ‌మ‌కారం శ్రీ‌దేవిని ముగ్ధురాలిని చేస్తాయి. ఇద్ద‌రూ పెళ్లి చేసుకోవాల‌ని నిర్ణ‌యించుకుంటారు. అయితే కాలాన్ని డ‌బ్బుతో తూచే శ్రీ‌దేవి తండ్రి ఆర్కే కూతురు వివాహాన్ని క‌ష్టంగానే అంగీక‌రిస్తాడు. ఈ నేప‌థ్యంలో త‌న కూతురును పెళ్లి చేసుకోవాలంటే ఓ అగ్రిమెంట్ మీద సంత‌కం చేయ‌మ‌ని శ్రీ‌నివాస‌రాజుకు ఓ  ష‌ర‌తు విధిస్తాడు. అందుకు శ్రీ‌నివాస‌రాజు ఒప్పుకుంటాడు. ఈ క్ర‌మంలో ఏం జ‌రిగింది? ఆత్మీయుల స‌మ‌క్షంలో వారంరోజుల పాటు అంగ‌రంగ వైభ‌వంగా పెళ్లిచేసుకోవాల‌నుకున్న శ్రీ‌నివాస‌రాజు క‌ల నెర‌వేరిందా?  విరుద్ధ భావాలు క‌లిగిన శ్రీ‌నివాస‌రాజు కుటుంబం, ఆర్కే మ‌ధ్య చోటుచేసుకున్న సంఘ‌ట‌న‌లేమిటి? అస‌లు పెళ్లి కోసం శ్రీ‌నివాస‌రాజు చేసుకున్న అగ్రిమెంట్ ఏమిటి? అన్న‌దే మిగ‌తా చిత్ర క‌థ‌...

విశ్లేష‌ణ‌..

శ‌త‌మానం భ‌వతి చిత్రంలో ప్రేమ‌, పండ‌గ‌లు, ప‌ల్లెటూరి గొప్ప‌త‌నం అంశాల‌పై దృష్టిపెట్టిన ద‌ర్శ‌కుడు వేగేశ్న స‌తీష్‌..శ్రీ‌నివాస క‌ళ్యాణం చిత్రంలో పెళ్లి, కుటుంబ విలువ‌ల గొప్ప‌త‌నాన్ని చ‌ర్చించే ప్ర‌య‌త్నం చేశారు. సంస్కృతి, సంప్ర‌దాయాల్ని ప్రాణ‌ప్ర‌దంగా ప్రేమించే శ్రీ‌నివాస‌రాజు కుటుంబం, ప్ర‌తి విష‌యాన్ని వ్యాపార దృక్ప‌థంతో చూసే ఆర్కే..ఇలా భిన్న ధృవాలైన రెండు కుటంబాల మ‌ధ్య క‌థ న‌డిపిస్తూ తాను చెప్ప‌ద‌ల‌చుకున్న మోర‌ల్ (నీతి)ని చెప్పే ప్ర‌య‌త్నం చేశారు. క‌థాప‌రంగా ఈ పాయింట్ బాగానే అనిపిస్తుంది. అయితే దానిని తెర‌పై తీసుకువ‌చ్చే విధానం, స‌న్నివేశాల్ని అల్లుకున్న తీరు, పాత్ర‌ల్ని తీర్చిదిద్దే విధానంలో ఆత్మ లోపించిన‌ట్లుగా అనిపిస్తుంది. అస‌లు సినిమా ఎత్తుగ‌డ‌లోనే ద‌ర్శ‌కుడు త‌డ‌బ‌డ్డారు. నితిన్‌, రాశీఖ‌న్నా ప్రేమ‌, పెళ్లికి దారితీసిన సంఘ‌ట‌న‌లు ఏమాత్రం బ‌లంగా అనిపించ‌వు. హీరో  నాలుగు మంచి మాట‌లు చెప్పిన‌ప్పుడ‌ల్లా క‌థానాయిక సిగ్గుల మొగ్గై, త‌న్మ‌యానికి లోనుకావ‌డం విచిత్రంగా అనిపిస్తుంది. ప్ర‌థ‌మార్థాన్ని మొత్తం నాయ‌కానాయిక‌లు, వారి స్నేహితుల చట్టూ న‌డిపించాడు. విద్యుల్లేఖ రామ‌న్‌, ప్ర‌వీణ్‌, స‌త్యం రాజేష్‌ల‌తో పండించిన కామెడీ కూడా పెద్ద‌గా ఆక‌ట్టుకోలేదు. క‌థ‌తో ప్రేక్ష‌కులు స‌హానుభూతిచెంద‌క‌పోతే ఎన్ని గొప్ప సంభాష‌ణ‌లు చెప్పినా ప్ర‌యోజ‌నం ఉండ‌దు. ఈ సినిమాలోని కొన్ని స‌న్నివేశాలు అలాగే సాగాయి. కేవ‌లం పెళ్లి ఔన్న‌త్యాన్ని చెప్ప‌డానికే కొన్ని సీన్స్ రాసుకున్నార‌నిపించింది. క‌నిపించిన ప్ర‌తిసారి ఓ ప్ర‌వ‌చ‌న‌కారుడిలా హీరో నితిన్ సంభాష‌ణ‌ల్ని వ‌ల్లించ‌డం కృత‌కంగా అనిపిస్తుంది. ద్వితీయార్థంలో కూడా క‌థాగ‌మంలో ఎక్క‌డా భావోద్వేగం క‌నిపించ‌లేదు. ఎంత‌సేపు పెళ్లి గొప్ప‌త‌నాన్ని తెలియ‌జెప్పే ప్ర‌య‌త్నం చేశారు త‌ప్ప వాటిని క‌న్విన్స్ చేసేలా స‌న్నివేశాల్ని త‌యారుచేసుకోలేక‌పోయారు. అయితే కొన్ని చోట్ల ద‌ర్శ‌కుడు వేగేశ్నస‌తీష్ క‌లం మెరుపులు మెరిపించింది. మ‌న పుట్టుక‌కు కార‌ణ‌మైన త‌ల్లిదండ్రుల‌ను మ‌నం ఎంత గొప్ప‌గా చూసుకుంటామో..అలాగే మ‌న పిల్ల‌ల పుట్టుక‌కు కార‌ణ‌మైన భార్య‌ను అంతే గొప్ప‌గా చూసుకోవాలి...పెళ్లి ప్ర‌తి ఇంటికి ఓ కొత్త‌త‌రాన్ని తీసుకొస్తుంది..త‌ల్లిదండ్రులు జ‌న్మ‌నిస్తారు, స్నేహితులు ఆనందాన్నిస్తారు, లైఫ్‌పార్ట‌న‌ర్ లైఫ్ నిస్తుంది..వంటి సంభాష‌ణ‌లు అల‌రిస్తాయి. ఈ సినిమాలో క‌థ‌కుడిగా విఫ‌ల‌మైన ద‌ర్శ‌కుడు.. సంభాష‌ణ‌లప‌రంగా ఆక‌ట్టుకున్నాడు. ముఖ్యంగా క్లైమాక్స్ ఘ‌ట్టాల్లో వివాహా మంత్రాల ప‌ర‌మార్థాన్ని వివ‌రించే ప్ర‌యత్నం బాగుంది. శ‌త‌మానం భ‌వ‌తి హ్యాంగోవ‌ర్‌లో ద‌ర్శ‌కుడు ఈ క‌థ రాసుకున్నాడ‌నిపించింది.  రెంగున్న‌ర‌గంట‌ల సినిమాలో హార్ట్‌ట‌చింగ్ అనిపించే స‌న్నివేశం ఒక్క‌టి కూడా లేదంటే అతిశ‌యోక్తికాదు. సినిమా ఆసాంతం ఓ ప్ర‌హ‌సనంలా సాగిన అనుభూతి క‌లుగుతుంది. దర్శ‌కుడు స‌తీష్ వేగేశ్న అంద‌మైన క‌థ‌నే ఎంచుకున్నా దానికి భావోద్వేగ‌పు ప‌రిమ‌ళాల్ని అద్ద‌డం మ‌ర్చిపోయాడ‌నిపించింది.

న‌టీన‌టులు..


ఈ సినిమాలో జ‌య‌సుధ‌, రాజేంద్ర‌ప్ర‌సాద్‌, న‌రేష్‌, ప్ర‌కాష్‌రాజ్‌, సితార వంటి గొప్ప తారాగ‌ణం ఉన్నారు. వారంతా త‌మ ప‌రిధుల మేర‌కు బాగానే న‌టించారు. జ‌య‌సుధ పాత్రలో శ‌త‌మానం భ‌వ‌తి ఛాయ‌లు సినిమా స్ప‌ష్టంగా క‌నిపించాయి. ఇక ఆర్కేగా ప్ర‌కాష్‌రాజు త‌న‌క‌కు బాగా అల‌వాటైన పాత్ర‌లో  న‌టించారు. నితిన్ తండ్రిగా రాజేంద్ర‌ప్ర‌సాద్ పాత్ర‌కు పెద్ద‌గా స్కోప్ లేకుండా పోయింది. ఆమ‌ని, సితార పాత్ర‌లు ఉన్నాయంటే ఉన్నాయ‌నిపించాయి. సీనియ‌ర్ న‌టీన‌టుల్ని వారి ప్ర‌తిభ‌కు అనుగుణంగా ఏమాత్రం వాడుకోలేక‌పోయారు. ఇక నితిన్ పాత్ర‌లో ఏమాత్రం కొత్త‌ద‌నం క‌నిపించ‌లేదు. సినిమా ఆసాంతం ఒకే మూడ్‌లో సంభాష‌ణ‌లు చెప్ప‌డ‌మే త‌న క‌ర్త‌వ్యంగా నితిన్ పాత్ర సాగింది. రాశీఖ‌న్నా అందంగా క‌నిపించినా అభిన‌యానికి ఏమాత్రం అవ‌కాశం లేకుండా పోయింది.
 
* సాంకేతిక వ‌ర్గం


 సంగీత‌ప‌రంగా పెళ్లి నేప‌థ్యంలో వ‌చ్చే పాట త‌ప్ప మిగ‌తా ఒక్క పాట గుర్తుంచుకునేలా లేదు. స‌మీర్‌రెడ్డి ఛాయాగ్రహణం గ్రామీణ అందాల్ని బాగానే బంధించింది. అయితే ఆయ‌న స్థాయిమేర‌కు ఛాయాగ్ర‌హ‌క విలువ‌లు లేవ‌నే భావ‌న క‌లుగుతుంది. ఇక నిర్మాణ విలువ‌ల గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. దిల్‌రాజు ఎక్క‌డా రాజీప‌డ‌కుండా చిత్రాన్ని తెర‌కెక్కించాడు. ఆయ‌న బ్యాన‌ర్ పేరుకు త‌గినట్టుగా నిర్మాణ విలువ‌లు  బాగున్నాయి.

*  తీర్పు

పెళ్లి అనే కాన్సెప్ట్‌తో ప్ర‌తి ఒక్క‌రికి క‌నెక్ట్ అయ్యేదే. అయితే క‌థ‌లో ఎమోష‌న్స్ పండినప్పుడే ఏ క‌థ అయినా ప్రేక్ష‌కుల హృద‌యాన్ని స్పృశిస్తుంది. క‌థ‌ను విడిచి ఎన్ని హంగుల‌తో గార‌డి చేద్దామ‌న్నా ప్రేక్ష‌కులు హ‌ర్షించ‌రు. శ్రీ‌నివాస క‌ళ్యాణం ఆ కోవ‌కు చెందిన‌దే. ఈ సినిమా క్రియేట్ చేసిన హైప్ చూసి థియేట‌ర్‌కు వెళ్లిన వారు నిరుత్సాహ‌ప‌డ‌తారు. ఆత్మ‌లేని పెళ్లి ప్ర‌హ‌స‌నంతో విసుగెత్తి ఉసురూమంటూ బ‌య‌ట‌కొస్తారు.

రేటింగ్‌: 2


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.