English | Telugu

అందాల తారలు.. అంతులేని విషాదాలు

on Feb 27, 2018

 

సినీ ప్రపంచంలో ఏదో కొంత మంది జీవితాలు తప్పా... నూటికి ఎనభైశాతం మంది సినీ తారల జీవితాలు.. ముళ్లమీద నడకలే. అలనాటి అందాల తార.. మహానటి సావిత్రి నుండి నేడు శ్రీదేవి వరకూ ఇదే పరిస్థితి. స్టార్ డమ్ వరకూ బాగానే ఉన్నా.. వారి జీవితాల్లో ఎన్నో బాధలు, ఎన్నో రహస్యాలు. మహానటిగా.. మహా మహ నటులకు సైతం పోటీ ఇచ్చిన సావిత్రి ఎలా మరణించారో అందరికీ తెలిసిందే. ఇక చిన్న వయసులో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి మంచి ఫామ్ లో దూసుకుపోతున్న దివ్యభారతి మరణం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఓ బిల్డింగ్ పై నుండి కింద పడి చాలా దారుణంగా మృతి చెందారు. ఇప్పటికీ దివ్యభారతి డెత్ ఓ మిస్టరీనే. కొంతమంది ఆమె తాగి బాల్కని పిట్టగోడపై కూర్చొని మత్తులో తూగి పడిపోయిందని అంటే... కొంత మంది ఆమె భర్తే ఆమె మృతికి కారణమని అంటుంటారు. ఇక సౌందర్య జీవితం కూడా చాలా చిన్న వయసులో ముగిసిపోయింది. ఎన్నికల ప్రచారానికి వెళుతున్న ఆమె హెలికాఫ్ట్రర్ క్రాష్ అవ్వడంతో సజీవదహనమయ్యారు. ఇక ఇటీవల చనిపోయిన దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవతమైతే ఓ సీక్రెట్ పుస్తకమే. ఆమె వ్యక్తిగత జీవితం, ఆమె మృతి అన్ని రహస్యలుగానే ఉన్నాయి. అసలు జయలలితకు పెళ్లైందా... ఆమెకు నిజంగా సంతానం ఉందా...? ఇవే సమాధానాలు లేని ప్రశ్నలనుకుంటే.. ఆమె మరణంపై కూడా ఎన్నో అనుమానాలు. ఆమెది సహజ మరణమని కొందరూ.. లేదు శశికళ చంపిందని మరోకరు ఇలా పలు పుకార్లు పుట్టాయి.. ఇంకా పుడుతూనే ఉన్నాయి.

ఇవన్నీ ఒకత్తైతే ఇప్పుడు శ్రీదేవి మరణం కూడా ఓ మిస్టరీలా మారింది. అసలు శ్రీదేవి విషయంలో ఇలా జరుగుతుందంటే జీర్ణించుకోలేని వాళ్లు చాలామంది ఉన్నారు. నాలుగేళ్ల  ప్రాయం నుండే... సినీ రంగంలో కాలుపెట్టిన శ్రీదేవి... "పదహారేళ్ల వయసు"తో సినీ ప్రేక్షకుల మనసు కొల్లగొట్టి ఆ తరువాత వెనుకకు తిరగకుండా టాలీవుడ్, బాలీవుడ్, కోలివుడ్, మల్లూవుడ్ లో అందరి స్టార్స్ తో నటించి మొట్ట మొదటి ఇండియన్ లేడి సూపర్‌స్టార్‌గా పేరుతెచ్చుకుంది. ఎంతో మంది హీరోయిన్స్ కు స్ఫూర్తిగా నిలిచింది. అలాంటి శ్రీదేవి మరణ వార్త విన్న ప్రతిఒక్కరూ విషాదంలో మునిగిపోయారు. ఎప్పుడు శ్రీదేవి డెడ్ బాడీని ఇండియాకు తీసుకువస్తారా..? ఎప్పుడు కడసారి చూసుకుందామా..? అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న వేళ... ఆమె మరణంపై వస్తున్న అనుమానాలు అందరినీ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఎంతో సంతోషంగా జీవితాన్ని గడుపుతున్న శ్రీదేవి మృతిపై కూడా ఇన్ని అనుమానాలు రావడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ముందు కార్డియాక్ అరెస్ట్ తో చనిపోయిందని వార్తలు వచ్చాయి... ఆ తరువాత అందాన్ని కాపాడుకోవడానికి ఆమె చేయించుకున్న సర్జరీలే గుండెపోటుకు కారణమయ్యాయని అన్నారు. కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో యాక్సిడెంటల్ డ్రౌనింగ్ అని చెప్పడంతో అసలు డౌట్లు స్టార్ట్ అయ్యాయి. అంతేకాదు.. మద్యం ఎక్కువ సేవించిందని... ఆ మత్తులోనే బాత్రూమ్ లో తూలి, బాత్ టబ్ లో పడిపోయి ఉంటుందని.. ఇలా ఎవరికి తోచినట్టు వాళ్లు అనుకుంటున్నారు. అయితే శ్రీదేవికి మద్యం ఎక్కువ తాగే అలవాటు లేదని అనే వాళ్లు కూడా ఉన్నారు. అటు పోయి ఇటు పోయి ఆఖరికి అన్నీ వేళ్లు బోని కపూర్ వైపే తిరుగుతున్నాయి.. చివరికి అతన్ని కూడా అనుమానించాల్సిన పరిస్థితి దాపురించింది. ఇక పోలీసులు కూడా బోనికపూర్ ను విచారిస్తున్నారు. అది పూర్తయితే కానీ శ్రీదేవి డెడ్ బాడీ ఇండియాకు పంపే అవకాశం లేదు. అప్పటిదాకా ఆమె భౌతికకాయం అక్కడ ఉండాల్సిందే.

మొత్తానికి... పైకి నవ్వుతూ తిరుగుతున్నా, ఆ నవ్వుల వెనుక అంతులేని విషాదం ఉందని ఆమె మరణించిన తరువాత కానీ అర్దం కాలేదు. ఏది ఏమైనా దేశవ్యాప్తంగా కోట్లాది అభిమానుల్ని గెలుచుకున్న అతిలోకసుందరి మరణం కూడా మిస్టరీగా మారడం అత్యంత బాధాకరమైన విషయం...


Also ReadLatest NewsCustomer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here