భారతీయ అమెరికన్ల ఆధిపత్యాన్ని విశ్లేషించే 'స్పెల్లింగ్ ద డ్రీమ్'
on Jun 3, 2020
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా, గత వారం జరగాల్సిన స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ పోటీ క్యాన్సిల్ అయ్యింది. బహుశా వరుసగా 13వ ఏడాది ఒక ఇండియన్ అమెరికన్ అభ్యర్థి ఈ పోటీని గెలుచుకొనే అవకాశాన్ని కోవిడ్-19 అడ్డుకుందని భావించాలేమో. అమెరికా జనాభాలో భారత సంతతికి చెందిన వాళ్లు మహా అయితే 1 శాతం ఉంటారు. కానీ గత స్క్రిప్స్ బీ 31 మంది విజేతల్లో 26 మంది వాళ్లే కావడం విశేషాల్లో కెల్లా విశేషం. ఈ టోర్నమెంట్లో ఇండియన్ అమెరికన్ల ఆధిపత్యం గురించీ, వాళ్ల సాంస్కృతిక విలువల గురించీ నెట్‌ఫ్లిక్స్ కొత్త డాక్యుమెంటరీ 'స్పెల్లింగ్ ద డ్రీమ్' మన కళ్లముందుంచుతుంది.
ఈ డాక్యుమెంటరీని 'లీగ్ ఆఫ్ మిలియన్స్' ఫేమ్ సామ్ రేగా రూపొందించాడు. అతను 2017 స్క్రిప్స్ స్పెల్లింగ్ బీ పోటీలో 7 నుంచి 14 ఏళ్ల వయసు మధ్య ఉన్న నలుగురు ఆశావహుల కథను ఈ డాక్యుమెంటరీలో పొందుపరిచాడు. ఈ పోటీలో పాల్గొనడానికి గరిష్ఠ వయో పరిమితి 14 ఏళ్లు. 83 నిమిషాల నిడివి కలిగిన ఈ డాక్యుమెంటరీని చూసినవాళ్లు ఆశ్చర్య చకితులు కాకమానరు. పోటీలో పాల్గొనే పిల్లల తల్లిదండ్రుల భావోద్వేగాలు, వాళ్లందించే మద్దతు వంటివాటిని ఇప్పటివరకూ ఇండియన్ అమెరికన్ ఫ్యామిలీల గురించి ఏ మెయిన్‌స్ట్రీమ్ సినిమాల్లోనూ మనం చూసి ఉండం.
వలస నిబంధనల సరళీకరణతో అమెరికాకు భారతీయుల వలస 1965లో మొదలైంది. విద్యావంతులైన, వ్యాపారవేత్తలైన భారతీయులు అనేకమంది యు.ఎస్.కు తరలివెళ్లారు. సహజంగానే వారు తమ పిల్లలు అన్నింటా సక్సెస్ కావాలని కోరుకున్నారు. ఈఎస్‌పీఎన్‌లో స్క్రిప్స్ బీ ప్రసారం కావడం 1994లో మొదలైనప్పట్నీంచీ, ఇండియన్ అమెరికన్ పిల్లలు తొలిసారిగా తమను తాము తెరపై చూసుకుంటూ వచ్చారు. ఇది మిగతా పిల్లలకు ప్రేరణనిచ్చిందనీ, అందుకే ఈ పోటీలో ఇండియన్ అమెరికన్ పిల్లల డామినేషన్ కనిపిస్తుందనీ ఈ డాక్యుమెంటరీ విశ్లేషిస్తుంది.