'సూరారై పొట్రు' సంచలనం.. ఐఎండీబీలో టాప్ రేటింగ్ ఇండియన్ ఫిల్మ్!
on May 13, 2021
సూర్య సినిమా సూరారై పొట్రు (తెలుగులో 'ఆకాశం నీ హద్దురా') అరుదైన ఘనతను సాధించింది. ఐఎండీబీలో అత్యధిక రేటింగ్ పొందిన ఇండియన్ ఫిల్మ్‌గా అది నిలిచింది. తెలుగు వనిత సుధ కొంగర డైరెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ ఐఎండీబీలో 9.1 రేటింగ్ సాధించింది. ఏ భారతీయ సినిమాకైనా ఇదే అత్యధికం. ఇక అంతర్జాతీయంగా చూస్తే ఐఎండీబీ రేటింగ్ పరంగా మూడో స్థానాన్ని అది ఆక్రమించింది.
'సూరారై పొట్రు' కంటే ముందున్న రెండు సినిమాలూ క్లాసిక్స్‌గా పేరు గాంచినవే. మొదటి స్థానంలో 9.3 రేటింగ్‌తో టిమ్ రాబిన్స్, మోర్గాన్ ఫ్రీమాన్ నటించగా ఫ్రాంక్ డారబాంట్ డైరెక్ట్ చేసిన 'ద షాషంక్ రిడెంప్షన్' (1994) నిలవగా, రెండో స్థానాన్ని 9.2 రేటింగ్‌తో ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పోలా మూవీ 'ద గాడ్‌ఫాదర్' పొందింది. ఈ క్లాసిక్‌లో మార్లన్ బ్రాండో, అల్ పాసినో లాంటి లెజెండ్స్ నటించారు.
ఆ క్లాసిక్స్ తర్వాత స్థానం 'సూరారై పొట్రు' పొందడం చిన్న విషయం కాదు. 59,654 మంది ఓటింగ్‌తో ఈ సినిమా 9.1 రేటింగ్ పొందింది. పేదలకు అతి తక్కువ ధరకు విమాన యానం కల్పించాలనే లక్ష్యంతో ఎయిర్ దక్కన్ సంస్థను నెలకొల్పిన జి.ఆర్ గోపీనాథ్ జీవితం ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో సూర్య, అపర్ణ బాలమురళి అద్భుతమైన నటనను ప్రదర్శించగా, సుధ కొంగర దర్శకత్వం ఈ సినిమాను క్లాసిక్ రేంజికి చేర్చింది.
'సూరారై పొట్రు' ఐఎండీబీలో రేటింగ్ పరంగా అంతర్జాతీయ స్థాయిలో మూడో స్థానంలో నిలవడం, అత్యధిక రేటింగ్ పొందిన భారతీయ చిత్రంగా నిలవడంతో సూర్య అభిమానులు ఈ సినిమా హ్యాష్‌ట్యాగ్‌ను సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి తీసుకొచ్చారు.
Also Read