చెన్నైలో బాయ్‌ఫ్రెండ్‌తో శ్రుతి చెట్టపట్టాల్!
on Feb 28, 2021
బ్యూటిఫుల్ హీరోయిన్ శ్రుతి హాసన్ ప్రస్తుతం శంతను హజారికా అనే డూడిల్ ఆర్టిస్ట్‌తో పీకల్లోతు ప్రేమలో మునగి తేలుతోందని టాలీవుడ్, కోలీవుడ్ వర్గాలతో పాటు బాలీవుడ్ వర్గాలు కూడా కోడై కూస్తున్నాయి. ఇద్దరూ కలిసి పబ్లిగ్గా ఎప్పుడైతే తొలిసారి కనిపించారో, అప్పట్నుంచీ వారు వార్తల్లో నలుగుతూ వస్తున్నారు. ఆ ఇద్దరి మధ్య నిజంగా ఏం జరుగుతోందో తెలుసుకోవాలని ఫ్యాన్స్ ఉవ్విళ్లూరుతుంటే, వారు సోషల్ మీడియాలో తమ ఫొటోలను రెగ్యులర్‌గా షేర్ చేస్తూ, ఇంకా ఇంకా క్యూరియాసిటీ పెంచుతున్నారు. సినీ వర్గాలైతే ఢిల్లీ వాస్తవ్యుడైన శంతనుతో శ్రుతి డేటింగ్లో ఉందనే నమ్ముతున్నాయి.
లేటెస్ట్గా ఆ ఇద్దరూ చెన్నైలో పబ్లిక్ అప్పీరెన్స్ ఇచ్చారు. ఒక క్లాతింగ్ సెంటర్‌కు షాపింగ్‌కు వెళ్లిన ఆ ఇద్దరూ నాలుక బయటపెట్టి వెక్కిరిస్తన్నట్లు డిజైన్ చేసిన ఒకే విధమైన ఫేస్‌మాస్క్‌లు ధరించి, ఒకరినొకరు హత్తుకొని ఫొటోలుకు పోజులు కూడా ఇచ్చారు. ఆ ఫొటోలను తమ సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా షేర్ చేశారు. చెన్నైకు వచ్చిన శంతనును శ్రుతి తన తండ్రి కమల్ హాసన్ వద్దకు తీసుకువెళ్లి పరిచయం చేసింది. శ్రుతి 35వ బర్త్‌డేకి ఆమెతో కలిసి దిగిన ఓ అందమైన ఫొటోను షేర్ చేసిన శంతను, దానికి "హ్యాపీ బర్త్‌డే ప్రిన్సెస్" అని క్యాప్షన్ జోడించడంతో, వారి మధ్య రిలేషన్షిప్ వేరే లెవల్లో ఉందని అందరికీ అర్థమైంది.
ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో శ్రుతితో తన అనుబంధం గురించి క్లియర్‌గా చెప్పకుండా దాటేశాడు శంతను. మ్యూజిక్, ఆర్ట్ విషయంలో తమ ఇద్దరివీ ఒకే రకమైన అభిరుచులు కావడంతో, తమ మధ్య మంచి స్నేహానుబంధం నెలకొందని మాత్రం అతను చెప్పాడు. డేటింగ్లో ఉన్నారా, లేదా అని అడిగితే మాత్రం సమాధానం చెప్పలేదు.
శ్రుతి ఇదివరకు ఇటాలియన్ అయిన మైఖేల్ కోర్సలేతో రెండేళ్లపాటు డేటింగ్ చేసి, 2019లో విడిపోయింది. తమ ఇద్దరివీ సుదూర ప్రాంతాలు కావడంతో తమ బంధం వర్కవుట్ అవదని నిర్ణయించుకొని విడిపోతున్నామని అప్పట్లో ప్రకటించాడు మైఖేల్.