'షారుఖ్-కాజోల్' తర్వాత అలాంటి జోడీ 'అబ్రామ్-ఆరాధ్య'!
on Sep 24, 2020
కొంత కాలం క్రితం ఓ ఇంటర్వ్యూలో షారుఖ్ ఖాన్ చెప్పిన విషయం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. జోకులు పేల్చడంలో, సమయస్ఫూర్తిగా జవాబివ్వడంలో షారుఖ్ పెట్టింది పేరు. ఆ ఇంటర్వ్యూలో అతనికి ఓ ప్రశ్న ఎదురైంది. రణబీర్ కపూర్-దీపికా పడుకోనే, రణవీర్ సింగ్-దీపికా పడుకోనే, అలియా భట్-సిద్ధార్థ్ మల్హోత్రా, ఫవాద్ ఖాన్-సోనమ్ కపూర్ జంటల్లో ఏ జంట షారుఖ్-కాజోల్ తరహా జంటగా పేరు తెచ్చుకుంటుందనేది ఆ ప్రశ్న.
షారుఖ్, కాజోల్ బ్లాక్‌బస్టర్ పెయిర్‌గా పేరు తెచ్చుకున్న విషయం తెలిసిందే. 'బాజీగర్'తో మొదలైన వారి జోడీ, దిల్వాలే దుల్హనియా లే జాయేంగే, కరణ్ అర్జున్, కుచ్ కుచ్ హోతా హై, కభీ ఖుషి కభీ ఘమ్, మై నేమ్ ఈజ్ ఖాన్, దిల్వాలే సినిమాల దాకా అప్రతిహత విజయాలతో సాగింది.
ఇంటర్వ్యూలో తనకు ఎదురైన ప్రశ్నకు షారుఖ్ ఏమని జవాబిచ్చాడో తెలుసా? పైన చెప్పిన నాలుగు జంటలు కాకుండా ఒక కొత్త జంట పేరును తెరమీదకు తెచ్చాడు. ఆ జంట.. తన కొడుకు అబ్రామ్, అమితాబ్ బచ్చన్ మనవరాలు ఆరాధ్య! ఆ ఇద్దరూ తదుపరి షారుఖ్-కాజోల్ లాంటి జంట అవుతారని షారుఖ్ చెప్పడం ఆన్లైన్లో విరివిగా ప్రచారంలోకి వచ్చింది.
విశేషమేమంటే.. దీనికి అమితాబ్ బచ్చన్ స్పందించడం! షారుఖ్ చెప్పిన విషయాన్ని బిగ్ బి దృష్టికి తీసుకువెళ్లగా "బహుశా అతని మాటలు నిజం కావచ్చు" అని స్పోర్టివ్‌గా నవ్వుతూ సమాధానమిచ్చారు. ఈ కథలో ఇంకో చెప్పకోదగ్గ సంగతి కూడా ఉంది. ఇంటర్వ్యూ చేసిన జర్నలిస్ట్ "అబ్రామ్ కంటే ఆరాధ్య పెద్దది కదా.. మరి ఎలా షారుఖ్-కాజోల్ జోడీ అవుతుంద"ని ప్రశ్నిస్తే, షారుఖ్ ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా ప్రేమకు వయసుతో నిమిత్తం లేదు అని జవాబిచ్చాడు. మరి ఇటు షారుఖ్, అటు అమితాబ్ మాటలు నిజమై, పెరిగి పెద్దయ్యాక అబ్రామ్-ఆరాధ్య జోడీ తెరపై కనిపిస్తుందేమో చూడాలి.