బ్లఫ్మాస్టర్... పాటేదో బావుందే!
on Oct 31, 2018
పాటలు హిట్టయితే... సినిమా సగం హిట్టయినట్టే అని ఇండస్ట్రీ జనాలు నమ్ముతారు. 'గీత గోవిందం' విడుదలకు ముందు 'ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే..' పాట ఎంత హిట్టయ్యిందో.. సినిమాకు ఎంత క్రేజ్ తీసుకొచ్చిందో... ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అలాగే, ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన 'ఛలో'కి 'చూసి చూడంగానే నచ్చేశావే...' పాట క్రేజ్ తెచ్చింది. చిన్న సినిమాలకు కూడా ఒక్కోసారి పాటలు హెల్ప్ చేస్తాయి. 'జ్యోతిలక్ష్మి'లో ఛార్మికి జోడీగా, 'ఘాజి', 'క్షణం', 'అప్పట్లో ఒకడుండేవాడు' సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించిన సత్యదేవ్ హీరోగా నటిస్తున్న సినిమా 'బ్లఫ్మాస్టర్'. ఈ సినిమాకు 'ఏ మాయో ఏమో తెలియదే..' పాట హెల్ప్ అయ్యేట్టు వుంది.
పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన 'లోఫర్', 'రోగ్', 'జ్యోతిలక్ష్మి' సినిమాలకు, నాగశౌర్య, నిహారిక జంటగా నటించిన 'ఒక మనసు' సినిమాకు సంగీతం అందించిన సునీల్ కశ్యప్ 'బ్లఫ్మాస్టర్'కి సంగీత దర్శకుడు. మంచి మెలోడీలు ఇస్తాడని అతడికి పేరుంది. 'బ్లఫ్మాస్టర్'లో 'ఏ మాయో ఏమో తెలియదే..' పాటతో మరోసారి తన పేరు నిలబెట్టుకున్నాడు. ముఖ్యంగా సింగర్ సునీత వాయిస్ పాటకు ప్లస్ అయ్యింది. విన్నవారంతా ఈ పాటేదో బావుందే అని ప్రశంసిస్తున్నారు. తమిళంలో హిట్టయిన 'చతురంగ వేట్టై' సినిమాకు రీమేక్ ఈ 'బ్లఫ్ మాస్టర్'. పూరి జగన్నాథ్ శిష్యుడు గణేష్ దర్శకత్వం వహిస్తున్నారు. 'ఎక్కడికి పోతావు చిన్నవాడా', 'శ్రీనివాస కళ్యాణం' సినిమాల్లో నటించిన నందితా శ్వేతా హీరోయిన్.