English | Telugu

"భయపడేవాడే బేరానికొస్తాడూ.. మన దగ్గర బేరాల్లేవమ్మా" అని తేల్చేసిన మహేశ్!

on Nov 22, 2019

 

"భయపడేవాడే బేరానికొస్తాడూ.. మన దగ్గర బేరాల్లేవమ్మా".. ఈ డైలాగ్ ఆడియో వింటే అచ్చం సూపర్ స్టార్ కృష్ణ నోట్లోంచే వచ్చినట్లు అనిపిస్తుంది. కానీ అది చెప్పింది సూపర్ స్టార్ మహేశ్. అవును. 'సరిలేరు నీకెవ్వరు' టీజర్‌లో కొండారెడ్డి బురుజు ముందు నిలబడి, రౌడీలను ఎదుర్కొనే సందర్భంలో మహేశ్ నోటివెంట వచ్చిన డైలాగ్ అది. మూడు రోజుల నుంచీ క్షణాలను లెక్కబెట్టుకుంటూ వస్తోన్న మహేశ్ ఫ్యాన్స్ నిరీక్షణ కొలిక్కి వచ్చింది. 'సరిలేరు నీకెవ్వరు' టీజర్ వచ్చేసింది. నవంబర్ 19న చెప్పినట్లే శుక్రవారం.. అంటే నవంబర్ 22 సాయంత్రం సరిగ్గా 5 గంటల 4 నిమిషాలకు తన సొంత యూట్యూబ్ చానల్లో టీజర్‌ను రిలీజ్ చేశాడు మహేశ్‌బాబు. 

1 నిమిషం 26 సెకన్ల నిడివి ఉన్న టీజర్‌లో మొత్తం ఐదు డైలాగ్స్ ఉంటే మూడింటిని మహేశ్ చెప్పాడు. విజయశాంతి, ప్రకాశ్ రాజ్‌లకు చెరొకటి కేటాయించారు. ఈ మూవీలో మహేశ్ ఆర్మీ మేజర్‌గా నటిస్తున్నాడు కాబట్టి ఆ యాంగిల్‌పైనే ఎక్కువ ఫోకస్ పెట్టి టీజర్‌ను కట్ చేశాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి. "మీరెవరో మాకు తెలీదు. మీకూ, మాకూ ఏ రక్త సంబంధమూ లేదు. కానీ మీ కోసం, మీ పిల్లల కోసం పగలూ, రాత్రీ, ఎండా, వానా అని లేకుండా పోరాడుతూనే ఉంటాం. ఎందుకంటే మీరు మా బాధ్యత." అంటూ సైనికుడంటే ఏమిటో తెలియజేశాడు మహేశ్. దేశ భద్రత అంటే, కేవలం సరిహద్దులను కాపాడుకోవడమే కాదు, పౌరులను కాపాడుకోవడం కూడా.. అని గుర్తు చేశాడు. ఈ సందర్భంగా అతను టెర్రరిస్టుల నుంచి స్కూలు పిల్లల్ని కాపాడినట్లు ఒక సన్నివేశం తెలియజేస్తుంది. ఆర్మీ మేజర్‌గా మహేశ్ ఆహార్యం, అతని హావభావాలు, అతని బాడీ లాంగ్వేజ్ అబ్బురపరిచేలా ఉన్నాయి. ఒక సైనికుడు తన ప్రాణాల్ని పణంగా పెట్టి, తన బంధువు కాకపోయినా, అపరిచితుడైనా, తోటి దేశపౌరునిగా మరో వ్యక్తిని ఎలా కాపాడుకుంటాడో, మేజర్ అజయ్‌కృష్ణ పాత్రతో దర్శకుడు చూపిస్తున్నాడు.

అజయ్‌కృష్ణ ఎంతటి ధైర్య సాహసాలున్న సైనికుడైనప్పటికీ, అతనిలోనూ చమత్కారం ఉంది. తన ముందున్న యాక్టర్ అజయ్‌తో "మీరంతా నేను కాపాడుకునే ప్రాణాలురా. మిమ్మల్నెలా చంపుకుంటాన్రా. మీకోసం ప్రాణాలిస్తున్నాంరా అక్కడ. మీరేమో కత్తులు గొడ్డళ్లేసుకొని ఆడాళ్ల మీద.. బాధ్యత ఉండక్కర్లా" అని సెటైరికల్‌గా చెప్తూనే, అతని బాధ్యతను గుర్తు చేస్తున్నాడు. ఆడవాళ్ల మీద ప్రతాపం చూపించబోయిన అతడికి దేహశుద్ధిచేసి, హితోపదేశం చేసే వ్యక్తిగా అజయ్‌కృష్ణ మనకు కనిపిస్తున్నాడు. ఆ తర్వాత టీజర్‌లో విజయశాంతిని పరిచయం చేశారు. ఈ మూవీకి సంబంధించి ఇటీవల విజయశాంతికి సంబంధించిన ఏ లుక్‌నైతే బయటపెట్టారో, అదే లుక్‌తో ఆమె టీజర్‌లో దర్శనమిచ్చారు. ఆమె హావభావాలు, బాడీ లాంగ్వేజ్ చూస్తే ఒక శక్తిమంతమైన పాత్రలో ఆమె కనిపించడం ఖాయమనేది స్పష్టం. "గాయం విలువ తెలిసినవాడే సాయం చేస్తాడు బాబాయ్" అంటూ యాక్టర్ సూర్యతో ఆమె చెప్పే మాటలు మహేశ్‌ని ఉద్దేశించినవని ఇట్టే అర్థం చేసుకోవచ్చు. 'గాయం విలువ' అనే మాటను ఆమె ప్రయోగించడాన్ని బట్టి, సూర్యకు మహేశ్ ఏదో సాయం చేశాడనీ, అందుకే ఆమె ఆ మాటలు ఉపయోగించిందనీ ఊహించవచ్చు.

'సరిలేరు నీకెవ్వరు'లో ప్రకాశ్ రాజ్‌ రాయలసీమకు చెందిన పొలిటీషియన్ ఎద్దుల నాగేంద్ర అనే పాత్రను చేస్తున్నాడు. ప్రజా సంక్షేమ పార్టీ వ్యక్తిగా అతను కనిపిస్తాడు. అతనేదో పెద్ద మీటింగ్ పెట్టుకుంటే అక్కడికి బైక్ మీద మహేశ్ వస్తున్నట్లు అర్థమవుతుంది. ప్రకాశ్ రాజ్‌కు అడ్డా లాంటి కొండారెడ్డి బురుజు దగ్గరే అతని మనుషుల్ని చావగొట్టి "భయపడేవాడే బేరానికొస్తాడూ.. మన దగ్గర బేరాల్లేవమ్మా" అంటూ ఫెరోషియస్‌గా మహేశ్ చెప్పే డైలాగ్ అదిరిపోయింది. తాను బేరం కోసం రాలేదనీ, అంతు తేల్చడానికే వచ్చాననీ మాటలతో పాటు చేతలతోనూ అతను చూపించాడు.

"ప్రతి సంక్రాంతికి అల్లుళ్లొస్తారు.. ఈ సంక్రాంతికి మొగుడొచ్చాడు" అంటూ ప్రకాశ్ రాజ్ ఫ్రస్ట్రేషన్‌తో అనడం చూస్తే.. ఆ 'మొగుడు' మన మహేశ్ అనే విషయం ప్రత్యేకించి చెప్పాలా! సో.. 'సరిలేరు నీకెవ్వరు' సినిమా సంక్రాంతిని టార్గెట్ చేసుకుంది కాబట్టి టీజర్ కోసం ప్రకాశ్ రాజ్ చేత ఆ డైలాగ్ పలికించారా? లేక సినిమాలోనూ సంక్రాంతికి ప్రాధాన్యం ఉందా? అనే విషయం ఆసక్తికరం. మొత్తంగా మహేశ్, విజయశాంతి, ప్రకాశ్ రాజ్, రాజేంద్రప్రసాద్ పాత్రల్ని ప్రధానంగా పరిచయం చేసిన ఈ టీజర్‌లో హీరోయిన్ రష్మికా మందన్నకు చోటు దక్కలేదు. బహుశా డిసెంబర్‌లో పాటతో ఆమెను పరిచయం చేయవచ్చు. కొండారెడ్డి బురుజుకు కూడా ఈ టీజర్‌లో సముచిత స్థానం లభించింది. మహేశ్ కేరెక్టర్‌లోని వీరత్వాన్ని వెల్లడి చేసేలా, అదే సమయంలో సైనికుడంటే ఏమిటో తెలిపేలా ఉన్న ఈ టీజర్ అతని అభిమానుల్ని అంచనాలకు తగ్గట్లే అలరిస్తుందనేది నిస్సందేహం. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్, రత్నవేలు సినిమాటోగ్రఫీతో 'సరిలేరు నీకెవ్వరు' మూవీ ఏ రేంజిలో ఉండబోతోందో ఒక శాంపిల్‌గా చూపించింది టీజర్. జనవరి 11న వస్తున్న సినిమా సంక్రాంతి రేసులో 'సరిలేరు నీకెవ్వరు' అనిపించుకొనే అవకాశాలు అత్యధికంగా కనిపిస్తున్నాయి.


Cinema GalleriesLatest News


Video-Gossips