నందితా శ్వేతాకు మహేష్ బావ విలన్
on Jul 9, 2020
సూపర్‌స్టార్ మహేష్‌బాబు బావ, మంజుల భర్త సంజయ్ స్వరూప్ యాక్టర్ అన్న సంగతి తెలిసిందే. శ్రీమతి నిర్మించిన 'ఏ మాయ చేసావే'లో హీరో నాగచైతన్యకు తండ్రిగా నటించారు. 'అర్జున్ రెడ్డి'లోనూ విజయ్ దేవరకొండ తండ్రిగా చేశారు. 'ఆరెంజ్' సినిమాలో రామ్ చరణ్ అక్క బావా పాత్రల్లో నిజ జీవితంలో భార్య భర్తలు అయిన మంజుల, సంజయ్ నటించారు. ఇవే కాదు... పలు సినిమాల్లో సంజయ్ స్వరూప్ కీలక పాత్రలు పోషించారు. అయితే, ఇప్పటివరకు ఆయన చేసినవన్నీ సాఫ్ట్ క్యారెక్టర్సే. బట్, ఫర్ ఎ ఛేంజ్... ఫస్ట్ టైమ్ ఆయన విలన్ రోల్ చేస్తున్నారు.
'ఎక్కడికి పోతావు చిన్నవాడా', 'శ్రీనివాస కళ్యాణం' చిత్రాల్లో నటించిన హీరోయిన్ నందితా శ్వేతా ప్రధాన పాత్రలో ఓ ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా 'అక్షర' తెరకెక్కుతోంది. విద్యావ్యవస్థలో లోపాలను ప్రశ్నిస్తూ రూపొందుతోన్న ఈ సినిమాలో ఒక కార్పొరేట్ కాలేజీ చైర్మన్‌గా విలన్ పాత్ర సంజయ్ స్వరూప్ చేస్తున్నారు. ఆయన కాలేజీలో పాఠాలు చెప్పే లెక్చరర్ పాత్రలో నందితా శ్వేతా కనిపిస్తారు. ఒక రకంగా ఆమెకు సంజయ్ విలన్ అన్నమాట.