సంచలన కామెడీ హీరోకు ప్రోత్సాహం కరువు!
on Nov 22, 2020
ఒకప్పుడు 'యమలీల'లో అలీ హీరోగా నటించడం సంచలనం అయితే, 2014లో 'హృదయ కాలేయం'తో సంపూర్ణేష్ బాబు హీరోగా పరిచయం కావడం సంచలనం. అతను హీరో అంటే ఎవరూ ఓ పట్టాన నమ్మరు. అయితే 'హృదయ కాలేయం'' ట్రైలర్ విడుదలైనప్పట్నుంచీ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో దానిని ప్రశంసిస్తూ, సంపూర్ణేష్ బాబు ప్రెజెన్స్‌ను అభినందిస్తూ ఎంతగానో ప్రచారం వచ్చింది. విడుదలకు ముందు ఎంత హంగామా చేసిందో, విడుదల తర్వాత కూడా ఆ సినిమా అంతే హంగామా చేయడం విశేషం.
సంపూర్ణేష్ బాబు (సినిమాలో పాత్ర పేరు కూడా అదే) అనే చిల్లర దొంగగా తెరపై కనిపించినంత సేపూ అతను నవ్వించాడు. ఆఖరుకి తన డాన్సులతోనూ హాస్యాన్ని పంచాడు. ఆ టైమ్‌లో కాలేజీ యూత్‌లో సంపూర్ణేష్‌కు మంచి క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత 'సింగం 123', 'కొబ్బరిమట్ట' చిత్రాల్లో హీరోగా అలరించాడు సంపూ. అయితే 'కొబ్బరిమట్ట' చిత్రం నిర్మాణంలో మూడేళ్లకు పైగా ఉండటం వల్ల అతని కెరీర్ ఊహించినంత వేగం పుంజుకోలేదు. కొన్ని సినిమాల్లో అతను అతిథి పాత్రల్లోనూ మెరిశాడు. అతను హీరోగా రెండేళ్ల క్రితం ప్రారంభమైన 'టక్కరిదొంగ చక్కనిచుక్క' సినిమా పరిస్థితి ఏమిటనేది తెలీదు.
టాలీవుడ్‌లో ఆరేళ్ల క్రితం ఓ సంచలన నటుడిగా ఆవిర్భవించిన సంపూర్ణేష్ బాబు తనకొచ్చిన ఇమేజ్‌ను, క్రేజ్‌ను కంటిన్యూ చేయలేకపోవడానికి కారణం? నిర్మాతల నుంచి, దర్శకుల నుంచి ఆశించిన అవకాశాలు రాకపోవడమే అని చెప్పాలి. దర్శకుడు-నిర్మాత సాయిరాజేశ్ మాత్రమే 'హృదయ కాలేయం', 'కొబ్బరిమట్ట' చిత్రాల్లో హీరోగా నటింపజేసి సంపూను ప్రోత్సహించారు. కాస్త పేరున్న నిర్మాతలు అతనిని ఎంకరేజ్ చేస్తే అతను మరిన్ని నాణ్యమైన చిత్రాలతో మనల్ని నవ్విస్తాడని చెప్పొచ్చు. సంపూను ఎంకరేజ్ చేసే నిర్మాతలు, దర్శకులు ఎవరు?
- YM
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
