English | Telugu

టాలీవుడ్ హీరోయిన్స్: వెబ్ సిరీస్‌కు సై!

on Dec 7, 2019

 

హిందీ తారలే కాదు, తెలుగు తారలు కూడా ఇప్పుడు వెబ్ సిరీస్ వైపు దృష్టి సారిస్తున్నారు. ఒకరి తర్వాత ఒకరుగా వెబ్ సిరీస్‌కు సైన్ చేస్తూ మారుతున్న కాలంతో తామూ మారుతున్నామని తెలియజేస్తున్నారు. స్మార్ట్ ఫోన్ వినియోగం పెరిగాక జనం యూట్యూబ్‌తో పాటు అమెజాన్ ప్రైం, నెట్‌ఫ్లిక్స్ వంటి ఆన్‌లైన్ స్ట్రీమింగ్ సైట్లకు అతుక్కుపోతున్న విషయం మనకు తెలుసు. ఆ సైట్లను దృష్టిలో ఉంచుకొని అనేకమంది వెబ్ సిరీస్‌ను ప్లాన్ చేస్తున్నారు. వాటిపై వచ్చే ఆదాయం అంతకంతకూ పెరుగుతుండటంతో పేరున్న సంస్థలూ వెబ్ సిరీస్‌ను నిర్మిస్తున్నాయి. 'బ్రీత్', 'లస్ట్ స్టోరీస్', 'సాక్రెడ్ గేమ్స్', 'మిర్జాపూర్', 'ఇన్‌సైడ్ ఎడ్జ్', 'ద ఫ్యామిలీ మ్యాన్' వంటి హిందీ వెబ్ సిరీస్‌లో పేరుపొందిన తారలు సైఫ్ అలీ ఖాన్, మనోజ్ బాజ్‌పేయి, కియారా అద్వానీ, మాధవన్, రాధికా అప్టే, మనీషా కొయిరాలా, వివేక్ ఓబరాయ్, నవాజుద్దీన్ సిద్దిఖీ, పంకజ్ త్రిపాఠి, రిచా చద్దా వంటివాళ్లు నటించడంతో టాలీవుడ్ తారలూ వాటిపై ఆసక్తి చూపిస్తున్నారు. 

ఇప్పటికే 'ద ఫ్యామిలీ మ్యాన్'లో మనోజ్ బాజ్‌పేయి భార్యగా కీలక పాత్రలో ప్రియమణి నటించి వీక్షకుల ఆదరణపొందింది. ఇటీవలే 'లస్ట్ స్టోరీస్' తెలుగు వెర్షన్‌లో తెలుగమ్మాయి ఈషా రెబ్బా నటించడం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. 'ఘాజి', 'అంతరిక్షం' సినిమాల దర్శకుడు సంకల్ప్ రెడ్డి డైరెక్ట్ చేస్తోన్న సెగ్మెంట్‌లో ఈషా నటిస్తోంది. ఇప్పటి దాకా పక్కింటమ్మాయి తరహా పాత్రలు చేస్తూ వచ్చిన ఆమె ఈ సిరీస్‌లో 'బోల్డ్'గా కనిపించనుండటం విశేషం. ఆమెకంటే ముందు నాగబాబు కుమార్తె నిహారిక 'ముద్దపప్పు ఆవకాయ', 'నాన్న కూచి' సిరీస్ చేసింది. అలాగే నవదీప్, అదిత్ అరుణ్, తేజస్విని మదివాడ కలిసి 'మన ముగ్గురి లవ్‌స్టోరీ' అనే వెబ్ సిరీస్ చేశారు. మంచు లక్ష్మి 'మిసెస్ సుబ్బలక్ష్మి', అమల అక్కినేని 'హై ప్రీస్టెస్' సిరీస్ చేశారు. ఇప్పుడు పేరుపొందిన హీరోయిన్లు సైతం ఈ వెబ్ సిరీస్‌ ఫార్మట్‌కు ఆకర్షితులవుతున్నారు. 

సమంత ఏ స్థాయి నటో మనకు తెలుసు. నాగచైతన్యతో వివాహానికు ముందు టాలీవుడ్‌లోని టాప్ హీరోయిన్స్‌లో ఒకరిగా వెలిగిపోతూ వచ్చిన ఆమె, పెళ్లి తర్వాత మరింతగా ప్రేక్షకులని ఆకట్టుకుంటూ వస్తోంది. 'మెర్సాల్', 'రంగస్థలం', 'మహానటి', 'ఇరుంబు తిరై', ('అభిమన్యుడు'), 'యు టర్న్', 'సూపర్ డీలక్స్' (తమిళం), 'మజిలీ', 'ఓ బేబీ' సినిమాలతో ఆమె ఇమేజ్ మరింత పెరిగింది. ప్రస్తుతం '96' రీమేక్‌లో శర్వానంద్‌తో కలిసి నటిస్తోంది. అలాంటి ఆమె ఇప్పుడు 'ద ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్‌లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాకుండా, ఇప్పటికే షూటింగ్‌లో పాల్గొంటూ అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. రాజ్ అండ్ డీకే డైరెక్ట్ చేస్తోన్న ఈ సిరీస్ అమెజాన్ ప్రైం వీడియోలో టెలికాస్ట్ కానున్నది. ఇందులో తను ఒక డ్రీం రోల్‌లో నటిస్తున్నానని సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ద్వారా తెలిపింది సమంత. "మై వెబ్ సిరీస్ డెబ్యూ విత్ ద మోస్ట్ కిక్‌యాస్ షో" అంటూ ఆ వెబ్ సిరీస్‌పై తన అభిప్రాయాన్ని ప్రకటించింది. ఈ వెబ్ సిరీస్‌కు గ్లోబల్ రీచ్ ఉండటం, ఇప్పటి దాకా తాను సినిమాల్లో చెయ్యని పలు కోణాలున్న రోల్ కావడం వల్లే ఈ సిరీస్ చేస్తున్నానని తెలిపింది సమంత. 

సమంత తరహాలో మరో పాపులర్ హీరోయిన్ సైతం వెబ్ సిరీస్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఆమె 'బాహుబలి'లో అవంతిక పాత్ర ద్వారా దేశవ్యాప్తంగా అభిమాన గణాన్ని సంపాదించుకున్న తమన్నా. హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కానున్న 'ద నవంబర్ స్టోరీ' అనే తమిళ వెబ్ సిరీస్‌లో ఆమె నటించనున్నది. తండ్రీకూతుళ్ల మధ్య బంధం ప్రధానంగా రూపొందే ఈ సిరీస్‌లో కూతురిగా తమన్నా, తండ్రిగా ప్రముఖ తమిళ క్యారెక్టర్ ఆర్టిస్ట్ జి.ఎం. కుమార్ నటించనున్నారు. క్రిమినల్ అయిన తండ్రిని మంచి మనిషిగా మార్చే కూతురిగా తమన్నా ఈ సిరీస్‌లో కనిపిస్తుందని సమాచారం. రెండున్నర గంటల సినిమాల్లో కనిపించే రోల్స్ కంటే మరింత చాలెజింగ్ రోల్స్ ఈ వెబ్ సిరీస్‌లో లభిస్తున్నాయనీ, తనలాంటి తారలకు ఈ వెబ్ సిరీస్ బాగా ఉపకరిస్తాయనీ అంటోంది తమన్నా. ఒక వెబ్ సిరీస్ చేయడమంటే ఐదు సినిమాలు చేసిన దానితో సమానమని, కానీ తక్కువ సమయంలోనే వెబ్ సిరీస్‌ను చేసేయవచ్చని ఆమె తెలిపింది.  ఇలా పేరుపొందిన తారలు చేయడానికి ముందుకు వస్తుండటంలో రాబోయే రోజుల్లో వెబ్ సిరీస్ అనేవి ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో ప్రధాన పాత్ర వహించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

 


Cinema GalleriesLatest News


Video-Gossips