ఏం మాయ చేశావయ్యా...!
on Oct 7, 2017
పెళ్లిల్లు స్వర్గంలో జరుగుతాయట. జరిగిపోయిన పెళ్లికి బాజాలు వాయించడమే ఇక్కడ జరిగేది. ఇది పెద్దల మాట. అది నమ్మకం కాదు.. నిజం అని చైతూ, సమంత పెళ్లితో తేలిపోయింది. ఏడేళ్ల క్రితం ‘ఏమాయ చేశావె’తో ఇద్దరూ కలిశారు. ఏడాళ్లు నిండాయో లేదో.. అగ్నిసాక్షిగా ఏడడుగులు నడిచేశారు. నిజంగా మాయ కాకపోతే ఏంటి?.
చైతూ తొలి సినిమా ‘జోష్’ పెద్ద ఫ్లాప్. కుర్రాడి యాక్టింగ్ పై కూడా విమర్శలొచ్చాయ్. ‘బిడ్డొచ్చిన వేళ.. గొడ్డొచ్చిన వేళ.. ఇల్లాలు ఇంట్లో అడుగుపెట్టిన వేళ’ అంటారు కదా! అలా.. తన రెండో సినిమా కథానాయికగా అడుగుపెట్టింది సమంత. అంతే.. కుర్రాడి ఫేట్ మారిపోయింది. తొలి విజయాన్ని అందుకున్నాడు. ‘100% లవ్’తో తొలి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. అక్కినేని వారింట మూడో స్టార్ గా అవతరించాడు.
ఇదంతా దేవుడి సిగ్నల్స్. ‘కెరీర్లో అడుగుపెడితేనే ఇలా ఉంటే.. జీవితంలో అడుగుపెడితే ఎలా ఉంటుంది?’ అనే ఆలోచన కలిగించడానికి ఆయన చేసిన చిన్న గిమ్మిక్కు. తగ్గట్టుగానే ఇద్దర్నీ మాయ చేశాడు. ప్రేమాయలో పడేశాడు. తన తొలి విజయంలో సోల్ మేట్ నే భాగస్తురాలిని చేశాడు. తర్వాత ఆ అమ్మాయినే జీవిత నాయకను చేశాడు. నిజంగా ‘ఏం మాయ చేశావయ్యా’!
‘ఏడడుగుల సంబంధం... ఏడు జన్మల అనుబంధం’ అంటారు కదా! దైవసాక్షిగా ఎప్పుడో ఒకటైన ఈ జంట... భౌతిక ప్రపంచానికి ఇప్పుడు భార్యాభర్తలు. తంతు బ్రహ్మండంగా ముగిసింది. ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు.. ఒకే జన్మలో రెండు పెళ్లిళ్లన్నమాట. కల్యాణ వైభోగం అంటే ఇదే.
నిజంగా వీరి పెళ్లి ఫొటోలు చూస్తుంటే ముచ్చటేస్తోంది. మనం సాధారణంగా చూసే వధూవరులుగా లేరు ఇద్దరూ. బిడియాలు, భయాలు, ఆలోచనలు, అనుమానాలు వీటన్నింటినీ పక్కనపెట్టి పెళ్లిని ఓ ఆటగా ఎంజాయ్ చేస్తున్నారు. వీరి జీవితం కూడా ఇలా సరదాగా సాగిపోవాలని.. అన్నీ విజయాలే కలగాలని ఆశిద్దాం.